త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సౌతాఫ్రికాపై ఘ‌న విజ‌యం సాధించిన భార‌త్‌.. మూడు వ‌న్డేల సిరీస్ 2-1తో కైవ‌సం..

S

Cricket | Published On Dec 6, 2025, 9.36 pm IST

సౌతాఫ్రికాపై ఘ‌న విజ‌యం సాధించిన భార‌త్‌.. మూడు వ‌న్డేల సిరీస్ 2-1తో కైవ‌సం..
Advertisement

విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన చివ‌రిదైన మూడో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 270 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం ఒక వికెట్ మాత్ర‌మే కోల్పోయి 39.5 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. భార‌త బౌల‌ర్లు, బ్యాట్స్‌మెన్ స‌మిష్టిగా రాణించ‌డంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయాసంగా నెగ్గింది. మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవ‌సం చేసుకుంది. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కోల్పోయిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో టీమిండియా స‌భ్యులు, కోచ్‌, సెలెక్ట‌ర్ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అలాగే రెండో వ‌న్డేలోనూ పేల‌వ‌మైన బౌలింగ్ కార‌ణంగా అంద‌రూ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో త‌మ అద్భుత‌మైన ఆట తీరుతో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలోనే సఫారిలు పూర్తిగా 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేదు. 47.5 ఓవ‌ర్ల‌లో 270 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌, కెప్టెన్ టెంబా బ‌వుమా మాత్ర‌మే రాణించారు. 89 బంతులు ఆడిన డికాక్ 8 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 106 ప‌రుగులు చేసి ఔట్ అవ్వ‌గా, కెప్టెన్ బ‌వుమా 67 బంతుల్లో 5 ఫోర్ల‌తో 48 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్‌, ప్ర‌సిధ్ కృష్ణ‌లు చెరో 4 వికెట్లు తీశారు. అర్ష‌దీప్ సింగ్‌, ర‌వీంద్ర జ‌డేజాల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త ప్లేయ‌ర్లు ఆరంభంలో కాస్త నెమ్మ‌దిగా ఆడినా క్ర‌మంగా వేగం పెంచారు. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు ఏకంగా 155 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో రోహిత్ 75 ప‌రుగులు చేసి ఔట‌వ్వ‌గా, జైశ్వాల్ 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 116 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కోహ్లి అర్ధ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో కోహ్లి 65 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సఫారి బౌల‌ర్ల‌లో కేశ‌వ్ మ‌హారాజ్‌కు 1 వికెట్ ద‌క్కింది. కాగా వ‌న్డే సిరీస్ ముగిసిన నేప‌థ్యంలో భార‌త్‌, సౌతాఫ్రికాల మ‌ధ్య ఈ నెల 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మొత్తం 5 టీ20ల‌ను ఆడ‌నున్నారు. తొలి టీ20 9వ తేదీన రాత్రి 7 గంట‌ల‌కు క‌ట‌క్‌లో జ‌ర‌గ‌నుంది. మ‌రో నాలుగు టీ20లు వ‌రుస‌గా చండీగ‌ఢ్‌, ధ‌ర్మ‌శాల‌, ల‌క్నో, అహ్మ‌దాబాద్‌ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. టీ20ల‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement