త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neanderthal Men vs Human Women | మన పూర్వీకుల ప్రేమకథ.. నియాండర్తల్ మగవారు, మానవ మహిళల మధ్యనే శారీరక సంబంధాలు

మానవ పరిణామం అనేది కేవలం 'బతికి బట్టకట్టడం' కోసం జరిగిన జీవశాస్త్ర పోరాటం మాత్రమే కాదు. అందులో మన పూర్వీకుల సామాజిక ఎంపికలు, వేల ఏళ్ల నాటి శారీక కలయిక, వారి ఆకర్షణ నియమాలు కూడా కీలక పాత్ర పోషించాయి.

J

Science | Published On Mar 1, 2026, 3.08 pm IST

Neanderthal Men vs Human Women | మన పూర్వీకుల ప్రేమకథ.. నియాండర్తల్ మగవారు, మానవ మహిళల మధ్యనే శారీరక సంబంధాలు

సంక్షిప్త సారాంశం

వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మన పూర్వీకులు 'నియాండర్తల్స్' (Neanderthals), ఆధునిక మానవుల (Homo sapiens) మధ్య జరిగిన శారీరక సంబంధాలపై ఒక సంచలన అధ్యయనం వెలువడింది. ముఖ్యంగా నియాండర్తల్ పురుషులు, ఆధునిక మానవ మహిళల మధ్యనే ఎక్కువగా కలయికలు జరిగాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని వల్లే నేటి మానవుల ఎక్స్ క్రోమోజోమ్‌లో నియాండర్తల్ డీఎన్ఏ ఆనవాళ్లు లేవని ఈ కొత్త పరిశోధన స్పష్టం చేస్తోంది. జీవ పరిణామక్రమంలో ఇదొక సరికొత్త మలుపు.

Advertisement
  • వేల ఏళ్ల నాటి రొమాన్స్
  • మన డీఎన్ఏలో ఆ సీక్రెట్ దాగుందా?
  • దాని వెనుక ఉన్న జన్యు రహస్యం ఏంటి?

మానవ పరిణామ క్రమం (Human Evolution) ఎప్పుడూ ఆశ్చర్యకరమైన రహస్యాలతో నిండి ఉంటుంది. ఆధునిక మానవులు (హోమో సెపియెన్స్) ఆవిర్భవించడానికి ముందు భూమిపై జీవించిన వాళ్లే 'నియాండర్తల్స్' (Neanderthals). కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆధునిక మానవులు, నియాండర్తల్స్ మధ్య శారీరక సంబంధాలు జరిగాయని, ఆ కలయికల వల్లే నేటికీ మన డీఎన్ఏలో వారి ఆనవాళ్లు ఉన్నాయని గతంలోనే శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే, ఫిబ్రవరి 26, 2026 నాడు ప్రఖ్యాత సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం సరికొత్త, షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. ఆధునిక మానవులు, నియాండర్తల్స్ మధ్య జరిగిన కలయికలు సమానంగా జరగలేదని, అవి ఏకపక్షంగా జరిగాయని ఈ పరిశోధన చెబుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. నియాండర్తల్ పురుషులు, ఆధునిక మానవ స్త్రీల మధ్యనే ఎక్కువగా శారీరక సంబంధాలు జరిగాయని ఈ అధ్యయనం కుండబద్దలు కొట్టింది.

మానవ మహిళల పట్ల నియాండర్తల్ మగవారి ఆకర్షణ

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన సారా టిష్కాఫ్, అలెగ్జాండర్ ప్లాట్ నేతృత్వంలోని బృందం ఈ వినూత్న పరిశోధన చేసింది. ఆఫ్రికన్ మూలాలు లేని నేటి మానవులందరిలో దాదాపు 2 శాతం నియాండర్తల్ డీఎన్ఏ ఉంటుంది. కానీ, ఎప్పటినుంచో శాస్త్రవేత్తలను తొలుస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే.. మానవులలో లింగాన్ని నిర్దేశించే ఎక్స్ క్రోమోజోమ్‌ పై మాత్రం నియాండర్తల్ డీఎన్ఏ ఆనవాళ్లు ఎందుకు శూన్యంగా ఉన్నాయి? దీనికి సమాధానంగా.. నియాండర్తల్ జన్యువులు ఆధునిక మానవులకు "జీవశాస్త్రపరంగా విషపూరితమైనవి (Biologically Toxic)" అని, ఆ జన్యువులతో పుట్టిన పిల్లలు ఆరోగ్య సమస్యలతో, సంతానోత్పత్తి లోపాలతో చనిపోయి ఉంటారని, అందుకే ప్రకృతి ఆ జన్యువులను మానవ జనాభా నుంచి క్రమంగా తొలగించిందని ఇప్పటివరకు నిపుణులు భావించారు.

కానీ, ఈ కొత్త అధ్యయనం ఆ పాత సిద్ధాంతాన్ని పూర్తిగా తప్పుబట్టింది. అల్టాయ్, చాగ్యిర్స్కాయ, విండిజా ప్రాంతాల్లో దొరికిన మూడు నియాండర్తల్ శిలాజాలను పరిశోధకులు విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా, నియాండర్తల్స్ ఎక్స్ క్రోమోజోమ్‌పై ఊహించిన దానికంటే 62 శాతం ఎక్కువగా మానవ డీఎన్ఏ ఉన్నట్లు గుర్తించారు. మానవ జన్యువులు నియాండర్తల్స్ శరీరంలో ఎలాంటి హాని లేకుండా మనుగడ సాగించగలిగినప్పుడు, నియాండర్తల్ జన్యువులు మానవులకు ప్రమాదకరం ఎలా అవుతాయి? కాబట్టి, ఈ రెండు జాతుల మధ్య ఎలాంటి జీవశాస్త్రపరమైన అననుకూలత లేదని స్పష్టమైంది.

ఎక్స్ క్రోమోజోమ్ సీక్రెట్ ఇదే!

మరి మన ఎక్స్ క్రోమోజోమ్‌పై నియాండర్తల్ డీఎన్ఏ ఎందుకు లేదు? దీనికి సమాధానం వారి "డేటింగ్" లేదా సంభోగ విధానాల్లోనే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవులలో 23వ జత క్రోమోజోమ్ లింగాన్ని నిర్ధారిస్తుంది. స్త్రీలకు రెండు ఎక్స్(XX) క్రోమోజోమ్‌లు ఉంటే, పురుషులకు ఒక ఎక్స్, ఒక వై (XY) క్రోమోజోమ్ ఉంటాయి. ఒక తల్లి తన కొడుకు, కుమార్తె ఇద్దరికీ ఎక్స్ క్రోమోజోమ్‌ను ఇస్తుంది. కానీ తండ్రి మాత్రం కేవలం తన కూతురికి మాత్రమే ఎక్స్ క్రోమోజోమ్‌ను ఇస్తాడు (కొడుకుకు వై క్రోమోజోమ్ ఇస్తాడు).

దీనిని బట్టి లెక్కేస్తే.. ఒక నియాండర్తల్ పురుషుడు, ఆధునిక మానవ స్త్రీతో సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టే మగబిడ్డకు తండ్రి నుంచి వై, తల్లి నుంచి మానవ ఎక్స్ క్రోమోజోమ్ వస్తాయి. అంటే ఆ కొడుకు ద్వారా భవిష్యత్ తరాలకు నియాండర్తల్ ఎక్స్ క్రోమోజోమ్ వెళ్లే అవకాశమే లేదు. ఒకవేళ ఆ జంటకు ఆడపిల్ల పుడితే, తండ్రి నుంచి నియాండర్తల్ ఎక్స్ క్రోమోజోమ్ వస్తుంది. కానీ ఆ కూతురు మానవ సమాజంలోనే ఉండిపోయి, వరుసగా మానవ పురుషులతోనే వివాహ బంధాలు ఏర్పరుచుకుంటూ వెళితే.. కొన్ని తరాల తర్వాత ఆ చిన్నపాటి నియాండర్తల్ ఎక్స్ జన్యువు పలుచబడి, క్రమంగా కనుమరుగైపోతుంది.

ఇదే సమయంలో, మానవ మహిళల ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రం పెద్ద ఎత్తున నియాండర్తల్ జనాభాలోకి ప్రవేశించాయి. అందుకే నియాండర్తల్ శిలాజాల్లో మానవ డీఎన్ఏ ఎక్కువగా కనిపించింది. ఈ సమీకరణాలన్నీ ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సహజీవనం లేదా శారీరక సంబంధాలు ఎక్కువగా నియాండర్తల్ మగవారు, మానవ ఆడవారి మధ్యనే జరిగాయి.

ఇది బలవంతమా? లేదా ఇష్టపూర్వకమా?

మానవ చరిత్రలో 50,000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. వేలాది సంవత్సరాల పాటు కొనసాగిన ఒక సామాజిక అలవాటు అని పరిశోధకుడు అలెగ్జాండర్ ప్లాట్ పేర్కొన్నారు. అయితే, ఇలా నియాండర్తల్ మగవారు మానవ మహిళలతో జతకట్టడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇది వారు ఇష్టపూర్వకంగా ఎంచుకున్న మార్గమా? లేక ఏవైనా దాడులు, బలవంతపు చర్యల ద్వారా జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ అధ్యయనం భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకురానుంది. నియాండర్తల్ సమాజంలో పురుషులు తమ స్వంత సమూహాలను వదిలి ఇతర సమూహాలకు వలస వెళ్లేవారా? ఆడవారు తమ కుటుంబాలతోనే ఉండిపోయేవారా? వంటి సామాజిక గతిశీలతను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఏది ఏమైనా, మానవ పరిణామం అనేది కేవలం 'బతికి బట్టకట్టడం' కోసం జరిగిన జీవశాస్త్ర పోరాటం మాత్రమే కాదు. అందులో మన పూర్వీకుల సామాజిక ఎంపికలు, వేల ఏళ్ల నాటి శారీక కలయిక, వారి ఆకర్షణ నియమాలు కూడా కీలక పాత్ర పోషించాయని, అవి నేటికీ మన డీఎన్ఏ లో ప్రతిధ్వనిస్తున్నాయని ఈ అద్భుతమైన పరిశోధన నిరూపించింది.

Advertisement
Advertisement