త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Australia Media | ఆసీస్ మీడియా ఇప్పుడేమంటుంది..? అదే భార‌త్‌లో అయితే ఎంత ఏడ్చేవారో..?

Australia Media | ఆస్ట్రేలియా వేదిక‌గా యాషెస్ టెస్టు సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మెల్‌బోర్న్‌లో 4వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ్గా అందులో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలి మూడు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ ఇప్ప‌టికే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. కానీ తాజా టెస్టులో ఓట‌మి పాలైంది.

S

Cricket | Published On Dec 28, 2025, 12.53 pm IST

Australia Media | ఆసీస్ మీడియా ఇప్పుడేమంటుంది..? అదే భార‌త్‌లో అయితే ఎంత ఏడ్చేవారో..?
Advertisement

Australia Media | ఆస్ట్రేలియా వేదిక‌గా యాషెస్ టెస్టు సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా మెల్‌బోర్న్‌లో 4వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ్గా అందులో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలి మూడు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ ఇప్ప‌టికే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. కానీ తాజా టెస్టులో ఓట‌మి పాలైంది. ఇక చివ‌రిదైన 5వ టెస్టు జ‌న‌వ‌రి 4 నుంచి సిడ్నీలో జ‌ర‌గ‌నుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 4 టెస్టులు కూడా మొత్తం క‌లిపి 13 రోజుల్లోనే ముగియ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే పెర్త్‌, మెల్‌బోర్న్‌ల‌లో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లు కేవ‌లం 2 రోజుల్లోనే ముగిశాయి. అయితే ఈ విష‌యంపై ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చ‌ర్చ కొన‌సాగుతోంది. ఆస్ట్రేలియాలో సీమ్ పిచ్‌ల‌పై మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిస్తే ఎవ‌రూ ఏమీ అన‌డం లేదు, కానీ భార‌త్ వంటి ఉప‌ఖండ దేశాల్లో స్పిన్ పిచ్‌ల‌పై మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మీడియా గ‌గ్గోలు పెడుతుంది అంటూ ప‌లువురు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీలు, విశ్లేష‌కులు విమ‌ర్శిస్తున్నారు.

భార‌త్ అయితే ఒక‌లా.. ఆసీస్ అయితే మ‌రొక‌లా..

తాజాగా జ‌రిగిన మెల్‌బోర్న్ టెస్టులో తొలి రోజే ఇరు జ‌ట్లు ఆలౌట్ అయ్యాయి. ఇక మ‌రుస‌టి రోజు ఒక‌టిన్న‌ర సెషన్‌లోనే ఆస్ట్రేలియా మ‌ళ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ చాలా త‌క్కువ ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ త‌రువాత ల‌క్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ గెలుపొందింది. కానీ ఇంగ్లండ్ కూడా క‌ష్టం మీద గెలిచింది. ఇంకొన్ని ప‌రుగులు ఉండి ఉంటే ఇంగ్లండ్ కూడా ఆలౌట్ అయి ఉండేది. కానీ ఆ జ‌ట్టు ఎలాగో బ‌తికి బ‌య‌ట ప‌డింది. ఈ క్ర‌మంలోనే మెల్‌బోర్న్ పిచ్‌పై అక్క‌డి మాజీలు, విశ్లేష‌కులు కూడా పెద‌వి విర‌వ‌డం విశేషం. టెస్టు మ్యాచ్‌లు ఇలా రెండు రోజుల్లోనే ముగిస్తే ఆద‌ర‌ణ కోల్పోతాయ‌ని, బ్యాట్‌కు, బంతికి మ‌ధ్య స‌మాన పోటీ ఉండాల‌ని, అప్పుడే టెస్టు మ్యాచ్‌ల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని అభిప్రాయ ప‌డ్డారు. అయితే ఈ విష‌యంపై మాత్రం ఆస్ట్రేలియా మీడియా గ‌ప్ చుప్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనిపైనే ప‌లువురు మాజీలు, విశ్లేష‌కులు విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తున్నారు. భార‌త్ వంటి ఉప‌ఖండ దేశాలు అయితే ఒక‌లా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అయితే మ‌రొక‌లా క‌థ‌నాలు వండి వ‌డ్డించ‌డం ఇంగ్లిష్ మీడియాకే చెల్లింద‌ని అంటున్నారు.

స్పిన్ పిచ్‌ల‌పై ఎందుకంత గగ్గోలు..?

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ దినేష్ కార్తీక్ ఇదే విష‌యంపై త‌న ఎక్స్ ఖాతాలో స్పందించారు. మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్ క‌నీసం 3వ రోజు ముగిసినా బాగుండేది. అందుకోసం అక్క‌డి ప్రేక్ష‌కులు ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. కానీ రెండో రోజే ముగియ‌డం నిరాశ ప‌రిచింది. ఈ టెస్టు సిరీస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు ఇలా రెండు రోజుల్లోనే ముగిశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం 4 యాషెస్ టెస్టులు అన్నీ క‌లిపి 13 రోజుల్లోనే ముగిశాయి. ఇది చాలా విడ్డూరం.. అని దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియా మీడియాను ఎద్దేవా చేశారు. అలాగే మ‌రో మాజీ ప్లేయ‌ర్ ఆకాష్ చోప్రా సైతం దీనిపై స్పందించారు. మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్ ఒక‌టిన్న‌ర రోజులోనే ముగిసింది. క‌నీసం ఒక్క స్పిన్ బౌల‌ర్ కూడా బౌలింగ్ వేయ‌లేదు. అదే భార‌త్ లాంటి దేశాల పిచ్‌ల‌పై ఫాస్ట్ బౌల‌ర్‌ల‌ను అస‌లు ఉప‌యోగించ‌క‌పోతే అప్పుడు ఎంత గ‌గ్గోలు పెట్టేవారో.. అంటూ ఆసీస్ మీడియాను ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే క్రికెట్ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇక నెటిజ‌న్లు సైతం ఆసీస్ మీడియాను తూర్పార‌బ‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement