త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohsin Naqvi | పాక్ క్రికెట్‌కు భ‌స్మాసుర హ‌స్తంగా మారిన న‌క్వీ.. అంద‌రి దృష్టిలోనూ బ‌ఫూన్‌..

Mohsin Naqvi | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు త‌రువాత వార్త‌ల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇత‌నిదే. ఈయ‌న‌కు అస‌లు క్రికెట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు అప్ప‌గించారో తెలియ‌దు.

S

Sports | Published On Jan 26, 2026, 12.25 pm IST

Mohsin Naqvi | పాక్ క్రికెట్‌కు భ‌స్మాసుర హ‌స్తంగా మారిన న‌క్వీ.. అంద‌రి దృష్టిలోనూ బ‌ఫూన్‌..
Advertisement

Mohsin Naqvi | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు త‌రువాత వార్త‌ల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇత‌నిదే. ఈయ‌న‌కు అస‌లు క్రికెట్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు అప్ప‌గించారో తెలియ‌దు. కానీ క్రికెట్ ముందు రాజ‌కీయాలు త‌రువాత అన‌డానికి బ‌దులుగా, రాజ‌కీయాలే ముందు, క్రికెట్ త‌రువాత అంటూ క్రికెట్ ప్ర‌పంచంలో ఓ విదూష‌కుడిలా మారాడు. పాకిస్థాన్ ఆతిథ్యంలో నిర్వ‌హించిన చాంపియ‌న్స్ ట్రోఫీ, మొన్నీ మ‌ధ్య నిర్వ‌హించిన ఆసియా క‌ప్ టోర్నీల‌లో ఒక దృఢ‌మైన నిర్ణ‌యంపై నిల‌బ‌డ‌లేక అంద‌రి దృష్టిలోనూ బ‌ఫూన్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు.

చాంపియ‌న్స్ ట్రోఫీ స‌మ‌యంలో..

2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు గాను వివాదాల‌న్నింటినీ ప‌క్క‌న బెట్టిన పాకిస్థాన్ ఎలాగో భార‌త్‌కు వ‌చ్చింది. భార‌త్‌లోనే త‌మ మ్యాచ్‌ల‌ను ఆడింది. ఆ త‌రువాత పీసీబీ స్పందిస్తూ, మేం భార‌త్‌కు వ‌చ్చాం క‌దా, భార‌త్ కూడా మా దేశానికి చాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రావాల్సిందే, లేదంటే టోర్నీని బ‌హిష్క‌రిస్తాం, అని చెప్పింది. అయితే పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేక‌పోయినా ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు ముప్పు అధికంగా ఉంద‌ని, క‌నుక పాక్‌కు రాలేమ‌ని, త‌మ‌కు భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని బీసీసీఐ చెప్పింది. అయితే చాంపియ‌న్స్ ట్రోఫీ క‌న్నా ముందే చాలా సంవ‌త్స‌రాల నుంచే ఇరు దేశాలు కేవ‌లం ఐసీసీ టోర్నీల్లోనే త‌ల‌ప‌డుతున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌ల‌లో ఆడ‌డం లేదు. కానీ 2023లో మాత్రం పాక్ జట్టు భార‌త్‌కు వ‌చ్చి ధైర్యం చేసింది. అలా అని చెప్పి భార‌త్ కూడా పాక్‌కు రావాల‌ని ఏమీ లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ విష‌యంలో న‌క్వీ మొండిగా వ్య‌వ‌హ‌రించాడు. చివ‌ర‌కు ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో మొత్తం భార‌త్ మ్యాచ్ ల‌ను దుబాయ్‌కి మార్చింది. ట్రోఫీని కూడా భార‌త్ గెలుచుకుంది. దీంతో ఆతిథ్య జ‌ట్టు అయి ఉండి కూడా తామే ఆ టోర్నీని నిర్వ‌హించామ‌ని చెప్పుకోవ‌డంలో న‌క్వీ విఫ‌లం అయ్యాడు. అంద‌రూ ఐసీసీ టోర్నీ దుబాయ్‌లో జ‌రిగింద‌నే భావించారు. కానీ పాక్ ఆతిథ్య జ‌ట్టు అన్న విష‌యం చాలా మందికి గుర్తు లేదు, తెలియ‌దు.

ఆసియా క‌ప్ టోర్నీలోనూ..

త‌రువాత ఆసియా క‌ప్ టోర్నీలో జింబాబ్వే రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పై పాకిస్థాన్ ఆరోప‌ణ‌లు చేసింది. పైక్రాఫ్ట్ భార‌త్‌, ఆఫ్గ‌నిస్థాన్ జ‌ట్ల‌కు మేలు చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించింది. ఆయ‌న రిఫ‌రీగా ఉంటే తాము ఆడ‌బోమ‌ని, టోర్నీని బ‌హిష్క‌రిస్తామ‌ని న‌క్వీ ఆధ్వ‌ర్యంలోని పీసీబీ నేరుగా బెదిరింపుల‌కు పాల్ప‌డింది. అయితే టోర్నీ నుంచి ఉన్న ప‌ళంగా త‌ప్పుకుంటే భారీ ఎత్తున జరిమానా క‌ట్టాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించ‌డంతో కాసేపు త‌ట‌ప‌టాయించినా చివ‌ర‌కు తోక ముడుచుకుని వ‌చ్చి మ‌ళ్లీ మ్యాచ్‌ల‌లో ఆడారు. దీంతో ఈ విష‌యంలోనూ న‌క్వీ జోక‌ర్ అయ్యాడు. అలాగే టోర్నీ విజేత భార‌త్‌కు ట్రోఫీని ఇవ్వ‌కుండా తీసుకెళ్లి లాహార్‌లోని త‌న ఆఫీస్‌లో పెట్టుకోవడం వివాదాస్ప‌దం అయింది. దీనిపై బీసీసీఐ ఇప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్‌గా స్పందించ‌క‌పోయినా అంద‌రి దృష్టిలో న‌క్వీ మాత్రం ట్రోఫీ చోర్‌గా మారి బ‌ఫూన్ అయ్యాడు.

బంగ్లాదేశ్‌ను అడ్డం పెట్టుకుని..

ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని మ‌రోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడ‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. అందుక‌నే బంగ్లా క్రికెట్ జ‌ట్టు విజ్ఞ‌ప్తిపై ఐసీసీ నిర్వ‌హించిన ఓటింగ్‌లోనూ ఎవ‌రూ ఆ రెండు జట్ల‌కు అనుకూలంగా ఓటు వేయ‌లేదు. బంగ్లా జ‌ట్టును త‌ప్పిస్తే తాము కూడా ఆ దేశానికి మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని, తాము కూడా టీ20 వ‌రల్డ్ క‌ప్ టోర్నీని బ‌హిష్క‌రిస్తామ‌ని చీప్ కామెంట్స్ చేస్తూ ఐసీసీని, బీసీసీఐని ఇరుకున పెట్టాల‌ని చూస్తున్న‌ట్లు మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. అయితే ఐసీసీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వెంట‌నే పాక్ జ‌ట్టును ప్ర‌క‌టించ‌డం, ఆ తరువాత కూడా మ‌ళ్లీ మీడియాతో మాట్లాడుతూ, జట్టునైతే ప్ర‌క‌టించాం కానీ, ఇంకా ఆడేది, లేనిదీ స్ప‌ష్ట‌త రాలేదు, అంటూ వంక‌ర‌ కామెంట్లు చేయ‌డం న‌క్వీ డ‌ర్టీ పాలిటిక్స్‌కు అద్దం ప‌డుతున్నాయి.

బ‌ఫూన్ కాక మ‌రేమిటి..?

పీసీబీ లేదా న‌క్వీ ఉద్దేశ‌పూర్వకంగానే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఐసీసీకి సైతం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కానీ భార‌త్‌తో మ్యాచ్ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని న‌క్వీ ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌కుండా చూడాలనే దురుద్దేశంతోనే న‌క్వీ ఇలా చేస్తున్నాడ‌ని సాక్షాత్తూ పాకిస్థాన్ మాజీ ప్లేయ‌ర్ బాసిత్ అలీ కామెంట్లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వేళ న‌క్వీ పాక్ జ‌ట్టును విర‌మింప‌జేయ‌డం ద్వారా ఇప్పుడు తాత్కాలికంగా స‌క్సెస్ అయి ఐసీసీకి వ‌చ్చే ఆదాయానికి గండి కొట్టినా, అది ఐసీసీ ఈవెంట్ల‌లో కేవ‌లం ఒక భాగం అన్న విష‌యాన్ని మాత్రం అత‌ను గుర్తించ‌డం లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు. కేవ‌లం ఇప్పుడు తాత్కాలిక విజ‌యం కోసం ఇలాంటి దుష్ట చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే భవిష్య‌త్తులో పాక్ జ‌ట్టుకు జ‌రిగే న‌ష్ట‌మే ఎక్కువ‌. ఎందుకంటే ఈ వ‌రల్డ్ క‌ప్ నుంచి గ‌నక పాక్ త‌ప్పుకుంటే ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ తతంగానికి పాల్ప‌డిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. అప్పుడు ఐసీసీ క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటుంది. దాని వ‌ల్ల ఆ జ‌ట్టు ఇక‌పై ఐసీసీ టోర్నీల్లో ఆడ‌లేదు. అంతేకాకుండా ద్వైపాక్షిక సిరీస్‌ల‌లోనూ ఆడ‌కుండా ఇత‌ర జ‌ట్ల‌పై ఐసీసీ నియంత్ర‌ణ విధిస్తుంది. ఇక పీఎస్ఎల్ లాంటి లీగ్‌ల‌ను పీసీబీ సొంతంగా నిర్వ‌హించుకోవాల్సిందే త‌ప్ప‌, ఐసీసీ ఫారిన్ ప్లేయ‌ర్ల‌కు ఎన్‌వోసీ ఇవ్వ‌దు. అలాగే ఐసీసీ నుంచి పాక్‌కు వ‌చ్చే నిధులు అన్నీ ఆగిపోతాయి. ఇంత‌టి ప్ర‌మాదం పొంచి ఉన్నా న‌క్వీ డర్టీ ట్రిక్స్‌కు పాల్ప‌డుతున్నాడంటే.. ఇంక అత‌న్ని బఫూన్ అన‌క ఏమ‌నాలి..? పాకిస్థాన్ జ‌ట్టుకు అత‌ను భ‌స్మాసుర హ‌స్తంగా మారాడ‌ని ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement