త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

నైట్‌రైడ‌ర్స్‌ ప్లేయ‌ర్‌.. నైట్‌రైడ‌ర్స్‌నే చీల్చి చెండాడాడు : వైర‌ల్ వీడియో..

S

Sports | Published On Dec 8, 2025, 2.58 pm IST

నైట్‌రైడ‌ర్స్‌ ప్లేయ‌ర్‌.. నైట్‌రైడ‌ర్స్‌నే చీల్చి చెండాడాడు : వైర‌ల్ వీడియో..
Advertisement

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అనేక దేశాల్లో క్రికెట్ లీగ్‌ల‌ను ఏర్పాటు చేసి టీ20 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే యూఏఈలో ఐఎల్‌టీ20 అనే లీగ్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లోనూ ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు ఉండ‌డం విశేషం. ఇక ఈ ఏడాది ఐఎల్‌టీ20 టోర్న‌మెంట్‌ను ప్ర‌స్తుతం దుబాయ్‌, అబుధాబిల‌లో నిర్వ‌హిస్తుండ‌గా ఆదివారం ఓ మ్యాచ్‌లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో కోల్‌క‌తాకు ఆడుతున్న ఓ ప్లేయ‌ర్ ఈ లీగ్‌లో అదే నైట్ రైడ‌ర్స్‌ కు వ్య‌తిరేకంగా ఆడ‌డం విశేషం. దీంతో ఆ ప్లేయర్ బాదిన సిక్సులు, ఫోర్ల తాలూకు వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

ఐపీఎల్ 2026కు గాను డిసెంబ‌ర్ 16వ తేదీన మినీ వేలం నిర్వ‌హించ‌నున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు కొంద‌రు ప్లేయ‌ర్ల‌ను రిటెయిన్ చేసుకోగా, కొంద‌రు ప్లేయ‌ర్ల‌ను రిలీజ్ చేశాయి. ఇక చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడిన డుప్లెసిస్ లాంటి కొంద‌రు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఈసారి వేలంలో తాము ఎలాగూ అమ్ముడుపోమ‌నే ఉద్దేశంతో పాకిస్థాన్‌కు చెందిన సూప‌ర్ లీగ్‌లో ద‌రఖాస్తు చేసుకున్నారు. అయితే కోల్‌క‌తా ఈసారి ఆండ్రు ర‌సెల్‌, వెంక‌టేష్ అయ్య‌ర్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, క్వింటాన్ డికాక్ స‌హా మొత్తం 12 మంది స్టార్ ప్లేయ‌ర్ల‌ను రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ క్ర‌మంలో నిరాశ చెందిన ర‌సెల్ ఏకంగా ఐపీఎల్‌కే గుడ్ బై చెప్పాడు. అయితే అత‌న్ని కోల్‌క‌తా ప‌వ‌ర్ కోచ్‌గా మ‌ళ్లీ నియ‌మించుకుంది. ఇక కోల్‌క‌తా ఈసారి వెస్టిండీస్‌కు చెందిన మాజీ కెప్టెన్ రావ్‌మెన్ ప‌వెల్‌ను రిటెయిన్ చేసుకుంది.

గ‌తంలో ప‌వెల్‌ను కోల్‌కతా రూ.1.5 కోట్ల‌కు వేలంలో ద‌క్కించుకుంది. ఈసారి మాత్రం ప‌వెల్‌ను విడిచిపెట్ట‌కుండా రిటెయిన్ చేసుకుంది. ఈ క్ర‌మంలో ప‌వెల్ ఈసారి ఐపీఎల్‌లో కోల్‌క‌తాకు కీల‌కంగా మార‌నున్నాడ‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. అయితే ఐపీఎల్‌లో ప‌వెల్ కోల్‌క‌తాకు ఆడుతున్నాడు కానీ ఐఎల్‌టీ20లో మాత్రం దుబాయ్ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ఆదివారం దుబాయ్ క్యాపిట‌ల్స్‌కు, షారూక్ ఖాన్ జ‌ట్టు అయిన అబుధాబి నైట్ రైడ‌ర్స్‌కు మ‌ధ్య మ్యాచ్ నిర్వ‌హించారు. ఇందులో ప‌వెల్ నైడ్ రైడ‌ర్స్ జ‌ట్టుపై రెచ్చిపోయి ఆడ‌డం విశేషం. మొత్తం 52 బంతులు ఆడిన ప‌వెల్ ఏకంగా 4 సిక్సులు, 8 ఫోర్ల‌తో 96 ప‌రుగులు చేశాడు. దీంతో దుబాయ్ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. త‌రువాత బ్యాటింగ్ చేసిన అబుధాబి నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 15.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 103 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. దీంతో దుబాయ్ క్యాపిట‌ల్స్ 83 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ప‌వెల్ ఇన్నింగ్స్‌పై తెగ మీమ్స్ వ‌స్తున్నాయి. అత‌ను ఐపీఎల్‌లో కోల్‌క‌తా ప్లేయ‌ర్ అయిన‌ప్ప‌టికీ ఐఎల్‌టీ20లో వేరే జ‌ట్టుకు ఆడుతున్నాడు క‌నుక అక్క‌డి నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుపై అత‌ను వీర విహారం సృష్టించాడు. దీంతో త‌మ జ‌ట్టుపైనే త‌మ ప్లేయ‌రే ఇలా ఆడాడ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప‌వెల్‌కు చెందిన సిక్స‌ర్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement