త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Sharma | ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను మైండ్ గేమ్‌తో బోల్తా కొట్టించిన రోహిత్‌.. రివ్యూ తీసుకునేలా యాక్టింగ్‌..

Rohit Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికరమైన మైండ్ గేమ్‌ ఆడాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి ఈ సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

S

Sports | Published On Apr 5, 2026, 11.55 am IST

Rohit Sharma | ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను మైండ్ గేమ్‌తో బోల్తా కొట్టించిన రోహిత్‌.. రివ్యూ తీసుకునేలా యాక్టింగ్‌..
Advertisement

Rohit Sharma | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికరమైన మైండ్ గేమ్‌ ఆడాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్ ఐదో బంతికి ఈ సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్ లెగ్ సైడ్ వైపు బంతిని వేయగా రోహిత్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని మిస్ చేశాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్ వెనుక బంతిని అందుకున్నాడు. ఈ సందర్భంలో కుల్దీప్, రాహుల్ ఇద్దరూ రోహిత్ బ్యాట్‌కు బంతి తగిలిందని భావించారు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వలేదు. కానీ రోహిత్ శ‌ర్మ తాను ఔట్ అయినట్లుగా భావిస్తూ కాస్త దూరం క్రీజు వ‌దిలి నడుచుకుంటూ వెళ్లాడు.

స‌రదా కోస‌మే అలా చేశా..

అయితే రోహిత్ నిజంగానే ఔట్ అయ్యాడేమో అని భావించిన కుల్దీప్, రాహుల్ డీఆర్‌ఎస్ తీసుకోవాలని కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్‌కు సూచించారు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ అలాగే చేశాడు. అయితే రిఫరల్ కి వెళ్లిన తరువాత అల్ట్రాఎడ్జ్‌లో రోహిత్ బ్యాట్‌కు బంతి తగలలేదని, అది ప్యాడ్‌ను తాకిందని తేలింది. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ న‌వ్వ‌డం కూడా క‌నిపించింది. కామెంటేట‌ర్లు సైతం రోహిత్ మైండ్ గేమ్ ఆడాడ‌ని, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక డీఆర్ఎస్ రివ్యూను వృథా చేసేందుకే రోహిత్ అలా చేశాడ‌ని అన్నారు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ తన మైండ్ గేమ్‌ గురించి మాట్లాడుతూ కుల్దీప్‌కు గురించి త‌న‌కు బాగా తెలుస‌ని, అతను డీఆర్‌ఎస్ తీసుకోవడాన్ని ఇష్టపడతాడ‌ని, అందుకే కొంచెం అదృష్టాన్ని పరీక్షించాన‌ని తెలిపాడు. కానీ తరువాతి ఓవర్‌లోనే తాను ఔట్ అయ్యాన‌ని, ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండాలని అనుకున్నా సాధ్యపడలేద‌ని తెలిపాడు. అయితే దీన్ని కేవ‌లం స‌ర‌దా కోస‌మే చేసిన‌ట్లు రోహిత్ తెలిపాడు. కుల్దీప్ 50-50 అవకాశాలున్నప్పుడు వెంటనే డీఆర్‌ఎస్ తీసుకుంటాడని త‌న‌కు తెలుస‌ని, అందుకే తాను అలా నటించాన‌ని అన్నాడు. అయితే ఆ రివ్యూ త‌మ‌ పక్షాన పనిచేసింద‌ని, కానీ తర్వాత వెంట‌నే ఔట్ అయ్యాన‌ని తెలిపాడు.

స‌మీర్ రిజ్వీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌..

అయితే ఈ మైండ్ గేమ్‌ మ్యాచ్ ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయింది. ముంబై ఇండియన్స్ జ‌ట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 162/6 తక్కువ స్కోర్ మాత్రమే సాధించింది. బౌలింగ్‌లో మంచి ఆరంభం చేసినప్పటికీ, ఢిల్లీ తరఫున సమీర్ రిజ్వీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను త‌మ వైపు మలిచాడు. స‌మీర్ రిజ్వీ 51 బంతుల్లో 90 పరుగులు చేసి 7 ఫోర్లు, 7 సిక్సులతో ఢిల్లీని 18.1 ఓవర్లలో గెలిపించాడు.

Advertisement
Advertisement