త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

South africa Vs Canada | ఉత్కంఠ పోరులో కెన‌డా విజ‌యం

P

Sports | Published On Jun 29, 2026, 3.40 pm IST

South africa Vs Canada | ఉత్కంఠ పోరులో కెన‌డా విజ‌యం
Advertisement
  • 1-0 తేడాతో ద‌క్షిణాఫ్రికాపై కెన‌డా గెలుపు
  • ఇంజ్యూరీ టైమ్‌లో గోల్ చేసిన స్టీఫెన్ ఉస్తాకియో
  • వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన సౌతాఫ్రికా
  • ఓడినా ఆక‌ట్టుకున్న బ‌ఫానా బ‌ఫానా

South africa Vs Canada | ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా ప్ర‌యాణం ముగిసింది. ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు అసాధార‌ణ పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శించిన ఆ జ‌ట్టు త్రుటిలో రౌండ్ ఆఫ్ 16 ఆశ‌ల‌ను కోల్పోయింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది క్ష‌ణాల ముందు కెన‌డా గోల్ సాధించ‌డంతో ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. రౌండ్ ఆఫ్-32లో కెనడాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంజ్యూరీ టైమ్‌లో కెప్టెన్ స్టీఫెన్ యూస్టాక్వియో చేసిన ఏకైక గోల్ కెనడాకు 1-0 విజయాన్ని క‌ట్ట‌బెట్టింది. ఈ విజయంతో జెస్సీ మార్ష్ సారథ్యంలో కెనడా తొలిసారి ప్రపంచకప్ ప్రీక్వార్టర్‌ (రౌండ్ ఆఫ్-16)లో అడుగుపెట్టగా.. దక్షిణాఫ్రికా ఇంటిబాట ప‌ట్టింది. మ్యాచ్ ప్రారంభం నుంచే కెనడా బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సౌతాఫ్రికాపై ఎదురుదాడి చేస్తూ డిఫెన్స్‌ను ఛేదించేందుకు ప్ర‌య‌తించింది.

అవ‌కాశం ఇవ్వ‌ని డిఫెన్స్‌..

అయితే, బఫానా బఫానా డిఫెండర్స్ ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. జోనథన్ డేవిడ్, టాజోన్ బుకానన్, టానీ ఒలువాసేయి గోల్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారి ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్లు అడ్డుకొని ప్ర‌మాదం నుంచి జ‌ట్టును కాపాడుతూ వ‌చ్చారు. గోల్‌కీపర్ రాన్‌వెన్ విలియమ్స్ మరోసారి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. క్రాస్‌లు, షాట్‌లను సమర్థంగా అడ్డుకుంటూ కెనడా దాడులను తిప్పికొట్టాడు. అత‌నికి డిఫెన్స్ టీమ్ నుంచి సైతం అద్భుత స‌హ‌కారం దొరికింది. మోయిస్ బొంబిటో ఆడిన షాట్‌ను ఆబ్రే మోడిబా గోల్‌లైన్‌పై నుంచి అడ్డుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత జోన‌థ‌న్ డేవిడ్ దాదాపుగా గోల్ చేస్తాడ‌నుకున్న స‌మ‌యంలో సిమ్పివే ఎంబోకాజీ చివ‌రి క్ష‌ణాల్లో అడ్డుకొని జ‌ట్టును మ‌రోసారి ప్ర‌మాదం నుంచి త‌ప్పించాడు. ఖులిసో ముడావు, ఎన్‌కోసినాటి సిబిసి, సియాబోంగా ఎన్‌గెజానా క్రమశిక్షణతో డిఫెన్స్‌తో కెన‌డా దాడిని అడ్డుకున్నారు.

ద‌క్షిణాఫ్రికా అభిమానుల్లో ఆశ‌లు..

మ్యాచ్ గోల్స్ లేకుండా ముందుకు సాగుతుండటంతో దక్షిణాఫ్రికా అభిమానుల్లో ఆశలు పెరిగాయి. రెండోభాగంలో కెనడా కోచ్ జెస్సీ మార్ష్ కీలక మార్పులు చేశాడు. ముందుగా ప్రామిస్ డేవిడ్‌ను బరిలోకి దింపగా, అనంతరం గాయం కారణంగా గ్రూప్ దశకు దూరమైన స్టార్ ఆటగాడు అల్ఫోన్సో డేవీస్‌ను మైదానంలోకి పంపాడు. అత‌ని రాకతో కెనడా ఎటాకింగ్‌లో వేగం పెరిగింది. దక్షిణాఫ్రికా డిఫెన్స్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ముడావు తరచూ తన స్థానాన్ని వీడాల్సి రావడంతో మిడిల్ సెక్ష‌న్‌లో ఖాళీ ఖక‌నిపించింది. అయినా, దక్షిణాఫ్రికా వెనక్కి తగ్గలేదు. విలియమ్స్ మరోసారి కీలక సేవ్స్ చేయ‌గా.. ఎంబోకాజీ ప్రాణం పెట్టి బంతులను అడ్డుకున్నాడు. ప్రతి క్లియరెన్స్‌ను గోల్ చేసినంత సంబరంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జరుపుకోవడం వారి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ఐదు నిమిషాలు ఇంజ్యూరీ టైమ్ ఇవ్వ‌డంతో మ్యాచ్ అద‌న‌పు స‌మ‌యం ఖాయ‌మైంది. ఈ టైమ్ మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది.

మ‌లుపు తిప్పిన ఇంజ్యూరీ టైమ్‌..

మ్యాచ్‌లో దాదాపు చివరి ఎటాక్‌లో మిడ్‌ఫీల్డ‌ర్ స్టీఫెన్ ఉస్తాకియో బాక్స్‌లో వ‌చ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. ఆ గోల్‌తో కెనడా శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియగా.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మైదానంలోనే నిరాశతో కుప్ప‌కూలిపోయారు. మ్యాచ్‌లో ఓట‌మిపాలైనా ద‌క్షిణాఫ్రికా.. ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ముఖ్యంగా విలియమ్స్, మోడిబా, ఎంబోకాజీతో పాటు మొత్తం డిఫెన్స్ విభాగం టోర్నీ అంతటా అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంది. బలమైన జట్లను సైతం ఇబ్బందులకు గురిచేసిన ఈ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ దృష్టిని ఆకర్షించింది. తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరిన ఆ జట్టు.. తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రీక్వార్టర్‌లో నెదర్లాండ్స్-మొరాకో మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టుతో కెన‌డా త‌ల‌ప‌డ‌నుంది. ఈ టోర్నీలో ఇప్పటికే చరిత్ర సృష్టిస్తున్న కెనడా మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టిస్తుందా? అన్న‌ ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement