త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nuclear Power Plant on Moon | చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్.. పదేళ్లలో నిర్మించాలని రష్యా ప్లాన్

Nuclear Power Plant on Moon | చంద్రుడిపై అన్వేషణ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాబిల్లిపై పలు దేశాలు పలు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది.

S

Science | Published On Dec 25, 2025, 11.12 am IST

Nuclear Power Plant on Moon | చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్.. పదేళ్లలో నిర్మించాలని రష్యా ప్లాన్
Advertisement

Nuclear Power Plant on Moon | చంద్రుడిపై అన్వేషణ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాబిల్లిపై పలు దేశాలు పలు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను నిర్మించేందుకు రష్యా సిద్ధమైంది. 2036 నాటికి ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది. తమ లూనార్ ప్రోగ్రామ్‌తో పాటు రష్యా - చైనా ఉమ్మడి పరిశోధనా కేంద్రానికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అంతరిక్ష అన్వేషణలో ప్రధాన దేశాల మధ్య పోటీ తీవ్రమవుతున్న తరుణంలో రష్యా చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఏరోస్పేస్ కంపెనీ లావోచ్కిన్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లుగా రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కస్‌మస్ వెల్లడించింది. ఈ విద్యుత్ కేంద్రం అణుశక్తిపై ఆధారపడుతుందని రాస్కస్‌మస్ స్పష్టంగా ప్రకటించేలేదు. కానీ ఈ ప్రాజెక్టులో రష్యా అణుశక్తి సంస్థ రోసాటమ్, ప్రముఖ అణు పరిశోధన సంస్థ కుర్చాటోవ్ ఇన్‌స్టిట్యూట్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో చంద్రుడిపై నిర్మించేది అణు విద్యుత్ కేంద్రమేనని ప్రచారం జరుగుతోంది. చంద్రుడిపై రోవర్స్, పరిశీలన కేంద్రం, రష్యా -చైనా సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్‌కు అవసరమైన మౌలిక విద్యుత్ సరఫరా చేయడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని రాస్కాస్‌మస్ పేర్కొంది.

అంతరిక్ష పరిశోధనల్లో ఒకప్పుడు రష్యా ముందుండేది. 1961లోనే తొలిసారిగా రష్యా తమ వ్యోమగామి యూరి గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఆ తర్వాత అమెరికా, చైనా దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళ్లాయి. దీంతో రష్యా కాస్త వెనుకబడింది. ఈ క్రమంలోనే 2023లో రష్యా చేపట్టిన లూనా - 25.. చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందే కూలిపోయింది. ఇది రష్యాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.

చంద్రుడిపై న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన రష్యా కంటే ముందు అమెరికా కూడా చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా 2030 నాటికి చంద్రుడిపై అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. చంద్రుడిపై శాశ్వత స్థావరం, భవిష్యత్తులో మార్స్‌పైకి ప్రయాణాలకు అణు శక్తి అత్యవసరమని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అంతరిక్షంలో అణు ఆయుధాల ఏర్పాటు నిషేధం ఉంది. అయితే నిబంధనలకు లోబడి అణుశక్తి వనరుల వినియోగానికి అనుమతి ఉంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement