త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ల దూకుడు..! నెంబ‌ర్ 2 ప్లేస్‌కి ఇషాన్‌..!

T20 Rankings | టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్లు తమ ఐసీసీ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

P

Sports | Published On Mar 11, 2026, 3.49 pm IST

T20 Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ల దూకుడు..! నెంబ‌ర్ 2 ప్లేస్‌కి ఇషాన్‌..!
Advertisement

T20 Rankings | టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్లు తమ ఐసీసీ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లు తమ స్థానాలను మరింత బలోపేతం చేసుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్–2 స్థానాల్లో నిలవడం విశేషం.

నెంబర్ వన్‌గా అభిషేక్ శర్మ

డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై వేగవంతమైన అర్ధశతకం సాధించి తన సత్తా చాటాడు. ఫైనల్లో భారత జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

నెంబర్–2గా ఇషాన్ కిషన్

టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ ర్యాంకింగ్స్‌లో గణనీయంగా ఎదిగాడు. టోర్నీలో మొత్తం 317 పరుగులు చేసిన ఈ ఎడమచేతి బ్యాటర్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన ఇషాన్ కిషన్ ప్రస్తుతం అభిషేక్ శర్మ కంటే కేవలం నాలుగు రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు.

శాంసన్ పైపైకి

టీ20 బ్యాటర్ల జాబితాలో అభిషేక్, ఇషాన్‌తో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ టాప్–10లో ఉన్నారు. తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సహిబ్‌జాదా ఫర్హాన్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సంజూ శాంసన్ 18 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరాడు. శివమ్ దూబే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 27వ స్థానంలో నిలిచాడు.

ఇత‌ర ప్లేయ‌ర్స్ ర్యాంకులు..

టీ20 వరల్డ్‌కప్‌లో మంచి ప్రదర్శన చేసిన ఇతర బ్యాటర్ల ర్యాంకులు కూడా మెరుగయ్యాయి. న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సీఫర్ట్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేకబ్ బెతెల్ 17 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో కేవలం 33 బంతుల్లో సెంచరీ సాధించి టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మార్పులు

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆ స్థానాన్ని అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ దక్కించుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. టాప్–10లో ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ర్యాంకు దిగజారింది. రషీద్ ఖాన్ 753 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, వరుణ్ చక్రవర్తి 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కార్బిన్ బోష్ ఐదో స్థానంలో నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానానికి చేరుకున్నాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పోటాపోటీ

టీ20 అంతర్జాతీయ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో పోటీ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా అగ్రస్థానంలో ఉండగా, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ వారం ఇద్దరూ తమ కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ను సాధించారు. మొత్తంగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత విడుదలైన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ భారత్ యువ బ్యాటింగ్ లైనప్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలంగా ఉందని స్పష్టం చేస్తున్నాయి. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి రెండు స్థానాల్లో నిలవడం భారత క్రికెట్‌కు శుభ సంకేతంగా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also :

IPL 2026 | ప‌శ్చిమాసియాలో సంక్షోభం..! ఐపీఎల్‌కి అడ్డంకిగా..!

Virat Kohli | ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ మొద‌లుపెట్టిన కోహ్లి.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

Advertisement
Advertisement