త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs SA | నేడు ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య మూడో టీ20.. మ్యాచ్‌కు వ‌ర్షం, మంచు అడ్డంకిగా మార‌నున్నాయా..?

S

Sports | Published On Dec 14, 2025, 10.33 am IST

IND Vs SA | నేడు ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య మూడో టీ20.. మ్యాచ్‌కు వ‌ర్షం, మంచు అడ్డంకిగా మార‌నున్నాయా..?
Advertisement

IND Vs SA | ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్లు ఒక్కో మ్యాచ్‌లోనూ గెలిచి 1-1 తో స‌మాన ఆధిక్యంలో ఉన్న విష‌యం విదిత‌మే. రెండో టీ20లో పేల‌వ‌మైన బౌలింగ్‌, బ్యాటింగ్‌తో చ‌తికిలప‌డ్డ భార‌త్ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి మ‌ళ్లీ ఆధిక్యం సాధించాల‌ని చూస్తుండ‌గా, మ‌రో వైపు రెండో టీ20లో గెలుపొందిన ఉత్సాహంతో సౌతాఫ్రికా జ‌ట్టు అదే జోరును కొన‌సాగిస్తూ మూడో టీ20లోనూ విజ‌యం సాధించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే మూడో టీ20 ఇవాళ ధ‌ర్మ‌శాల‌లో రాత్రి 7 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు హిమాచ‌ల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌పీసీఏ) ఆతిథ్యం ఇస్తోంది. అయితే మంచు ప్రాంతం కావ‌డంతో రాత్రి పూట అక్క‌డ ఇంకా ఎక్కువ మంచు కురిసే అవ‌కాశం ఉన్నందున మ్యాచ్‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

ధ‌ర్మ‌శాల‌లో రాత్రి వ‌ర‌కు కాస్త తేలిక‌పాటి జ‌ల్లులు కూడా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో మ్యాచ్‌కు వ‌ర్షం, మంచు రెండూ అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే వ‌ర్షం ప‌డ‌క‌పోతే తీవ్ర‌మైన మంచుతో ప్లేయ‌ర్లు ఆడ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా బౌల‌ర్ల‌కు మంచు కార‌ణంగా బంతిని ప‌ట్టుకోవ‌డం, బౌలింగ్ వేయ‌డం చాలా ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే రెండో టీ20 మాదిరిగానే ఇక్క‌డ కూడా బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి. ఇక ధ‌ర్మ‌శాల మైదానంలో ఇటీవ‌ల జ‌రిగిన టీ20 మ్యాచ్‌ల‌లో జ‌ట్లు 200 పైచిలుకు స్కోరు సాధించ‌డం విశేషం. కానీ ఈ మైదానంలో ప్ర‌తి టీ20 ఇన్నింగ్స్‌లోనూ యావ‌రేజ్ స్కోరు 137 నుంచి 152గా ఉంది. అంటే ఈ పిచ్ బౌల‌ర్ల‌కు కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

రాత్రి పూట ఈ మైదానంలో 9 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే చాన్స్ ఉంది. దీంతో ప్రేక్ష‌కులు, ప్లేయ‌ర్ల‌కు తీవ్ర మంచు ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసే జ‌ట్టు గెలిచేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి. మంచు కార‌ణంగా రెండో సారి బ్యాటింగ్ చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. ఈ క్ర‌మంలోనే టాస్ కీల‌కం కానుంది. టాస్ గెలిచిన జ‌ట్టు ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకునే చాన్స్ ఉంది. అయితే భార‌త బ్యాట్స్‌మెన్ గిల్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, శివం దూబెల ఫామ్ టీమిండియాను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ టీ20లో జ‌ట్టులో ఏవైనా మార్పులు ఉంటాయేమోన‌ని అంచ‌నా వేస్తున్నారు. సంజు శాంస‌న్‌కు చాన్స్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement