త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rafale F4 | భార‌త వైమానిక ద‌ళంలో రఫేల్ F4 జెట్స్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Rafale F4 | గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే, దాడులకు ముందే శత్రు రాడార్‌లను మాయ‌ చేసే సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలతో (రఫేల్ F4) భారత వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది.

S

Science | Published On Feb 9, 2026, 7.24 am IST

Rafale F4 | భార‌త వైమానిక ద‌ళంలో రఫేల్ F4 జెట్స్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
Advertisement

Rafale F4 | గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే, దాడులకు ముందే శత్రు రాడార్‌లను మాయ‌ చేసే సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలతో (రఫేల్ F4) భారత వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. చైనా-పాకిస్థాన్ ల నుంచి ఎదురయ్యే ద్విముఖ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ యుద్ధవిమానాలతో పాటు ప్రపంచ స్థాయి ఫైటర్ జెట్‌లను సమన్వయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కదులుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీజింగ్-ఇస్లామాబాద్ సమన్వయం స్పష్టంగా కనిపించడంతో ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. దేశీయంగా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తేజస్ సిరీస్ యుద్ధవిమానాల అభివృద్ధిలో నిమగ్నమై ఉండగా, ఐదో తరం ఫైటర్‌గా రూపుదిద్దుకుంటున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ AMCA ప్రాజెక్ట్‌పై కూడా ఆశలు ఉన్నాయి. ఇవి 2028 నాటికి ఫలితాలు చూపనున్నప్పటికీ, తేజస్ డెలివరీల్లో ఆలస్యం భారత వాయుసేనలో ఆందోళనల‌ను పెంచుతోంది.

అన్నింటినీ రఫేల్ F4 కు అప్‌గ్రేడ్‌..

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి అదనంగా 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలును భారత్ పరిశీలిస్తోంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ భారత పర్యటన సందర్భంగా రూ.3 లక్షల కోట్లకు మించిన విలువైన ఒప్పందాన్ని ఖరారు చేయాలన్న లక్ష్యంతో అధికారులు కదిలినట్టు సమాచారం. ఇప్పటికే భారత్ 36 రఫేల్ జెట్‌లను కొనుగోలు చేయగా, నౌకాదళం కోసం మరో 36 మెరైన్ రఫేల్‌లను ఆర్డర్ చేసింది. ఇప్పుడు ప్రతిపాదిత 114 జెట్‌లు చేరితే భారత వాయుసేన సామర్థ్యం పూర్తిగా కొత్త స్థాయికి చేరనుంది. ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్నవి రఫేల్ F3R వేరియంట్‌లు. కొత్త ఒప్పందంలో అత్యాధునిక రఫేల్ F4 జెట్‌లు ఉండనున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఉన్న F3R ఫ్లీట్‌ను కూడా F4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రణాళిక ఉంది. ఇది అమలైతే దక్షిణాసియాలో భారత వైమానిక శక్తిలో గణనీయమైన మార్పు కనిపించనుంది.

అత్యాధునిక వ్య‌వ‌స్థ‌లు..

ఫ్రాన్స్‌కు చెందిన డ‌సాల్ట్ ఏవియేష‌న్ అభివృద్ధి చేసిన రఫేల్ F4, 4.5 తరం యుద్ధవిమాన సాంకేతికతలో పెద్ద అడుగుగా పరిగణించబడుతోంది. అత్యాధునిక ఏవియానిక్స్, సెన్సార్లు, నెట్‌వర్క్-సెంట్రిక్ యుద్ధ సామర్థ్యం, ఆధునిక ఆయుధ వ్యవస్థలతో ఇది భవిష్యత్తు ఐదో తరం ప్లాట్‌ఫామ్‌లకు వారధిగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ ఈ వేరియంట్‌ను వినియోగించనున్న దేశాల జాబితాలో ఉన్నాయి. రఫేల్ F4లో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ, సురక్షిత డేటా లింకులు, పైలట్ నిర్ణయాలకు తోడ్పడే ఏఐ ఆధారిత సపోర్ట్ ఉన్నాయి. ఇవి రియల్ టైమ్‌లో క‌చ్చితమైన సమాచారం అందిస్తూ, ఇతర యుద్ధవిమానాలు, డ్రోన్లు, భూ వ్యవస్థలతో సమన్వయంగా యుద్ధం చేసే అవకాశం కల్పిస్తాయి. నెట్‌వర్క్-సెంట్రిక్ ఆపరేషన్లు ఈ జెట్ ప్రత్యేకత. అలాగే ఈ జెట్ ఏకంగా 9500 కిలోల బ‌రువైన బాంబులు లేదా ఆయుధ సామ‌గ్రిని (పే లోడ్‌) బాహ్యంగా మోసుకెళ్ల‌గ‌ల‌దు. అందులో 1000 కిలోల బ‌రువు ఉన్న ప్రిసిష‌న్ గైడెడ్ బాంబ్స్‌ను కూడా తీసుకెళ్ల‌వ‌చ్చు. 1900 కిలోమీట‌ర్ల స్ట్రైక్ రేంజ్ ను ఈ జెట్ క‌లిగి ఉంటుంది.

అనేక అప్‌గ్రేడ్స్‌..

F4లో ఉన్న థేలెస్ RBE2 AESA రాడార్ దీర్ఘదూర లక్ష్యాలను మెరుగ్గా గుర్తించి ట్రాక్ చేయగలదు. అలాగే అప్‌గ్రేడ్ చేసిన SPECTRA ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ శత్రు రాడార్‌లు, మిస్సైల్ ముప్పుల నుంచి రక్షణ పెంచుతుంది. ప్రమాదాలను ముందే హెచ్చరించి, ఎలక్ట్రానిక్ కౌంటర్‌మిజర్స్ ద్వారా విమానం భద్రతను నిర్ధారిస్తుంది. F3Rతో పోలిస్తే F4లో అనేక అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. అధునాతన ఏవియానిక్స్, బలమైన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, నెట్‌వర్క్ సామర్థ్యం, రియల్ టైమ్ డేటా షేరింగ్ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. ఆయుధ వ్యవస్థల్లో MICA NG ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు, స్మార్ట్ బాంబులు, స్టాండ్-ఆఫ్ వెపన్లు చేరడం వల్ల దాడి, రక్షణ సామర్థ్యం పెరుగుతుంది. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, డిజిటల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అందుబాటును పెంచి నిర్వహణ ఖర్చులు తగ్గిస్తాయి. మాడ్యులర్ డిజైన్ భవిష్యత్తు అప్‌గ్రేడ్‌లను సులభం చేస్తుంది.

యూఏఈ భారీ ఆర్డ‌ర్‌..

అలాగే SCALP స్టెల్త్ క్రూయిజ్ మిస్సైల్, AASM హామర్ ప్రెసిషన్ బాంబులు, స్కార్పియన్ హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లే వంటి వ్యవస్థలు వేగంగా లక్ష్యాన్ని లాక్ చేయడంలో సహాయపడతాయి. జంట స్నెక్మా M88 ఇంజిన్లతో అధిక వేగం, విశ్వసనీయ పనితీరు అందిస్తుంది. యూఏఈ ఇప్పటికే 80 రఫేల్ F4 జెట్‌లకు అతిపెద్ద ఆర్డర్ ఇచ్చింది. ఫ్రెంచ్ నేవీ కూడా తన క్యారియర్-బేస్డ్ రఫేల్‌లను వచ్చే 10-15 ఏళ్ల పాటు అందుబాటులో ఉంచేందుకు F4 ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయనుంది. భారత్ ప్రస్తుతం F3Rలను ఆపరేట్ చేస్తూనే, 114 మల్టీ-రోల్ జెట్‌ల కొనుగోలుపై, అందులో F4ల‌ను కూడా పరిశీలన చేస్తోంది. ఇందులో దేశీయ అసెంబ్లీ, స్వదేశీ వ్యవస్థల సమీకరణతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమివ్వాలన్న ఆలోచన కూడా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రఫేల్ F4 కేవలం యుద్ధవిమానం మాత్రమే కాదు. ఇది నెట్‌వర్క్ చేసిన ప్లాట్‌ఫామ్‌లు, అన్‌మ్యాన్డ్ డ్రోన్లతో కలిసి పనిచేసే భవిష్యత్తు యుద్ధ వ్యవస్థలో భాగం. ఇది భారత్‌ను ఐదో తరం సామర్థ్యాల దిశగా మరింత దగ్గర చేస్తోంది. ఇప్పటికే డసాల్ట్ తదుపరి F5 స్టాండర్డ్‌పై పని చేస్తుండగా, ప్రస్తుతం గ్లోబల్ ఫైటర్ మార్కెట్‌లో రఫేల్ F4 అత్యాధునిక సాంకేతికతతో భారత్ సహా అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement
Advertisement