త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్‌ఎస్‌ఎస్‌ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు..!

RSS | ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం వేడుకలు జరుపుకునే సందర్భం మాత్రమే కాదని.. సమాజం కోసం మరింత పనిచేసేందుకు లభించిన అవకాశమని సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశంలోని యువత భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని కోరుకుంటోందని, వారికి దేశమే ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

P

National | Published On Nov 29, 2026, 2.51 pm IST

RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్‌ఎస్‌ఎస్‌ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు..!
Advertisement

RSS | ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం వేడుకలు జరుపుకునే సందర్భం మాత్రమే కాదని.. సమాజం కోసం మరింత పనిచేసేందుకు లభించిన అవకాశమని సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. దేశంలోని యువత భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని కోరుకుంటోందని, వారికి దేశమే ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఢిల్లీలోని రోహిణిలో ఆదివారం నిర్వహించిన ‘రాష్ట్ర వందనం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంఘ్‌ 101వ స్థాపన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఢిల్లీ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గతంలో తాను మూడు దేశాల్లో పర్యటించానని, ఇటీవలి నెలల్లో సంఘ్‌ ప్రతినిధులు ఐదు ఖండాల్లోని పలు దేశాలకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌, భారత్‌ గురించి వివరించారని భగవత్‌ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత్‌ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని పాశ్చాత్య ఆలోచనాపరులు భావించారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని వారు ఊహించలేదన్నారు. ఇప్పుడు భారత్‌ ప్రపంచంలో తిరిగి అగ్రస్థానాన్ని సాధించాలని ఇతర దేశాలు ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ లక్ష్యం ఏ ఒక్క సంస్థకో, వ్యక్తికో పరిమితం కాకుండా ప్రతి భారతీయుడి సంకల్పం కావాలని పిలుపునిచ్చారు.

భిన్నాభిప్రాయాలున్నా.. మనమంతా ఒక్కటే

సమాజంలో వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని భగవత్‌ అన్నారు. అయితే అందరూ ఒకే కుటుంబానికి చెందినవారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మనమంతా భారతీయులమేనని, దేశ ఐక్యతకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి హృదయంలో భారతీయత భావన మరింత బలపడుతోందని తెలిపారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణపైనా భగవత్‌ మాట్లాడారు. వ్యవసాయంలో పురుగులను నియంత్రించేందుకు పురుగుమందులు అవసరమైనప్పటికీ.. పర్యావరణానికి తక్కువ హాని కలిగించే సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విమర్శలను పట్టించుకోకుండా సత్యం, సరైన మార్గంలో ముందుకు సాగాలన్నది తమ సంకల్పమని పేర్కొన్నారు. భారత్‌ తిరిగి ప్రపంచ నాయకత్వ స్థానాన్ని సాధించేలా ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు.

వందేళ్లుగా మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది: మాజీ సీజేఐ ఖేహ‌ర్‌

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్థానంపై ప్రశంసలు కురిపించారు. వందేళ్లుగా సంఘ్‌ తన మూల సిద్ధాంతాలు, లక్ష్యాల విషయంలో రాజీ పడలేదని అన్నారు. 1925 నవంబర్‌లో 15 నుంచి 20 మంది యువకులతో ప్రారంభమైన సంస్థ.. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ మార్పులు చోటుచేసుకున్నప్పటికీ వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, హిందూ సమాజ సంఘటన అనే లక్ష్యాలతో సంఘ్‌ పనిచేస్తోందన్నారు. సంప్రదాయ రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉంటూ సాంస్కృతిక, సామాజిక, జాతీయవాద సంస్థగా కొనసాగుతోందని వివరించారు. దేశ విభజన సమయంలో పంజాబ్‌లో స్వయం సేవకులు చేపట్టిన సహాయక చర్యలు, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సిక్కు కుటుంబాలకు అందించిన సాయం, అసోం, లాతూర్‌, భుజ్‌ భూకంపాల సమయంలో చేసిన సేవలను ఖేహర్‌ ప్రస్తావించారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలోనూ స్వయం సేవకులు అందించిన సేవలను గుర్తుచేశారు. సంఘ్‌ వందేళ్ల ప్రయాణం అభినందనీయమన్నారు.

Advertisement
Advertisement