త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

England Cricketers | 6 రోజుల పాటు మ‌ద్యం మ‌త్తులో తూగారు.. ఇక యాషెస్ ఏం గెలుస్తారు..?

England Cricketers | ఆస్ట్రేలియా ఆతిథ్యంలో కొన‌సాగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌ను ఇప్ప‌టికే ఆతిథ్య జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం విదిత‌మే. 5 టెస్టుల సిరీస్‌లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉండ‌గా ఇప్ప‌టికే సిరీస్ ఆసీస్ సొంత‌మైంది. ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్ జ‌ట్టు బేజ్‌బాల్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

S

Sports | Published On Dec 24, 2025, 1.32 pm IST

England Cricketers | 6 రోజుల పాటు మ‌ద్యం మ‌త్తులో తూగారు.. ఇక యాషెస్ ఏం గెలుస్తారు..?
Advertisement

England Cricketers | ఆస్ట్రేలియా ఆతిథ్యంలో కొన‌సాగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌ను ఇప్ప‌టికే ఆతిథ్య జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం విదిత‌మే. 5 టెస్టుల సిరీస్‌లో ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉండ‌గా ఇప్ప‌టికే సిరీస్ ఆసీస్ సొంత‌మైంది. ఈ నేప‌థ్యంలోనే ఇంగ్లండ్ జ‌ట్టు బేజ్‌బాల్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు టెస్టుల్లో టీ20ల లాంటి ఆట‌ను ఆడాల్సిన అవ‌స‌రమేమిటి..? అని ఇంగ్లండ్ జట్టు కోచ్ బ్రెండాన్ మెక‌ల్ల‌మ్ ను అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. అయితే ఇంగ్లండ్ యాషెస్‌ను ఓడేందుకు బేజ్ బాల్ మాత్ర‌మే కార‌ణం కాద‌ని, ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు ఏకంగా 6 రోజుల పాటు మ‌ద్యం మ‌త్తులో తూగార‌ని, ప్రాక్టీస్ చేయాల్సింది పోయి బీచ్‌లో ఎంజాయ్ చేశార‌ని, అందుక‌నే వ‌రుస టెస్టుల్లో ఓట‌మి పాలయ్యార‌ని బీబీసీ ఏకంగా ఓ క‌థ‌నాన్నే ప్ర‌చురించింది. దీంతో ఈ విష‌యం స‌ర్వ‌త్రా హాట్ టాపిక్‌గా మారింది.

6 రోజుల పాటు ఎంజాయ్‌..?

రెండో యాషెస్ టెస్టు అనంత‌రం ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌కు చాలా స‌మ‌యం ల‌భించింది. మూడో టెస్టు వ‌ర‌కు ఏకంగా 10 రోజుల వ‌ర‌కు విరామం దొరికింది. దీంతో ఇంగ్లండ్ జ‌ట్టుకు ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేసేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం లభించింది. కానీ వారు ఆ స‌మ‌యాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆ స‌మ‌యంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు ఏకంగా 6 రోజుల పాటు ఆస్ట్రేలియాలోని నూసా బీచ్ రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేశారు. మ‌ద్యం మ‌త్తులో తూగారు. ప్రాక్టీస్‌ను మ‌రిచారు. క‌నుక‌నే ఇంగ్లండ్ ఓడిపోయింది. యాషెస్ సిరీస్ చేజారింది.. అని బీబీసీ త‌న క‌థ‌నంలో పేర్కొంది. దీంతో ఈ వార్త పెద్ద ఎత్తున వివాదాస్ప‌దం అయింది. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై వెంట‌నే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. నూసా ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టింది. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది అన్న కోణంలో ప్లేయ‌ర్ల‌ను విచారిస్తోంది.

బెన్ డ‌కెట్ వీడియో వైర‌ల్‌..

అయితే బీబీసీ క‌థ‌నానికి మ‌రింత ఊత‌మిచ్చేలా ఇంగ్లండ్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ నూసాలోని ఓ రిసార్ట్‌లో పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి హోట‌ల్‌కు ఎలా వెళ్లాలో తెలియ‌క అవ‌స్థ‌లు ప‌డుతున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈసీబీ మరింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాము ప్లేయ‌ర్ల‌కు నూసా వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చిన మాట నిజ‌మేన‌ని, కోచ్ మెక‌ల్ల‌మ్ స్వ‌యంగా పార్టీని అరేంజ్ చేశాడ‌ని, కానీ వారు 6 రోజుల పాటు మ‌ద్యం మ‌త్తులో ఉన్న విష‌యం తెలియ‌ద‌ని, వారు విప‌రీతంగా మ‌ద్యం సేవించి ఉంటే శిక్ష‌కు అర్హుల‌ని తెలిపింది. మ్యాచ్‌ల మ‌ధ్య‌లో ప్లేయ‌ర్ల‌కు రిఫ్రెష్‌మెంట్ కోసం పార్టీలు నిర్వ‌హించ‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ వారు లిమిట్‌లో ఆల్క‌హాల్ తీసుకోవాల‌ని, విప‌రీతంగా మ‌ద్యం సేవించ‌డం సరికాద‌ని, ఈ విష‌యంపై తాము విచార‌ణ చేప‌ట్టామ‌ని ఈసీబీ తెలియ‌జేసింది.

స‌మాధానాలు దాట‌వేత‌..

కాగా ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆ జ‌ట్టు టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అత‌ను మీడియాతో మాట్లాడుతూ.. తాము గేమ్ మీద ఫోక‌స్ పెట్టామ‌ని, త‌న ప్లేయ‌ర్ల‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, త‌మ జ‌ట్టుపై వ‌స్తున్న వార్త‌లు త‌మ ఆత్మివిశ్వాసాన్ని దెబ్బ తీయ‌లేవ‌ని అన్నాడు. సిరీస్ మ‌ధ్య‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటి వార్త‌లు రావ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నాడు. అయితే 6 రోజుల పాటు మ‌ద్యం సేవించారా.. అని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స్టోక్స్ స‌మాధానాలు దాట‌వేశాడు. తాము 26వ తేదీ నుంచి మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్ డే టెస్టుపై ప్ర‌స్తుతం ఫోక‌స్ పెట్టామ‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలోనే యాషెస్ డ్రంక్ గేట్ ఉదంతం ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement