త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDW Vs ENGW | లార్డ్స్ మైదానంలో చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు

INDW Vs ENGW | ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ఈ మైదానంలో ఆడిన తొలి మ‌హిళా టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టుగా భార‌త్ రికార్డును క్రియేట్ చేసింది. ఇటీవ‌ల ముగిసిన మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు భార‌త్ చేతిలో మ‌రోమారు ప‌రాభ‌వం ఎదురైంది.

S

Sports | Published On Jul 13, 2026, 5.42 pm IST

INDW Vs ENGW | లార్డ్స్ మైదానంలో చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు
Advertisement

INDW Vs ENGW | ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ఈ మైదానంలో ఆడిన తొలి మ‌హిళా టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టుగా భార‌త్ రికార్డును క్రియేట్ చేసింది. ఇటీవ‌ల ముగిసిన మ‌హిళ‌ల‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లండ్‌కు భార‌త్ చేతిలో మ‌రోమారు ప‌రాభ‌వం ఎదురైంది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కుప్ప‌కూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 457 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక 186 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌పై భార‌త్ 270 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్ మొద‌ట్నుంచి భార‌త ప్లేయ‌ర్లు ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లోనూ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. పేస్‌, స్పిన్ విభాగాల్లో బౌల‌ర్లు రాణించ‌డంతోపాటు బ్యాట‌ర్లు కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఇంగ్లండ్‌పై భార‌త్ చిర్మ‌స‌రణీయ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం..

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త ప్లేయ‌ర్లు 285 ప‌రుగుల స్కోరు చేసి ఆలౌట్ అయ్యారు. ఓపెన‌ర్ స్మృతి మంధాన 108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 83 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయి సెంచ‌రీ మిస్ అయినా, త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంది. అలాగే కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 121 బంతుల్లో 7 ఫోర్ల‌తో 58 ప‌రుగులు చేసి జట్టు భారీ స్కోరును సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఆల్ రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ సైతం 87 బంతుల్లో 7 ఫోర్ల‌తో 57 ప‌రుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సోఫీ ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు తీయ‌గా, లారెన్ ఫైల‌ర్‌, ఇస్సీ వాంగ్‌, మాడీ విల్లీర్స్‌కు త‌లా 2 వికెట్లు ద‌క్కాయి. లారెన్ బెల్ 1 వికెట్ తీసింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 170 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ల‌లో అమీ జోన్స్ 62 బంతుల్లో 6 ఫోర్ల‌తో 52 ప‌రుగులు చేయ‌గా, కెప్టెన్ నాట్ సివ‌ర్ బ్రంట్ 85 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 44 ప‌రుగులు చేసింది. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో క్రాంతి గౌడ్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ టాప్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చ‌డంలో కీల‌క‌పాత్ర పోషించింది. అలాగే స‌యాలీ స‌త్ఘ‌రె, స్నేహ రానా చెరో 2 వికెట్లు తీశారు. దీప్తి శ‌ర్మ‌కు 1 వికెట్ ద‌క్కింది.

భారీ స్కోరును ఛేదించ‌లేక‌పోయిన ఇంగ్లండ్‌..

అనంత‌రం 115 ప‌రుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్ దూకుడును ప్ర‌ద‌ర్శించింది. ఓపెన‌ర్లు స్మృతి మంధాన (130 బంతుల్లో 70 ప‌రుగులు, 9 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), ష‌ఫాలి వ‌ర్మ (55 బంతుల్లో 33 ప‌రుగులు, 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 88 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన య‌స్తిక భాటియా సెంచ‌రీ (158 బంతుల్లో 113 ప‌రుగులు, 14 ఫోర్లు)తో రాణించింది. అలాగే రిచా ఘోష్ (52 బంతుల్లో 50 ప‌రుగులు, 8 ఫోర్లు) చివ‌ర్లో మెరుపులు మెరిపించ‌డంతో భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల న‌ష్టానికి 341 ప‌రుగులు చేసింది. అదే స‌మ‌యంలో రిచా ఘోష్ అర్ధ సెంచరీ పూర్త‌వ‌డంతో కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ఎదుట 457 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ ప‌రుగులు చేయ‌డంలో త‌డ‌బ‌డింది. దీంతో కేవ‌లం ఇద్ద‌రు ప్లేయ‌ర్లు మాత్ర‌మే అర్ధ సెంచ‌రీలు చేశారు. అమీ జోన్స్ (80 బంతుల్లో 54 ప‌రుగులు, 6 ఫోర్లు), సోఫీ ఎకిల్‌స్టోన్ (66 బంతుల్లో 50 ప‌రుగులు, 6 ఫోర్లు) కాసేపు ప్ర‌తిఘ‌టించినా అవ‌త‌లి ఎండ్‌లో ఉన్న ప్లేయ‌ర్ల నుంచి స‌హ‌కారం ల‌భించ‌లేదు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ రానా 4 వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌గా, స‌యాలి స‌త్ఘ‌రె, క్రాంతి గౌడ్‌, దీప్తి శ‌ర్మ‌లు త‌లా 2 వికెట్లు తీశారు.

చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌..

ఇంగ్లండ్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇప్ప‌టికే పురుషుల టెస్ట్ క్రికెట్‌లో అనేక మ్యాచ్‌లు జ‌రిగాయి. కానీ 142 ఏళ్ల త‌రువాత తొలిసారిగా ఈ మైదానంలో ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌, భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య టెస్టు మ్యాచ్ నిర్వ‌హించారు. ఇందులో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యం సాధించి చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కింది. గ‌తేడాది సొంత గ‌డ్డ‌పై కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఆధ్వ‌ర్యంలో జట్టు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెల‌వ‌గా, ఇటీవ‌ల ఇంగ్లండ్‌లోనే జ‌రిగిన మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మాత్రం సెమీ ఫైన‌ల్‌కు రాకుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. అయితే తాజా విజ‌యంతో జ‌ట్టుకు ఉత్సాహం వ‌చ్చింది. ఈ విజ‌యం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని, ఇంగ్లండ్‌పై భారీ తేడాతో గెలుపొంద‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ హ‌ర్మ‌న్ మీడియాకు తెలిపింది. కాగా భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు టెస్టుల్లోనూ అద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టు ఆడిన గ‌త 11 టెస్టుల్లో 7 విజ‌యాలు న‌మోదు కాగా, 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కేవ‌లం ఒక మ్యాచ్ లోనే ఓట‌మి పాలైంది. ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా జ‌రిగిన ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్‌కు ట్రోఫీ ద‌క్కింది.

Advertisement
Advertisement