త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia | ఉద్యోగం కోసం ర‌ష్యాకు వెళ్లి.. జైలుపాల‌య్యాడు..

Russia | ఉక్రెయిన్‌తో ర‌ష్యా (Russia) చేస్తున్న‌ యుద్ధంలో భార‌తీయులు స‌మిధ‌లుగా మారుతున్నారు. మంచి ఉద్యోగం, జీతం పేరుతో ర‌ష్యాకు వెళ్తున్న భార‌తీయ యువ‌త బ‌ల‌వంతంగా సైన్యంలో చేర‌డ‌మో లేదా జైలుపాల‌వ‌డమో జ‌రుగుతున్నాయి.

G

National | Published On Nov 9, 2026, 11.07 am IST

Russia | ఉద్యోగం కోసం ర‌ష్యాకు వెళ్లి.. జైలుపాల‌య్యాడు..
Advertisement

Russia | త్రినేత్ర న్యూస్‌: ఉక్రెయిన్‌తో ర‌ష్యా (Russia) చేస్తున్న‌ యుద్ధంలో భార‌తీయులు స‌మిధ‌లుగా మారుతున్నారు. మంచి ఉద్యోగం, జీతం పేరుతో ర‌ష్యాకు వెళ్తున్న భార‌తీయ యువ‌త బ‌ల‌వంతంగా సైన్యంలో చేర‌డ‌మో లేదా జైలుపాల‌వ‌డమో జ‌రుగుతున్నాయి. తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని (Chhattisgarh) రాయ్‌పూర్‌కు చెందిన 38 ఏండ్ల తికేశ్వ‌ర్ సాహు (Tikeshwar Sahu).. ఉద్యోగం కోసం ర‌ష్యాకు వెళ్లి జైలులో మ‌గ్గుతున్నాడు.

రాయ్‌పూర్‌లో (Raipur) స్టోర్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ తికేశ్వ‌ర్ సాహుకి టెలిగ్రామ్ ద్వారా ర‌ష్యాలో డెలివ‌రీ ఏజెంట్ (Delivery Agent) ఉద్యోగం ఆఫ‌ర్ వ‌చ్చింది. టూరిస్ట్ వీసాను వ‌ర్క్ వీసాగా మారుస్తామ‌ని అందులో పేర్కొన్నారు. దీంతో ఇక్క‌డి కంటే అధికంగా జీతం వ‌స్తుండ‌టంతో కుటుంబానికి మంచి జీవితం అందించ‌వ‌చ్చ‌ని, త్వ‌ర‌లోనే వారిని కూడా ర‌ష్యాకు తీసుకెళ్ల వ‌చ్చ‌నే ఆశ‌తో టూరిస్టు వీసాతో సెప్టెంబ‌ర్ 7న రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. మ‌రుస‌టి రోజు అక్క‌డి నుంచి ర‌ష్యాకు వెళ్లారు. మొద‌ట మాస్కోకి వెళ్లిన సాహు.. అనంత‌రం అక్క‌డి నుంచి వోల్గొగ్రాడ్‌కు (Volgograd) చేరుకున్నారు.

అక్క‌డ‌ ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెన్న వ్య‌క్తి అత‌నికి 5 వేల ర‌ష్య‌న్ రూబెల్స్ ఇచ్చి.. సైన్యంలో చేరాలంటూ ప‌త్రాల‌పై సంత‌కాలు చేయాలంటూ ఒత్తిడి చేశాడు. దానికి సాహు ఒప్పుకోక‌పోవ‌డంతో త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో అత‌డిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. అనంత‌రం అత‌ని ఫోను స్విచ్ ఆఫ్ అయింది. సెప్టెంబ‌ర్ 16న సాహూతో చివ‌రిసారిగా తాము మాట్లాడ‌మ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. అనంత‌రం త‌మ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింద‌ని, అందులో సాహు చేతి రాత‌తో కూడిన లేఖ ఉంద‌ని చెప్పారు. త‌న‌ను డ్ర‌గ్స్ కేసులో ఇరికించార‌ని, ర‌ష్యా సైన్యంలో (Russian Army) చేరాల్సిందిగా బ‌ల‌వంతం చేస్తున్నార‌ని అందులో పేర్కొన్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదే విష‌య‌మై న‌వంబ‌ర్ 4న ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు. సాహుని విడిపించాల‌ని, భార‌త్‌కు తీసుకురావాల‌ని వేడుకున్నారు. కాగా, సాహు కేసులో త‌మకు ఫిర్యాదు అందింద‌ని రాయ్‌పూర్ పోలీసులు తెలిపారు. నిబంధ‌నల ప్ర‌కారం దానిని రాష్ట్ర హోం శాఖకు పంపుతామ‌న్నారు. తదుపరి చర్యల కోసం వారు దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు (MEA) పంపుతార‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement