త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ రెడ్డి నోట‌.. కేసీఆర్ పేరు కోటి సార్లు

KTR | ఈ మూడేండ్ల కాలంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన‌లేదు.. అయినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్ర‌తి మీటింగ్‌లో కేసీఆర్ పేరును కోటి సార్లు తీసుకుంటున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

S

Telangana | Published On Nov 29, 2026, 7.46 pm IST

KTR | రేవంత్ రెడ్డి నోట‌.. కేసీఆర్ పేరు కోటి సార్లు
Advertisement

కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక్క‌మాట అన‌లేదు
కేసీఆర్ ఇంటి చుట్టే రాష్ట్ర రాజ‌కీయాలు
కాంగ్రెస్‌ను ఖ‌తం చేసే ఆలోచ‌న‌లో యువ‌త‌
ఢిల్లీకి గులాములుగా ఉందామా?
లేదా గులాబీలను ఢిల్లీకి పంపుదామా?
దీక్షా దివ‌స్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర న్యూస్ : ఈ మూడేండ్ల కాలంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన‌లేదు.. అయినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ప్ర‌తి మీటింగ్‌లో కేసీఆర్ పేరును కోటి సార్లు తీసుకుంటున్నాడ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అలుగునూరు చౌర‌స్తాలో నిర్వ‌హించిన దీక్షా దివ‌స్‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

ఓపికగా చూస్తా ఉన్నారు కేసీఆర్ గారు. మూడేళ్లు ఈ కొత్త ప్రభుత్వం మరి ఏమన్నా చేస్తదా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటదా అని ఎదురుచూస్తా ఉన్నాడు. కేసీఆర్ ఒక్క మాట రేవంత్ రెడ్డిని అనకపోయినా, రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి మీటింగ్‌లో కేసీఆర్ పేరును కోటి సార్లు తీసుకుంటున్నాడు. పేరుకేమో హైదరాబాదులో అసెంబ్లీ, సెక్రటేరియట్.. కానీ రాష్ట్ర రాజకీయం మొత్తం ఎర్రవల్లి చుట్టూ, కేసీఆర్ ఇంటి చుట్టే తిరుగుతున్నది. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే, కేసీఆర్ మాట్లాడకపోయినా అది కూడా సంచలనమే. రెండున్నర దశాబ్దాలుగా కేసీఆర్ చుట్టే రాష్ట్ర రాజకీయం తిరుగుతున్నది.. ఆయన మాటలు, కమిట్‌మెంట్, స్టేట్‌మెంట్లు అలాంటివి. కేవలం అధికారం కోసం అర్రులు చాచిన కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పాడినట్టు పాడింది. ఒక్క హామీ అన్నా నెరవేర్చిండా? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? కరెంటు, నీళ్లు ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ ముందుకు పోతుంటే.. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగినట్టు తెలంగాణ కథ అయిపోయింది. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్టు.. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్‌ను తెలంగాణ నెత్తిన పెట్టుకున్నది. ఎంత మందిని ముంచిండ్రు, ఎంత మందిని ఆగం చేసిండ్రు.. ఒక్కసారి యాద్ చేసుకోండి అని కేటీఆర్ తెలిపారు.

అడిగేటోడు లేడు, కొట్లాడేటోడు లేడు

“కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడగొట్టండి.. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా” అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మరి ఏమయ్యాయి ఇయ్యాల రెండు లక్షల ఉద్యోగాలు? తెలంగాణ యువత ఆలోచన చేయాలి. మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రాహుల్ గాంధీ.. మూడేళ్లయినా ఎక్కడ చచ్చినావు, ఎక్కడ పండుకున్నావు? తెలంగాణ యువత గర్జించి, కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీసే రోజు మళ్లీ వచ్చింది. దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ యువత కదం తొక్కి కాంగ్రెస్‌ను ఖతం చేసే ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యోగులకు ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మూడేళ్లయినా పీఆర్సీ అతీ లేదు, గతీ లేదు. ఉద్యోగులకు ఐదు డీఏలు బకాయిలు ఉన్నాయి.. అడిగేటోడు లేడు, కొట్లాడేటోడు లేడు. ఉద్యోగులతో, విద్యార్థులతో మనకున్నది పేగుబంధం. తెలంగాణ ఉద్యోగులు మన ఉద్యమ సహచరులు.. ఆనాడు మనతో కలిసి నడిచిన వాళ్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.

చచ్చిపోయే పరిస్థితి వచ్చింది

నియామకాలేమో గాల్లో పోయినాయి తప్ప ఇయ్యాల లాభపడ్డ సెక్షన్, లాభపడ్డ వర్గం ఒక్కటి కూడా తెలంగాణలో లేదు. ఉద్యోగులకు అవమానం, రిటైర్డ్ ఉద్యోగులకు అవమానం.. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇస్తలేరు. కోర్టులకు పోయి కొట్లాడి, తండ్లాడి బెనిఫిట్స్ తెచ్చుకునే పరిస్థితి తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చింది. ఉద్యమంలో మనతో కలిసి నడిచిన ఉద్యోగులు ఇయ్యాల అవసరాల పాలై చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కరీంనగర్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి..

కాంగ్రెస్ ఒక్కటే కాదు, బీజేపీ కూడా తెలంగాణ మీద ప్రేమ లేని దుర్మార్గమైన పార్టీ. తెలంగాణ విషయంలో “తల్లిని చంపి బిడ్డను బతికించారు” అని ప్రధానమంత్రి మోడీ మాట్లాడటం దుర్మార్గం. తెలంగాణ ఉద్యమ త్యాగాలు మోడీకి తెలవదా? తెలంగాణ ఉద్యమంలో జరిగిన బలిదానాలు ఆయన సోయిలో లేవా? దేశానికి ప్రధానమంత్రి అయిన మోడీ తెలంగాణకు కూడా ప్రధానమంత్రి కాదా? ఒక రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రం కోసం చేసిన త్యాగాల గురించి ఇట్లా మాట్లాడటం ఇదేనా పద్ధతి? పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోల్చిన బీజేపీ ఎంపీని నిలదీసే తెలంగాణ గొంతు లేకుండా పోయింది. తెలంగాణ సోయి ఉన్న గులాబీ కండువా కప్పుకున్న బిడ్డ పార్లమెంటులో ఉంటే బీజేపీ ఎంపీని గల్లా పట్టుకొని నిలదీసేవాడు. ఇయ్యాల బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, కాంగ్రెస్‌కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.. కానీ లోక్‌సభలో తెలంగాణ గొంతు లేదు. తెలంగాణ గొంతు లేదు.. ఎందుకంటే అక్కడ గులాబీ జెండా లేదు. ఢిల్లీకి సామంతులుగా ఉందామా? ఢిల్లీకి గులాములుగా ఉందామా? లేదా గులాబీలను ఢిల్లీకి పంపుదామా? తెలంగాణకు వ్యతిరేకంగా పోటీ పడుతున్న రెండు పార్టీలు.. ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకొకటి చెప్పులు మోసే పార్టీ. “ఎప్పుడు చెప్పులు ఇప్పుతాడా మా అధ్యక్షుడు” అని ఎదురుచూసే నాయకుల సంగతి ప్రజలకు బాగా తెలుసు. కరీంనగర్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి.. ఒక బడి తెచ్చిందా? ఒక గుడి తెచ్చిందా? రూపాయి పైసలు తెచ్చిందా? 2004-05లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్.. 21 ఏళ్లయినా కొత్తపల్లికి రైలు చేరలేదు. కనీసం సిరిసిల్లకు కూడా రైలు చేరలేదు.. ఇదేనా బీజేపీ చేతగానితనం? 12 ఏళ్లుగా కేంద్రంలో ప్రభుత్వం నడుపుతున్న బీజేపీ.. కరీంనగర్‌కు చేసిన సేవ ఏంటి? గులాబీ జెండాను గెలిపించి 17 పార్లమెంట్ స్థానాలు ఢిల్లీకి పంపితే, మోకాళ్ల మీద దేక్కుంటూ ఢిల్లీనే తెలంగాణకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం ద్వారా ఆనాడు ఢిల్లీని శాసించినట్లే.. మళ్లీ ఢిల్లీని శాసించే రోజు వచ్చింది అని కేటీఆర్ తెలిపారు.

గాంధీ భవన్‌కు ప్యాకింగ్ చేసి పంపుదామా?

ఇవాళ ఆ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేసిండు కాంగ్రెస్ దౌర్భాగ్యుడు. ఆ తల్లి చేతిలో బతుకమ్మనే ఎత్తుకుపోయిండు కాంగ్రెస్ వాడు. నెత్తి మీద కిరీటం ఎత్తుకుపోయిండు దొంగ! తులం బంగారం ఇస్తా అన్నాడు, తెలంగాణ తల్లి నెత్తి మీద కిరీటం కూడా ఎత్తుకుపోయిండు! బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముంగట తెలంగాణ తల్లి పెడదామని చెప్పి మనం జాగ పెడితే, తెలంగాణ తల్లిని తీసేసిండు. రాహుల్ గాంధీ తండ్రిని తెచ్చి అక్కడ విగ్రహం పెట్టిండు. ఇలా కరీంనగర్‌లో నేను అడుగుతున్నా మిమ్ములను... మళ్ళీ మనం 2028లో 500 రోజుల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చేయాల్సిన పని. ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు ప్యాకింగ్ చేసి పంపుదామా? పంపుదామా? తెలంగాణ తల్లిని అక్కడ పెడదామా? పక్కానా? అట్లాగే ఎక్కడపడితే అక్కడ కాళేశ్వరం పేరు మారుస్తున్నాడట వాడు ఎవడో ఆవారా గాడు! కాళేశ్వరం పేరు మారుస్తున్నాడట: లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, గాయత్రి పంప్ హౌస్ వాటి పేర్లు మారుస్తున్నాడట. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు పెడతారట! మళ్ళీ అధికారంలోకి వచ్చినంక ఒక్క కాంగ్రెస్ వాడి పేరు లేకుండా తెలంగాణలో చూసుకుందామా? ఏ పథకానికి కాంగ్రెస్ పేరు లేకుండా చేద్దామా? పక్కా చేద్దాం! అనుమానం ఏం వద్దు! అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement