త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | కోహ్లి అద్భుత శతకం.. పాంటింగ్ రికార్డు బద్దలు..

Virat Kohli | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, నిర్ణ‌యాత్మ‌క వన్డేలో విరాట్ కోహ్లి మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఒత్తిడి పరిస్థితుల్లో అద్భుత శతకం సాధించిన కోహ్లి, భారత రన్‌చేజ్‌ను ఒంటిచేత్తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన వేళ జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు.

S

Sports | Published On Jan 19, 2026, 7.14 am IST

Virat Kohli | కోహ్లి అద్భుత శతకం.. పాంటింగ్ రికార్డు బద్దలు..
Advertisement

Virat Kohli | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, నిర్ణ‌యాత్మ‌క వన్డేలో విరాట్ కోహ్లి మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఒత్తిడి పరిస్థితుల్లో అద్భుత శతకం సాధించిన కోహ్లి, భారత రన్‌చేజ్‌ను ఒంటిచేత్తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన వేళ జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి తన 54వ వన్డే శతకం, మొత్తం ఫార్మాట్లలో 85వ అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో శతకం సాధించడంతో, వన్డేల్లో నంబర్ 3 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇంతకాలం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది.

నంబ‌ర్ 3 ప్లేస్‌లో కోహ్లి టాప్‌..

పాంటింగ్ నంబర్ 3 స్థానంలో 335 మ్యాచ్‌ల్లో 12,662 పరుగులు (సగటు 42.48) చేయ‌గా, 29 సెంచరీలు, 74 అర్ధసెంచరీలు సాధించాడు. మూడో వన్డేకు ముందు కోహ్లి ఖాతాలో 12,552 పరుగులు ఉండగా, రికార్డు బద్దలు కొట్టడానికి 111 పరుగులు అవసరమయ్యాయి. నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్‌లో అతడు చేసిన 124 పరుగుల ఇన్నింగ్స్‌తో పాంటింగ్‌ను అధిగమించాడు. ప్ర‌స్తుతం కోహ్లి నంబర్ 3 స్థానంలో 247 మ్యాచ్‌లు ఆడ‌గా, 12,676 ప‌రుగులు చేశాడు. 61.78 స‌గ‌టుతో 47 శ‌త‌కాలు, 67 అర్ధ శ‌త‌కాలు సాధించాడు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లి ఖాతాలో నంబ‌ర్ స్థానంలో ఆడడం వ‌ల్ల 12,676 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉండ‌గా, పాంటింగ్ 12,662 ర‌న్స్‌తో రెండో స్థానంలో, కుమార్ సంగ‌క్క‌ర 9,747 ర‌న్స్‌తో మూడో స్థానంలో ఉన్నారు. అయితే వారిద్ద‌రూ ప్ర‌స్తుతం రిటైర్ అయిన విష‌యం తెలిసిందే.

కివీస్‌పై అధిక శ‌త‌కాలు..

ఈ శతకంతో కోహ్లి మరో అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించాడు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు రికీ పాంటింగ్‌, వీరంద్ర సెహ్వాగ్‌ల పేరిట ఉండేది. వారు 6 శ‌త‌కాల‌తో మొద‌టి స్థానంలో ఉన్నారు. అయితే ఇప్పుడు కోహ్లి సెంచ‌రీ చేయ‌డంతో 7 శ‌త‌కాల‌తో అత‌ను తొలి స్థానానికి చేరుకున్నాడు.

కోహ్లి సెంచ‌రీ వృథా..

అయితే కోహ్లి వీరోచిత శతకం చివరకు వృథాగా మారింది. మూడో వన్డేలో భారత్‌ను న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. ఇది న్యూజిలాండ్‌కు చారిత్రక విజయం కాగా భారత గడ్డపై వారి మొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం ఇదే. 37 ఏళ్ల తర్వాత భారత్‌లో వన్డే సిరీస్ గెలిచిన ఘనతను మైకేల్ బ్రేస్‌వెల్ నేతృత్వంలోని జట్టు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో జట్టు స్కోరును 337 పరుగులకు తీసుకెళ్లింది. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు దారుణ‌మైన ఆరంభం లభించింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కోహ్లి (124) అద్భుతంగా పోరాడాడు.

టీ20 సిరీస్ షెడ్యూల్‌..

నితీశ్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధశతకాలతో కొంత సహకారం అందించడంతో చివరి వరకు ఆశలు నిలిచాయి. కానీ 46వ ఓవర్‌లో కోహ్లి ఔటవడంతో మ్యాచ్ భారత్ చేజారింది. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయి, న్యూజిలాండ్ చేతిలో 41 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. రానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో ఆ టోర్నీలో ఆడ‌నున్న జ‌ట్టుతోనే ఈ సిరీస్‌లోనూ భార‌త్ బ‌రిలోకి దిగుతోంది. దీంతో ఈ సిరీస్‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా భార‌త్ త‌న తొలి టీ20ని న్యూజిలాండ్‌తో ఈ నెల 21వ తేదీన నాగ్‌పూర్‌లో ఆడుతుంది. అనంత‌రం రెండో టీ20 23వ తేదీన రాయ్‌పూర్‌లో, 3వ టీ20 25వ తేదీన గువాహ‌టిలో, 4వ టీ20 28న విశాఖ‌ప‌ట్నంలో, 5వ టీ20 31వ తేదీన తిరువ‌నంత‌పురంలో జ‌రుగుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement