త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaibhav Suryavanshi | యంగ్ ప్లేయ‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌స్సు నిజంగా 14 ఏళ్లేనా..? ఏదైనా మోసం చేస్తున్నారా..?

S

Cricket | Published On Dec 13, 2025, 12.43 pm IST

Vaibhav Suryavanshi | యంగ్ ప్లేయ‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌స్సు నిజంగా 14 ఏళ్లేనా..?  ఏదైనా మోసం చేస్తున్నారా..?
Advertisement

Vaibhav Suryavanshi | భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు యంగ్ ప్లేయ‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌స్సుపై ప‌లువురు తాజాగా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అత‌ని వ‌య‌స్సుకు త‌గిన‌ట్లు అత‌ని ఆట లేద‌ని, ఆ వ‌య‌స్సులో అంత‌టి భారీ షాట్లు ఎలా ఆడ‌గ‌ల‌డ‌ని, సీనియ‌ర్ బౌల‌ర్ల బౌలింగ్‌లో సైతం ఏమాత్రం బెద‌ర‌కుండా అత‌ను షాట్స్ ఆడుతున్నాడ‌ని ప‌లువురు సందేహాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అత‌ని వ‌య‌స్సు ఇంకా ఎక్కువ‌గానే ఉండి ఉంటుంద‌ని, కానీ ఆ విష‌యం దాస్తున్నార‌ని అంటున్నారు. అయితే దీనిపై సూర్య‌వంశీ తండ్రి సంజీవ్ స్ప‌ష్ట‌త ఇచ్చారు.

వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌స్సును దాచి పెట్టి మోసం చేస్తున్నార‌ని వ‌స్తున్న కామెంట్ల‌పై అత‌ని తండ్రి సంజీవ్ మాట్లాడుతూ గ‌తంలోనూ అత‌ని ఆట‌పై కొంద‌రు ఇలాగే అనుమానం వ్య‌క్తం చేశారు. అప్ప‌ట్లో అత‌నికి బీసీసీఐ టెస్టు కూడా చేసింది. వైభ‌వ్‌కు 8 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు బీసీసీఐ అత‌నికి బోన్ టెస్ట్ నిర్వహించి వ‌య‌స్సును ధ్రువీక‌రించింది. ఆ త‌రువాత‌నే అత‌ను ఆయా టీమ్‌ల‌లో ఆడుతున్నాడు. దీన్ని ఇప్పుడు వివాదం ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు, బీసీసీఐ అడిగితే మ‌ళ్లీ టెస్టు చేయించేందుకు సిద్ధ‌మ‌ని తెలిపారు. అయితే ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఆడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ 14 ఏళ్ల వ‌య‌స్సులోనే సీనియ‌ర్ బౌల‌ర్ల‌కు సైతం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. గ‌త ఐపీఎల్ సీజీన్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ఆడిన అత‌ను 7 ఇన్నింగ్స్‌లో 36 స‌గ‌టుతో 252 ప‌రుగులు సాధించ‌గా అందులో ఒక అర్థ సెంచ‌రీ, ఒక సెంచ‌రీ ఉన్నాయి. అత‌ని ఐపీఎల్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 206గా ఉంది.

ఇక తాజాగా దుబాయ్‌లో యూఏఈతో జ‌రిగిన అండ‌ర్ 19 వ‌న్డే ఆసియా క‌ప్ మ్యాచ్‌లో 95 బంతుల్లోనే 171 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే అత‌ను త‌న వ‌య‌స్సుకు మించి ఆట ఆడుతున్నాడ‌ని పేర్కొంటూ కొంద‌రు అత‌ని వ‌యస్సుపై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వైభ‌వ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌డం విశేషం. స‌చిన్ కూడా ఆ వ‌య‌స్సులో అలాగే ఆడాడ‌ని, అప్పుడు ఆయ‌న‌పై లేని అనుమానాలు ఇప్పుడు వైభ‌వ్‌పై ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. టాలెంట్ అనేది కొంద‌రికి ఆ వ‌య‌స్సు నుంచే ఉంటుంద‌ని, అది ఎవరి సొత్తు కాద‌ని పేర్కొంటున్నారు. వైభ‌వ్‌ను ఆట‌కు దూరం చేయ‌డం కోసమే కొంద‌రు కావాల‌ని ప‌నిగ‌ట్టుకుని ఇలా ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇక వైభ‌వ్ ను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడితే చూడాల‌ని కోరుకుంటున్న‌ట్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఐసీసీ నియ‌మావ‌ళి ప్రకారం 15 ఏళ్ల లోపు వ‌య‌స్సు ఉన్న‌వారు అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల‌లో ఆడ‌టానికి వీల్లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌య‌స్సు 14 ఏళ్ల 9 నెల‌ల 17 రోజులు కాగా వ‌చ్చే 2026 మార్చి 27వ తేదీకి అత‌నికి 15 ఏళ్లు నిండుతాయి. దీంతో అత‌ను ఆ త‌రువాత అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఆ త‌రువాత అయినా బీసీసీఐ అత‌న్ని సీనియ‌ర్ల టీమ్‌లోకి ఎంపిక చేస్తుందా, లేదా అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement