త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PCB | ఇంకా అదే డ్రామాలో పాకిస్థాన్‌.. ఆడేది, లేనిది తెలిపే నిర్ణ‌యం వాయిదా..

PCB | టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల కూడా సమయం లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం మరోసారి రాజకీయ-క్రీడా వివాదాలతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే ఒక జట్టు మార్పు జరిగిపోయింది.

S

Sports | Published On Jan 27, 2026, 7.52 am IST

PCB | ఇంకా అదే డ్రామాలో పాకిస్థాన్‌.. ఆడేది, లేనిది తెలిపే నిర్ణ‌యం వాయిదా..
Advertisement

PCB | టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల కూడా సమయం లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం మరోసారి రాజకీయ-క్రీడా వివాదాలతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే ఒక జట్టు మార్పు జరిగిపోయింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించిన నేపథ్యంలో పాకిస్థాన్ కూడా తప్పుకునే సూచనలు ఇస్తూ ఉద్రిక్తతను మరింత పెంచింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఈ విషయంలో తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నే తాము అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసిన అనంతరం నక్వీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందిస్తూ, ఈ వ్యవహారంపై తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మొత్తం ప్రపంచకప్ నుంచి తప్పుకునే బదులు, భారత్‌తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఈ పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉందని సమాచారం.

శుక్ర‌వారం లేదా సోమ‌వారం నిర్ణ‌యం..

ప్రపంచకప్‌కు ముందు మరో వివాదాన్ని చూడాలని ఐసీసీ ఏమాత్రం కోరుకోవడం లేదు. ఇప్పటికే పాకిస్థాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని స్పష్టంగా హెచ్చరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నక్వీ తన పోస్టులో, ప్రధాని మియాన్ మహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం జరిగింది. ఐసీసీ అంశాన్ని ఆయనకు వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలిస్తూ సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటాం, అని తెలిపారు. ఐసీసీ దృష్టిలో పాకిస్థాన్ ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే అది కేవలం ఆర్థిక నష్టంతో పరిమితం కాదని స్పష్టమ‌వుతోంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించినా, లేదా ప్రపంచకప్ నుంచి పూర్తిగా తప్పుకున్నా, అది ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌ను ప్రపంచకప్, ఆసియా కప్ వంటి అంతర్జాతీయ, ఖండస్థాయి టోర్నీల నుంచి పూర్తిగా సస్పెండ్ చేసే అధికారం ఐసీసీకి ఉంది.

పీసీబీకి తీవ్ర ఎదురుదెబ్బే..

అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్ సమాజంలో పాకిస్థాన్ పూర్తిగా ఒంటరిగా మారే ప్రమాదం కూడా ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ఎన్ఓసీలను రద్దు చేసే అవకాశమూ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది పీసీబీకి తీవ్ర దెబ్బ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణాల వల్లే ఎంత హడావుడి చేసినా, చివరకు పాకిస్థాన్ షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే వారు ఆడుతున్న వేదిక కూడా తమకిష్టమైన శ్రీలంక కావడం, భద్రతాపరమైన సమస్యలు లేకపోవడం వల్ల బహిష్కరణకు సరైన కారణం చూపలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచకప్ ముందు రాజకీయ ప్రకటనలు, ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ, చివరకు పాకిస్థాన్ ఆటకు దిగక తప్పదన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ అభిమానులందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement