త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్‌కప్ 2026.. ఇంకో స‌రికొత్త వివాదం తెర‌పైకి..

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి ఇప్ప‌టికే భార‌త్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మ‌ధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న అమెరికా క్రికెట్ జట్టు ఆటగాళ్లకు భారత్‌కు రావడానికి వీసాలు నిరాకరించారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ అంశం మ‌ళ్లీ చర్చనీయాంశంగా మారింది.

S

Sports | Published On Jan 14, 2026, 12.30 pm IST

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్‌కప్ 2026.. ఇంకో స‌రికొత్త వివాదం తెర‌పైకి..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి ఇప్ప‌టికే భార‌త్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మ‌ధ్య వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌రో వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న అమెరికా క్రికెట్ జట్టు ఆటగాళ్లకు భారత్‌కు రావడానికి వీసాలు నిరాకరించారనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ అంశం మ‌ళ్లీ చర్చనీయాంశంగా మారింది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుండ‌గా ఇప్పుడు మ‌ళ్లీ ఈ సరికొత్త వివాదం తెర‌పైకి రావ‌డంతో ఈసారి ఏం జ‌రుగుతుందోన‌ని ఫ్యాన్స్ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.

క్రికెట‌ర్ అలీ ఖాన్ పోస్టుతో..

కాగా ఈ వ్యవహారం అమెరికా క్రికెటర్ అలీ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో వెలుగులోకి వచ్చింది. టోర్నమెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తన అప్లికేషన్ తిరస్కరించబడిందని సూచించేలా, India visa denied but KFC for the win అనే కామెంట్‌తో అలీ ఖాన్ తన సహచరుడితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్న ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వీసా తిరస్కరణ జరగలేదని తెలుస్తోంది. వీసా మంజూరు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, సాధారణ విధానాల ప్రకారమే దరఖాస్తుల పరిశీలన జరుగుతోందని అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జనవరి 13న మంగళవారం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయంలో అపాయింట్‌మెంట్ పూర్తి చేసిన అనంతరం పాకిస్థాన్ మూలాలు కలిగిన అమెరికా ఆటగాళ్లు అలీ ఖాన్, షయాన్ జహంగీర్, మహమ్మద్ మొహ్సిన్, ఎహ్సాన్ ఆదిల్ వీసా నిర్ధారణ కోసం వేచి ఉన్నారు. టోర్నమెంట్‌కు ముందు తుది దశ సన్నాహాల్లో భాగంగా యూఎస్‌ఏ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో శిక్షణ పొందుతోంది.

అధికారికంగా తిర‌స్క‌ర‌ణ జ‌ర‌గ‌లేదు..

అయితే అపాయింట్‌మెంట్ సమయంలో వీసాలు మంజూరు కాలేదుగానీ, అధికారికంగా తిరస్కరించినట్లూ చెప్ప‌లేదు. అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు అందినప్పటికీ, వీసా ప్రక్రియ ముందుకు సాగేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుంచి ఇంకా కొంత సమాచారం అవసరమని భారత రాయబార కార్యాలయం యూఎస్‌ఏ జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు సమాచారం. అందుక‌నే వీసా జారీ ప్ర‌క్రియ‌లో ఆల‌స్యం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే దీనిపై సోష‌ల్ మీడియాలో పుకార్లు హ‌ల్ హ‌ల్ చేస్తున్నాయి. వీసాల‌ను వారికి తిర‌స్క‌రించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆటగాళ్లకు సంబంధించిన వీసా దరఖాస్తులు, వారి జాతీయత లేదా ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుతో సంబంధం లేకుండా, సాధారణంగా అదనపు పరిపాలనా పరిశీలనకు లోబడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతంలో అంతర్జాతీయ క్రికెటర్లు మొయిన్ అలీ, షోయబ్ బషీర్, ఉస్మాన్ ఖవాజా కూడా ఇదే విధానాల ప్రకారం వీసాలు పొందుతూ భారత్‌కు వచ్చారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ చేతుల్లోనే..

ఈ తరహా కేసుల్లో అనేక ప్రభుత్వ విభాగాల అనుమతులు అవసరమవుతాయి. తుది నిర్ణయం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చేతుల్లోనే ఉంటుందని, ఈ ప్రక్రియలో క్రీడా సంఘాలు లేదా ఆతిథ్య దేశ నిర్వాహకులకు ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, వరల్డ్ కప్‌లో పాల్గొనే ప్రతి జట్టుకూ ఇదే విధమైన వీసా క్లియరెన్స్ ప్రక్రియ అమలవుతుందని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆటగాళ్లు ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, ఒమన్, ఇటలీ వంటి దేశాల జట్లకు కూడా ఇదే విధమైన వీసా నిబంధనలు వర్తించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే ఆయా దేశాల‌కు వీసాల‌ను మంజూరు చేయ‌గా, కేవ‌లం యూఎస్ఏ జ‌ట్టులోని పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆట‌గాళ్ల‌కు మాత్రం వీసాలు పెండింగ్‌లో ప‌డ‌డం ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంది. మ‌రి ఈ వివాదం అయినా స‌రిగ్గా ముగుస్తుందా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ స‌జావుగా సాగుతుందా.. అన్న వివ‌రాలు వేచి చూస్తే తెలుస్తాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement