త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వచ్చే ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. సెప్టెంబర్–అక్టోబర్‌లో జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరగనున్న ఈ క్రీడలకు బల్లెం వీరుడి ఎంపికపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అడిల్లే సుమరివాలా స్పష్టం చేశారు.

P

Sports | Published On Jun 27, 2026, 12.23 pm IST

Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..
Advertisement

Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వచ్చే ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. సెప్టెంబర్–అక్టోబర్‌లో జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరగనున్న ఈ క్రీడలకు బల్లెం వీరుడి ఎంపికపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) సెలెక్షన్ కమిటీ చైర్మన్ అడిల్లే సుమరివాలా స్పష్టం చేశారు. 28 ఏళ్ల నీరజ్ చోప్రా, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన భారత టాప్‌ అథ్లెట్.. ఇటీవల గాయాల నుంచి కోలుకున్నారు. 2025 సెప్టెంబర్‌లో టోక్యో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ముందు దిగువ వెన్ను గాయమైంది. ఆ తర్వాత సీజన్‌లో ఆలస్యంగా బరిలోకి దిగిన ఆయన దోహా డైమండ్ లీగ్‌లో 85.69 మీటర్ల బెస్ట్ త్రోతో నాలుగో స్థానంలో నిలిచాడు.

అంతకుముందు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొంటానని నీరజ్ చెప్పకపోయినా.. తాజాగా పాల్గొనడం ఖాయమని ఎఫ్ఏఐ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే అథ్లెట్ల జాబితాలో పేరు చేరింది. అడిల్లే సుమరివాలా మాట్లాడుతూ నీరజ్ ప్రస్తుత ఫిట్‌నెస్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘అతను గాయం నుంచి కోలుకుంటున్నాడు. దోహాలో 85.69 మీటర్లు విసరడం మంచి సూచన. గత ఆసియా క్రీడల్లో అతను 88 మీటర్లకు పైగా విసిరి స్వర్ణం సాధించాడు. ఇప్పుడు కూడా 86 మీటర్ల స్థాయికి చేరుకున్నాడు. అందుకే ఆయన ప్రదర్శనపై ఎలాంటి అనుమానం లేదు’ అని పేర్కొన్నారు. ఆసియా క్రీడల కోసం భారత జట్టును ఎఫ్ఏఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించనుంది. అదే రోజు జరుగుతున్న నేషనల్ ఇంటర్-స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో జట్టు ఎంపిక ప్రక్రియ ముగియనుంది.

ఇక జపాన్‌లో నీరజ్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన రుమేష్ తరంగ పతిరాగే ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ దాటి రెండు డైమండ్ లీగ్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అలాగే ఒలింపిక్ ఛాంపియన్ కూడా ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉండటంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. అదే సమయంలో కామన్వెల్త్ గేమ్స్ కోసం ఇప్పటికే 32 మంది సభ్యుల భారత జట్టులో నీరజ్ చోప్రా పేరు సైతం ఉన్నది. జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో జరిగే ఈ క్రీడల ముందు మరో పోటీలో పాల్గొనాలా వద్దా అన్నది పూర్తిగా నీరజ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఎఫ్ఏఐ తెలిపింది. ‘ఈ నిర్ణయాన్ని పూర్తిగా అతనికే వదిలేశాం. అతని కోచ్, మెడికల్ టీమ్ కలిసి ఏ పోటీలు అనుకూలమో నిర్ణయిస్తారు. ప్రధాన లక్ష్యం అర్హత సాధించడమే, అది అతను ఇప్పటికే సాధించాడు’ అని సుమరివాలా పేర్కొన్నారు.

Advertisement
Advertisement