త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tilak Varma | టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. తిల‌క్ వ‌ర్మ రెడీ..!

Tilak Varma | భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ టెస్టిక్యుల‌ర్ సర్జ‌రీతో ఇటీవ‌ల జ‌రిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరం అయిన నేప‌థ్యంలో అత‌ను మళ్లీ జ‌ట్టులోకి రావ‌డంపై అంద‌రిలోనూ సందేహాలు నెల‌కొన్నాయి.

S

Sports | Published On Feb 3, 2026, 10.27 am IST

Tilak Varma | టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. తిల‌క్ వ‌ర్మ రెడీ..!
Advertisement

Tilak Varma | భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ టెస్టిక్యుల‌ర్ సర్జ‌రీతో ఇటీవ‌ల జ‌రిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరం అయిన నేప‌థ్యంలో అత‌ను మళ్లీ జ‌ట్టులోకి రావ‌డంపై అంద‌రిలోనూ సందేహాలు నెల‌కొన్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అత్యంత స‌మీపంలో ఉన్న త‌రుణంలో అత‌ను మ‌ళ్లీ కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తాడా, ఫామ్‌లో ఉంటాడా.. అని అందరిలోనూ ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా ఆసియా క‌ప్ ఫైన‌ల్‌లో టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించి మ్యాచ్ విన్న‌ర్‌గా త‌న స‌త్తా చాట‌డంతో తిల‌క్ వర్మ జ‌ట్టులో ఉండ‌డం అనివార్యం అయింది. కానీ స‌ర్జ‌రీ కార‌ణంగా అత‌ను జ‌ట్టుకు దూర‌మ‌వ‌డం ఆందోళ‌న క‌లిగించింది. తిల‌క్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడ‌డంపై కూడా సందేహాలు నెల‌కొన్నాయి. అయితే వాట‌న్నింటినీ తిల‌క్ ప‌టాపంచ‌లు చేశాడు. స‌ర్జ‌రీ చిన్న బ్రేక్ మాత్ర‌మే అని, తాను ఫామ్‌లోనే ఉన్నాన‌ని త‌న బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో తెలియ‌జేశాడు.

స‌త్తా చాటిన తిల‌క్ వ‌ర్మ‌..

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ ముందు ఐసీసీ స‌న్నాహకంగా నిర్వ‌హిస్తున్న వార్మ‌ప్ మ్యాచ్‌ల‌లో భాగంగా భార‌త్ త‌న తొలి వార్మ‌ప్ మ్యాచ్‌ను యూఎస్ఏతో ఆడింది. అయితే పేరుకు భార‌త్ అయినా అందులో పాల్గొన్న‌ది మొత్తం ఇండియా ఎ టీమ్ ప్లేయ‌ర్లే. ఇక వారిలో తిల‌క్ వ‌ర్మ కూడా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే యూఎస్ఏతో జ‌రిగిన ఈ వార్మ‌ప్ మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ 24 బంతుల్లో 38 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు. 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌ను బాదిన తిల‌క్ తాను ఫామ్‌లోనే ఉన్నాన‌ని నిరూపించాడు. దీంతో అత‌ను ఈ మ్యాచ్ త‌రువాత భార‌త జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ఇక యూఎస్ఏతో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో ఇండియా ఎ జట్టు 38 పరుగుల తేడాతో యూఎస్ఏపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 55 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర శతకం బాదగా, కెప్టెన్ ఆయుష్ బదోని 26 బంతుల్లో అజేయంగా 60 పరుగులు చేశాడు. వీరి దూకుడే జట్టుకు భారీ స్కోరు అందించింది.

ఓట‌మి పాలైన యూఎస్ఏ..

ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య (28) ఔటైనప్పటికీ, ఆ తర్వాత జగదీశన్-తిలక్ జోడీ కేవలం 9.1 ఓవర్లలోనే 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. యూఎస్ఏ మొత్తం 9 మంది బౌలర్లను ప్రయోగించినా, 7 మంది బౌలర్లు ఓవర్‌కు 10కిపైగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. తిలక్ ఔటైన తర్వాత కూడా దూకుడు తగ్గలేదు. చివరి ఓవర్లలో బదోని మ్యాచ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. జగదీశన్ 11 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరిసి 19వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. లక్ష్య చేధనలో యూఎస్ఏ జట్టు పోరాటం చేసినా, 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ 31 బంతుల్లో 44 పరుగులతో ఆరంభంలో ఊపు అందించాడు. అనంతరం సంజయ్ కృష్ణమూర్తి 18 బంతుల్లో 41 పరుగులతో మధ్య ఓవర్లలో ఆశ చూపించాడు. చివర్లో శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్ వేగంగా పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

సంజు శాంస‌న్ పొజిష‌న్‌కు ఎస‌రు..?

ఇండియా ఎ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్ నమన్ ధీర్ చివరి ఓవర్‌లో 2 వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌తో తిలక్ వర్మ తిరిగి రిథమ్ అందుకోవడం భారత జట్టుకు శుభవార్తగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన తిలక్, ఇప్పుడు వార్మప్ మ్యాచ్‌లో మెరిసి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు తన అవకాశాలను మరింత మెరుగు ప‌రుచున్నాడు. అయితే ఓపెన‌ర్ గా సంజు శాంస‌న్ వ‌రుస‌గా 5 మ్యాచ్‌ల‌లో విఫ‌లం కావ‌డంతో అత‌ని స్థానంలో ఇషాన్ కిష‌న్‌ను దింపే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సంజును జ‌ట్టు నుంచి త‌ప్పిస్తార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ ఆడే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

Advertisement
Advertisement