త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC | బంగ్లాదేశ్ చ‌ర్య‌ల‌కు ఐసీసీకి చిర్రెత్తుకొచ్చిందా..? అందుక‌నేనా ఇలా జ‌రిగింది..?

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించిన నేపథ్యంలో, అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టును ఈ టోర్నీ నుంచి తొల‌గిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్ణ‌యం తీసుకుంది.

S

Sports | Published On Jan 25, 2026, 6.37 am IST

ICC | బంగ్లాదేశ్ చ‌ర్య‌ల‌కు ఐసీసీకి చిర్రెత్తుకొచ్చిందా..? అందుక‌నేనా ఇలా జ‌రిగింది..?
Advertisement

ICC | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించిన నేపథ్యంలో, అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టును ఈ టోర్నీ నుంచి తొల‌గిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్ ఉదంతాన్ని సాకుగా చూపుతూ, భార‌త్ లో లేని ముప్పును ఉన్న‌దిగా చూపిస్తూ,  సొంత దేశం నుంచి ఎదురైన రాజ‌కీయ ఒత్తిడి కార‌ణంగా బంగ్లాదేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై మొద‌ట్నుంచీ ఐసీసీ అసంతృప్తిగా, అస‌హ‌నంగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ బంగ్లాదేశ్ కూడా ఒక స‌భ్య దేశం క‌నుక ఆ జ‌ట్టు ప్ర‌యోజ‌నాల‌ను కూడా గౌర‌వించింది. అందుక‌నే ఇన్ని ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపి ఆ జ‌ట్టుకు అనేక అవ‌కాశాల‌ను కూడా ఐసీసీ ఇచ్చింది. కానీ వారు మొండి వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతోపాటు వితండ వాదం చేస్తున్నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు, ఐసీసీ వ‌ర్గాల స‌మాచారం పేరిట‌ క్రిక్‌బ‌జ్ ఓ క‌థ‌నంలో పేర్కొంది.

ఎంత న‌చ్చ‌జెప్పినా..

ఈ విష‌యంలో ఐసీసీ మొద‌ట్నుంచీ  తన నిర్ణయంపై దృఢంగా నిలిచింది. టోర్నమెంట్ నిష్పక్షపాతత్వం, షెడ్యూల్ పవిత్రత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేస్తూ, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలను వినియోగించుకున్న అనంతరం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తన నిర్ణయాన్ని పునరాలోచించుకునేందుకు ఐసీసీ తగినంత సమయం ఇచ్చింది. ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్డైస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు నిరంతరం బీసీబీ ప్రతినిధులతో సంప్రదింపుల్లో ఉండి, బంగ్లాదేశ్ త‌మ‌కు తాము అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఒంటరిగా భావించకుండా చూసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో, ఒక సభ్య దేశం మ్యాచ్‌ల వేదిక మార్పు కోసం ఒత్తిడి చేయడాన్ని అంగీకరిస్తే అది ప్రమాదకరమైన, అనారోగ్యకరమైన సంప్రదాయానికి బీజం వేసిన‌ట్లు అవుతుందని ఐసీసీ స్పష్టంగా అభిప్రాయపడింది.

అప్పుడెందుకు వెళ్లారు..?

జనవరి 21న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ అభ్యర్థనను దాదాపు అన్ని సభ్య దేశాలు తిరస్కరించాయి. కేవలం రెండు దేశాలు మాత్రమే (పాకిస్థాన్‌, బంగ్లాదేశ్) వారి వాదనకు మద్దతు తెలిపాయి. ఈ సమావేశం అనంతరం, బీసీబీ తాము టోర్నీలో పాల్గొనడంపై అధికారికంగా ధ్రువీకరణ ఇవ్వాలని ఐసీసీ 24 గంటల గడువు విధించింది. అయితే ఆ గడువు ముగిసినా బంగ్లాదేశ్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. బదులుగా, ఐసీసీ చేసిన భద్రతా అంచనాలపై బీసీబీ కొత్త అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు భద్రతా ప్రమాద స్థాయిని మోస్తరు నుంచి తక్కువగా ఐసీసీ అంచనా వేయగా, బీసీబీ మాత్రం అది మోస్తరు నుంచి అధికంగా ఉందని వాదించింది. ఈ వైఖరి ఐసీసీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. ఎందుకంటే గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి భద్రతా పరిస్థితి భారత్‌తో పోలిస్తే ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, అప్పట్లో వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.

అదే ప్ర‌ధాన కార‌ణం..?

జనవరి 23న జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ సందర్భంగా బీసీబీ తమ వైఖరిని కొంత సడలిస్తుందని కొంతమంది భావించారు. అయితే ఆ అంచనాలు ఫలించలేదు. బంగ్లాదేశ్ బోర్డు స్పష్టమైన హామీ ఇవ్వకుండా, ఊహాజనిత పరిస్థితులను ముందుకు తెచ్చి చర్చను కొనసాగించడానికే పరిమితమైంది. 24 గంటల గడువు ముగిసిన తర్వాత ఆలస్యంగా బీసీబీ ఐసీసీకి లేఖ రాసినప్పటికీ, అప్పటికే తాము చాలాసేపు వేచి చూశామని ఐసీసీ అభిప్రాయపడింది. జనవరి 21న తీసుకున్న బోర్డు తీర్మానం ప్రకారం, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లండ్ జట్టును టోర్నమెంట్‌లో చేర్చక తప్పదని శనివారం ఐసీసీ సీఈవో సభ్య దేశాలకు అధికారికంగా తెలియజేశారు. అయితే గ‌తేడాది చాంపియ‌న్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లో ముప్పు ఉన్న‌ప్ప‌టికీ వెళ్లిన బంగ్లాదేశ్ ఇప్పుడు భార‌త్ విష‌యంలో ఎందుకు ఇలా ప్ర‌వ‌ర్తిస్తుంది.. అనే విష‌యంపైనే ఐసీసీ ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. అప్ప‌ట్లో పాకిస్థాన్‌లోనే అధికంగా ముప్పు ఉంద‌ని, ఇప్పుడు భార‌త్‌లో ఆ జ‌ట్టుకు ముప్పు లేద‌ని, అప్పుడు అక్క‌డికి వెళ్లిన వారు, ఇప్పుడు భార‌త్‌కు ఎందుకు వెళ్ల‌రు..? అని ఐసీసీ ప్ర‌శ్నించిన‌ట్లు కూడా సమాచారం. ఈ క్ర‌మంలోనే బీసీబీ వైఖ‌రి ప‌ట్ల అసంతృప్తితోనే ఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement