త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moon | కుచించుకుపోతున్న చంద్రుడు.. ఉన్న‌ట్లుండి మాయ‌మైతే ఏం జ‌రుగుతుంది..?

Moon | భూమికి ఉన్న ఏకైక స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉప‌గ్ర‌హం చంద్రుడు రోజు రోజుకీ కుచించుకుపోతున్నాడ‌ని చంద్ర భూగర్భ నిర్మాణాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి అంతర్భాగం చల్లబడుతూ ఉండటమే ఈ ప్రక్రియకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

S

Science | Published On Mar 4, 2026, 1.45 pm IST

Moon | కుచించుకుపోతున్న చంద్రుడు.. ఉన్న‌ట్లుండి మాయ‌మైతే ఏం జ‌రుగుతుంది..?
Advertisement

Moon | భూమికి ఉన్న ఏకైక స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉప‌గ్ర‌హం చంద్రుడు రోజు రోజుకీ కుచించుకుపోతున్నాడ‌ని చంద్ర భూగర్భ నిర్మాణాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి అంతర్భాగం చల్లబడుతూ ఉండటమే ఈ ప్రక్రియకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మార్పు బిలియన్ల సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ తాజా విశ్లేషణల ప్రకారం ఇది గతంలో భావించినదానికంటే వేగంగా జరుగుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. అమెరికాలోని నేష‌న‌ల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకు చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రుడి అంతర్భాగం కాలక్రమేణా వేడిని కోల్పోతూ చల్లబడుతోంద‌ని తేలింది. ఈ ప్రక్రియలో అంతర్గత భాగం కుచించుకుపోతుంది. దాని ఫలితంగా చంద్రుడి ఉపరితలపు క్రస్ట్ ముడుచుకుని ఒత్తిడికి గుర‌వుతుంద‌ని తేల్చారు. ఈ క్ర‌మంలో అదే కేంద్రానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్త థామ‌స్ ఆర్‌.వాట‌ర్స్ మాట్లాడుతూ 2010లో వెల్లడించిన పరిశోధనకు కొనసాగింపుగా దీన్ని భావిస్తున్నామ‌ని తెలిపారు. కాగా అప్పట్లోనే చంద్రుడు క్రమంగా సైజులో చిన్న‌గా మారుతున్నాడ‌ని ఆయన ఆధారాలతో నిరూపించారు.

చంద్రుడు మాయం అవుతాడా..?

అయితే చంద్రుడు ఉన్న‌ట్లుండి మాయం కావడం అసంభవమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఒకవేళ చంద్రుడు పూర్తిగా లేకపోతే భూమిపై భారీ ప్రభావాలు కనిపిస్తాయని వారు హెచ్చరించారు. చంద్రుడు భూమి అక్షపు వంపును స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అలాగే సముద్ర అల‌ల‌ను నియంత్రించడంలో, దీర్ఘకాల వాతావరణ మార్పులను ప్రభావితం చేయడంలో చంద్రుని పాత్ర ఉంటుంది. చంద్రుడు లేకపోతే భూమిపై వాతావరణ మార్పులు తీవ్రంగా మారవచ్చు. ఋతువులు అస్థిరంగా మారే అవకాశం ఉంది. సముద్ర అల‌లు కూడా గణనీయంగా బలహీనపడతాయి. దీని ప్రభావం భూమిపై జీవవ్యవస్థలపై కూడా పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి విచిత్ర సంఘటన ఒకసారి సుమారు 900 సంవత్సరాల క్రితం జరిగినట్లు చరిత్రలో నమోదైంది. 1110 సంవత్సరంలో రాసిన ఆంగ్లో-సాక్సన్ పత్రం పీట‌ర్‌బ‌రో క్రానిక‌ల్ లో చంద్రుడు ఒక రాత్రి పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వివరించారు. మే నెలలో ఐదవ రాత్రి చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించాడు. తరువాత కొద్దికొద్దిగా అతని వెలుగు తగ్గిపోయింది. పూర్తిగా రాత్రి కాగానే చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోయాడు. అతని కాంతి, గోళం ఏదీ కనిపించలేదు. తెల్లవారుజామున మాత్రం మళ్లీ ప్రకాశంగా కనిపించాడు.. అని అందులో రాసి ఉంది. అయితే తరువాతి పరిశోధనలు అది ఒక అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల వాయుమండలంలో ఏర్పడిన సల్ఫ‌ర్‌ కణాల పొర కారణంగా జరిగిందని తేల్చాయి.

సూక్ష్మ స్థాయిలో భౌగోళిక మార్పులు..

చంద్రుడు చల్లబడుతున్న కొద్దీ అతని ఉపరితలంపై లోబేట్ స్కార్ప్స్ అనే భౌగోళిక నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. ఇవి చిన్న కొండచరియల మాదిరిగా కనిపించే రిడ్జ్‌లు. చంద్రుడి క్రస్ట్ ఒత్తిడికి లోనై పైకి జ‌ర‌గ‌డం వల్ల ఇవి ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలంపై చిన్న చిన్న రిడ్జ్‌లను కూడా గుర్తించారు. ఇవి చంద్రుడిలో ఇంకా సూక్ష్మ స్థాయిలో భౌగోళిక మార్పులు జరుగుతున్నాయని సూచిస్తున్నాయి. ఈ నిర్మాణాలు భూభౌతిక పరంగా చాలా తాజావని నాసాతోపాటు ఇతర అంతరిక్ష సంస్థలు పేర్కొన్న పరిశోధనలు సూచిస్తున్నాయి. భూమిలా ప్లేట్ టెక్టానిక్స్ లేకపోయినా చంద్రుడు ఇంకా టెక్టానిక్ క్రియాశీలతను కలిగి ఉన్నాడని ఇది తెలియ‌జేస్తోంది. ఈ నిర్మాణాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి చంద్రుడిపై సంభవించే మూన్‌క్వేక్స్ కు కారణమయ్యే ప్రాంతాలను సూచించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై దిగే అంతరిక్ష మిషన్ల ల్యాండింగ్ ప్రాంతాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది.

పరిశోధన ప్రధాన రచయిత కోల్ నైప‌వెర్ మాట్లాడుతూ అపోలో మిషన్ల కాలం నుంచి చంద్రుడి ఎత్తైన ప్రాంతాల్లో లోబేట్ స్కార్ప్స్ ఉన్నాయని మాకు తెలుసు. తాజా అధ్యయనాలు చంద్రుడి మైదాన ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిర్మాణాలు విస్తృతంగా ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇది చంద్రుడి అంతర్గత చరిత్రపై కొత్త అవగాహనను అందిస్తోంది.. అని తెలిపారు.

Advertisement
Advertisement