త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paraselene | ఆకాశంలో న‌లుగురు చంద్రులు..? ర‌ష్యాలో చోటు చేసుకున్న ఖ‌గోళ మాయ‌..!

Paraselene | రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఈ వారం ఆకాశాన్ని పరిశీలించిన వారికి అరుదైన, ఆశ్చర్యకరమైన దృశ్యం కనువిందు చేసింది. రాత్రి ఆకాశంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు చంద్రులు మెరిసినట్టుగా కనిపించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని పారాసెలీన్ అని పిలుస్తారు.

S

Science | Published On Feb 2, 2026, 1.20 pm IST

Paraselene | ఆకాశంలో న‌లుగురు చంద్రులు..? ర‌ష్యాలో చోటు చేసుకున్న ఖ‌గోళ మాయ‌..!
Advertisement

Paraselene | రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఈ వారం ఆకాశాన్ని పరిశీలించిన వారికి అరుదైన, ఆశ్చర్యకరమైన దృశ్యం కనువిందు చేసింది. రాత్రి ఆకాశంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు చంద్రులు మెరిసినట్టుగా కనిపించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఈ అరుదైన ప్రకృతి దృశ్యాన్ని పారాసెలీన్ అని పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చంద్రుడి చుట్టూ ప్రకాశించే పలుచని కాంతి గోళాలు కనిపించడంతో, భూమికి ఉన్న ఈ సహజ ఉపగ్రహం ఒక్కసారిగా పెరిగిపోయిందా అన్న భావన కలిగింది. నిజానికి ఇది ఖగోళ ఘటన కాదు. వాతావరణంలో ఏర్పడే ఒక ఆప్టికల్ భ్రమ (ఇల్యూష‌న్‌) మాత్రమే.

త‌క్కువ ఎత్తులో ఉన్న‌ప్పుడు..

చంద్రకాంతి పలుచని, ఎత్తైన సిరస్ లేదా సిరోస్ట్రాటస్ మేఘాల గుండా ప్రయాణించేటప్పుడు, అందులోని సమతల, షట్కోణాకార మంచు స్ఫటికాల ద్వారా వక్రీభవనం చెందుతుంది. ఫలితంగా చంద్రుడి ఇరువైపులా ప్రకాశవంతమైన కాంతి మచ్చలు ఏర్పడి, అదనపు చంద్రులు కనిపించినట్టు అనిపిస్తుంది. నాసా ప్రకారం, ఈ పారాసెలీన్లు సాధారణంగా చంద్రుడి నుంచి సుమారు 22 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ కోణంలో కనిపిస్తాయి. ఇవి చంద్రుడికంటే మసకగా ఉంటాయి. చంద్రుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు ఇవి స్పష్టంగా కనిపిస్తాయి, ఎందుకంటే అప్పుడు కాంతి తళుకులు తగ్గి చుట్టూ ఉన్న కాంతి నమూనాలు బాగా దర్శనమిస్తాయి.

ప్ర‌కృతి మాయ మాత్ర‌మే..

ఈ కాంతి మచ్చలు ఎప్పుడూ చంద్రుడితో సమానమైన ఎత్తులోనే కనిపిస్తాయి. మేఘాల్లోని మంచు స్ఫటికాల ఆకారం, అవి ఊగిసలాడే విధానంపై ఆధారపడి ఈ కాంతి నిలువుగా పొడవుగా కనిపించవచ్చు. పెద్ద స్ఫటికాలు ఉన్నప్పుడు మరింత స్పష్టమైన, ఎత్తైన కాంతి స్తంభాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగటి వేళ కనిపించే సన్‌డాగ్‌లకు ఇవి సమానమైనవే అయినా, రాత్రి సమయంలో ఒకేసారి పలుచంద్రులు కనిపించడం చాలా అరుదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆకాశంలో ఒకేసారి అనేక పారాసెలీన్లు దర్శనమివ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అయితే ఈ దృశ్యం హానికరం కాద‌ని, కేవలం కళ్లకు కనిపించే ప్రకృతి మాయ మాత్రమే అని శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు.

Advertisement
Advertisement