త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mexico Vs South Korea | ద‌క్షిణ కొరియాపై 1-0 తేడాతో విజ‌యం.. నాకౌట్‌కు మెక్సికో..

FIFA Worldcup 2026 | ఫిఫా వరల్డ్ కప్-2026లో మెక్సికో దక్షిణ కొరియాపై 1-0తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మరో మ్యాచ్‌లో చెకియా, దక్షిణాఫ్రికా జట్లు 1-1తో డ్రా చేసుకోగా, చివరి నిమిషాల్లో వచ్చిన పెనాల్టీ గోల్‌తో దక్షిణాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకుంది.

P

Sports | Published On Jun 19, 2026, 3.41 pm IST

Mexico Vs South Korea | ద‌క్షిణ కొరియాపై 1-0 తేడాతో విజ‌యం.. నాకౌట్‌కు మెక్సికో..
Advertisement
  • రెండు మ్యాచుల్లో విజ‌యం
  • నాకౌట్‌లోకి ప్ర‌వేశించిన తొలిజ‌ట్టుగా ఘ‌న‌త‌
  • చిన్న త‌ప్పిదంతో మారిన ఫ‌లితం

Mexico Vs South Korea | ఫిఫా వరల్డ్ క‌ప్‌లో మెక్సికో నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. గ్రూప్-ఏలో గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాను 1-0తో ఓడించి గ్రూప్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో ఆరు పాయింట్ల‌ను సాధించింది. కొరియాతో జ‌రిగిన మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. మెక్సికోకు దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా వాటిని గోల్స్‌గా మల‌చ‌లేక‌పోయింది. మరోవైపు దక్షిణ కొరియా సైతం ఎదురుదాడి చేస్తూ మెక్సికో జ‌ట్టు డిఫెన్స్‌కు స‌వాల్ విసిరింది. రెండో అర్ధభాగం మొద‌లైన మూడు నిమిషాల వ‌ద్ద మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఘ‌ట‌న జ‌రిగింది. దక్షిణ కొరియా గోల్‌కీపర్ కిమ్ సియుంగ్ సహచర ఆటగాడితో ఢీకొనడంతో క్రాస్‌ను సరిగా అందుకోలేకపోయాడు.

ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న లూయిస్ రోమో బంతిని నేరుగా నెట్‌లోకి పంపి మెక్సికోకు 1-0 ఆధిక్యంలో నిలిపాడు. గోల్ త‌ర్వాత దక్షిణ కొరియా క‌నీసం డ్రా చేసేందుకు చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేసింది. చివరి నిమిషాల్లో కౌంట‌ర్ ఎటాక్‌తో మెక్సికోపై ఒత్తిడి పెంచింది. గోల్‌కీపర్ రౌల్ రంగెల్ అద్భుత డబుల్ సేవ్‌తో జట్టును నిల‌బెట్టాడు. మరోవైపు రౌల్ జిమెనెజ్ చేసిన ప్రయత్నాన్ని కిమ్ అద్భుతంగా అడ్డుకోవడంతో మెక్సికో రెండో గోల్ అవకాశాన్ని కోల్పోయింది. ఈ విజయంతో మెక్సికో గ్రూప్-ఏ విజేతగా నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. జూన్ 30న మెక్సికో సిటీలో జరిగే రౌండ్ ఆఫ్-32 మ్యాచ్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. 2002 తర్వాత తొలిసారి ప్రపంచకప్ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని మెక్సికో దక్కించుకోవడం విశేషం.

పెనాల్టీతో ఓట‌మి నుంచి గ‌ట్టెక్కిన సౌతాఫ్రికా

Czechia vs South africa | ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా చెక్ రిప‌బ్లిక్‌, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠభరిత పోరు 1-1తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభంలోనే ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ విజ‌యానికి చేరువైంది. చివ‌రి ద‌శ‌లో ద‌క్షిణాఫ్రికా గోల్ సాధించి ఒక పాయింట్‌ను సాధించింది. మ్యాచ్ మొద‌లైన ఆరో నిమిషంలోనే చెకియా మిడ్‌ఫీల్డర్ మైఖేల్ సడిలెక్ అద్భుత గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ గోల్ తర్వాత చెకియా ఆటపై పూర్తి పట్టు సాధించి దక్షిణాఫ్రికాను స‌మ‌ర్థ‌వంతంగా నిలువ‌రించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి చెకియా 1-0తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడింది. గోల్ చేసేందుకు వ‌రుస‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. 83వ నిమిషంలో పెనాల్టీ ల‌భించింది. ఈ అవకాశాన్ని టెబోహో మోకోయెనా సద్వినియోగం చేసుకుంటూ గోల్‌గా మ‌లిచి స్కోర్‌ను 1-1 స‌మం చేశాడు. మిగిలిన సమయంలో ఇరు జట్లు విజయం కోసం తీవ్ర ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దాంతో మ్యాచ్ డాగ్రా ముగిసింది. దాంతో ఇరుజ‌ట్లకు ఒక్కో పాయింట్ ద‌క్కింది. మొద‌టి అర్ధ‌భాగంలో ఆధిప‌త్యం చెలాయించిన చెకియా.. రెండో అర్ధ‌భాగంలో ద‌క్షిణాఫ్రికా పోరాడి ఓట‌మి నుంచి త‌ప్పించుకుంది. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన ఈ మ్యాచ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది.

 

Advertisement
Advertisement