త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

అజిత్ అగార్క‌ర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన హ‌ర్భ‌జన్ సింగ్‌.. ష‌మీని ఎందుకు ఆడించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌..

S

Cricket | Published On Dec 5, 2025, 2.04 pm IST

అజిత్ అగార్క‌ర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన హ‌ర్భ‌జన్ సింగ్‌.. ష‌మీని ఎందుకు ఆడించ‌డం లేద‌ని ప్ర‌శ్న‌..
Advertisement

భార‌త క్రికెట్ జట్టు కోచ్‌, సెలెక్ట‌ర్ల‌పై టీమిండియా మాజీ స్పిన్ బౌల‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ్యాచ్‌ల‌ను గెలిచే ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేయ‌కుండా జ‌ట్టు మేనేజ్‌మెంట్ జ‌ట్టుతో ఆట‌లాడుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ఉదాహ‌ర‌ణ‌గా చూపించిన భ‌జ్జీ ఘాటుగా స్పందిస్తూ టీమిండియా త‌న వైఖ‌రిని ఇక‌నైనా మార్చుకోక‌పోతే మ్యాచ్‌ల‌ను గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని అన్నారు. కాగా టీమిండియా సౌతాఫ్రికాతో ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన విష‌యం విదితమే. సఫారిలు ఇండియాను క్లీన్ స్వీప్ చేశారు. త‌రువాత వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య రాంచీలో మొద‌టి మ్యాచ్‌ను నిర్వ‌హించ‌గా ఇందులో భార‌త్ అతి క‌ష్టం మీద గెలిచింది. కానీ రెండో వ‌న్డేలో ప‌రాజ‌యం పాలైంది. దీంతో టీమిండియా ప్లేయ‌ర్ల‌తోపాటు కోచ్‌, సెలెక్ట‌ర్ల‌పై మాజీలు, విశ్లేష‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

విరాట్ కోహ్లి పూర్తి స్థాయి ఫామ్‌లోకి వ‌చ్చి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇస్తున్న‌ప్ప‌టికీ టీమిండియా మ్యాచ్‌ల‌ను ఓడిపోతోంది. జ‌ట్టులో ఇత‌ర ప్లేయ‌ర్ల నుంచి అత‌నికి స‌హకారం ల‌భించ‌డం లేదు. కేవ‌లం కోహ్లి మాత్ర‌మే ఆడితే సరిపోద‌ని అంటున్నారు. అలాగే జ‌ట్టుకు స‌ల‌హాలు ఇవ్వ‌డంలో, జ‌ట్టును ముందుండి న‌డిపించ‌డంలో కోచ్ గౌత‌మ్ గంభీర్ ప్ర‌ద‌ర్శ‌న ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని కూడా విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న కోచింగ్‌లో టీమిండియా చాంపియ‌న్స్ ట్రోఫీ 2025ని కైవ‌సం చేసుకుంది. అయితే ఆ త‌రువాత ఇటీవ‌లే ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ జ‌ర‌గ్గా అందులో భారత్ 1-2 తేడాతో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. ఇక రాయ్‌పూర్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో 358 ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ పేల‌వ‌మైన బౌలింగ్ కార‌ణంగా ప‌రుగుల‌ను డిఫెండ్ చేయ‌డంలో వెనుక బ‌డింది. దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు భార‌త్‌పై సునాయాసంగా నెగ్గింది.

ఈ క్ర‌మంలోనే రాయ్‌పూర్ వ‌న్డే ఓట‌మి అనంత‌రం క్రికెట్ మాజీలు, విశ్లేష‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హ‌ర్భ‌జ‌న్ సింగ్ త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ఓ వీడియోలో మాట్లాడుతూ ష‌మీ అస‌లు ఎందుకు ఆడ‌డం లేదు, చాంపియ‌న్స్ ట్రోఫీ త‌రువాత నుంచి అత‌న్ని జ‌ట్టులోకి తీసుకోలేదు. అగార్క‌ర్ టీం అత‌న్ని ఎందుకు ప‌క్క‌న పెట్టింది..? ష‌మీ లాంటి క్వాలిటీ ప్లేయ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక సెలెక్ట‌ర్ అగార్క‌ర్ ఉద్దేశం ఏమిటి..? ష‌మీని అస‌లు ఎందుకు ఆడించ‌డం లేదో అర్థం కావ‌డం లేదు. బుమ్రా లేక‌పోతే జ‌ట్టును ముందుండి న‌డిపించి వికెట్లు తీయ‌గ‌ల స‌మ‌ర్థ‌వంత‌మైన బౌల‌ర్ జ‌ట్టులో ఉండాలి. మీరు ప్ర‌సిధ్‌ను బౌల‌ర్ అంటున్నారు, క‌రెక్టే, కానీ అత‌ను ఇంకా నేర్చుకోవాలి, సీనియర్లు లేకుండా వారు ఎలా నేర్చుకుంటారు, జ‌ట్టులో ఇదే ప‌రిస్థితి ఉంటే టీమిండియా ఎన్న‌టికీ మ్యాచ్‌ల‌ను గెల‌వ‌లేదు.. అని హ‌ర్భ‌జన్ సింగ్ అన్నారు. కాగా భార‌త్‌, సౌతాఫ్రికా మ‌ధ్య చివ‌రి వ‌న్డే మ్యాచ్ డిసెంబ‌ర్ 6 శ‌నివారం విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే భ‌జ్జీ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంతరించుకున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement