త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

యాషెస్ సిరీస్‌.. రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ కు ప‌రాభ‌వం.. ఘ‌న విజ‌యం సాధించిన ఆసీస్‌..

S

Sports | Published On Dec 7, 2025, 5.09 pm IST

యాషెస్ సిరీస్‌.. రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ కు ప‌రాభ‌వం.. ఘ‌న విజ‌యం సాధించిన ఆసీస్‌..
Advertisement

ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ప‌రాభ‌వం పాలైంది. ఇంగ్లండ్ ఉంచిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. దీంతో టెస్టు సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. ఆసీస్ స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ అటు బౌలింగ్‌తోపాటు ఇటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. దీంతో అత‌నికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు తొలి ఇన్నింగ్స్‌లో 334 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌లలో జో రూట్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. 15 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 138 ప‌రుగులు చేసిన రూట్ నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మెన్ జాక్ క్రాలీ 11 ఫోర్ల‌తో 76 ప‌రుగులు సాధించాడు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ ఏకంగా 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే మైకేల్ నెస‌ర్‌, స్కాట బోలండ్‌, బ్రెండాన్ డాగెట్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆసీస్ 511 ప‌రుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ప్లేయ‌ర్ల‌లో జేక్ వెథ‌రాల్డ్‌, మార్న‌స్ ల‌బుషేన్‌, కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ అంద‌రూ స‌మిష్టిగా రాణించారు. త‌లా ఒక్క అర్థ సెంచ‌రీ చేశారు. స్టార్క్ ఏకంగా 13 ఫోర్ల‌తో 77 ప‌రుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు. ఇక ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ్రైడాన్ కార్స్ 4 వికెట్లు తీయ‌గా, కెప్టెన్ స్టోక్స్‌కు 3 వికెట్లు ద‌క్కాయి. జోఫ్రా ఆర్చ‌ర్‌, గ‌స్ అట్కిన్‌స‌న్‌, విల్ జాక్స్ త‌లా 1 వికెట్ తీశారు.

అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవ‌లం 241 ప‌రుగులు మాత్ర‌మే సాధించి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో కెప్టెన్ స్టోక్స్ మిన‌హా ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. 4 ఫోర్ల‌తో స్టోక్స్ 50 ప‌రుగులు చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మైకేల్ నెస‌ర్ 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలండ్‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. బ్రెండాన్ డ‌గెట్ 1 వికెట్ తీశాడు. ఈ క్ర‌మంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ త‌మ‌కు నిర్దేశించిన 65 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. 2 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే 69 ప‌రుగులు చేసి ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆసీస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు ఈ నెల 17వ తేదీన అడిలైడ్ లో ప్రారంభం కానుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement