త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moon Crater | చంద్రుడిపై కొత్తగా భారీ గొయ్యి.. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ఢీకొట్టడంతోనే..!

Moon Crater | ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌లోని ఓ శకలం గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. ఈ ఘటనతో చంద్రుడి ఉపరితలంపై కొత్తగా ఓ భారీ బిలం ఏర్పడింది. మానవ నిర్మిత వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన ఈ బిలానికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలను దక్షిణ కొరియాకు చెందిన చంద్రయాన్‌ ‘దనూరి’ తాజాగా చిత్రీకరించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ పైదశ బుధవారం చంద్రుడిని ఢీకొట్టింది.

P

International | Published On Aug 11, 2026, 8.45 pm IST

Moon Crater | చంద్రుడిపై కొత్తగా భారీ గొయ్యి.. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ఢీకొట్టడంతోనే..!
Advertisement

Moon Crater | ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌లోని ఓ శకలం గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. ఈ ఘటనతో చంద్రుడి ఉపరితలంపై కొత్తగా ఓ భారీ బిలం ఏర్పడింది. మానవ నిర్మిత వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన ఈ బిలానికి సంబంధించిన స్పష్టమైన చిత్రాలను దక్షిణ కొరియాకు చెందిన చంద్రయాన్‌ ‘దనూరి’ తాజాగా చిత్రీకరించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ పైదశ బుధవారం చంద్రుడిని ఢీకొట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కొరియా ఏరోస్పేస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (KARI)కు చెందిన దనూరి ఉపగ్రహం ఢీకొన్న ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఈ సందర్భంగా పలుమార్లు అక్కడి ఉపరితలాన్ని చిత్రీకరించింది. ఢీకొట్టడానికి ముందు, ఆ తర్వాతి పరిస్థితులను శాస్త్రవేత్తలు పోల్చుకునే అవకాశం లభించింది. ఈ ఢీకొనడంతో సుమారు 27 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు వరకు బిలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాకెట్‌ ఢీకొన్న ప్రదేశంలో చంద్రుడి ఉపరితలం మిగతా ప్రాంతాలతో పోలిస్తే మరింత నల్లగా కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతంలో దుమ్ము, శిథిలాలు చెల్లాచెదురుగా పడినట్లు చిత్రాల్లో స్పష్టమవుతోంది. ఢీకొనడానికి సుమారు 30 నిమిషాల ముందే దనూరి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం ప్రారంభించిందని కేఏఆర్‌ఐ (KARI) తెలిపింది. మొత్తంగా ఎనిమిది సార్లు చిత్రాలను సేకరించినట్లు పేర్కొంది. ‘ఈ పరిశీలన ద్వారా ఢీకొన్న ప్రాంతంలోని ఉపరితల మార్పులతో పాటు, ఎగిసిపడిన పదార్థాల ఆనవాళ్లను గుర్తించాం’ అని సంస్థ వెల్లడించింది.

అసలేం జరిగింది?

ఫాల్కన్‌-9 రాకెట్‌ను 2025 జనవరిలో అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. రెండు ప్రైవేటు మూన్‌ ల్యాండర్లను ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌కు చెందిన ‘బ్లూ ఘోస్ట్‌’, ఇస్పేస్‌కు చెందిన ‘రెసిలియన్స్‌’ చంద్రుడి కక్ష్యలోకి చేర్చడం దీని లక్ష్యం. రాకెట్‌లోని ప్రధాన బూస్టర్‌ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చేలా రూపొందించారు. అయితే, మిషన్‌ పూర్తయిన తర్వాత పైదశ మాత్రం అంతరిక్షంలోనే మిగిలిపోయింది. అది చంద్రుడిని ఢీకొట్టేలా ఉద్దేశపూర్వకంగా ప్రయోగించలేదు. అయితే, చంద్రుడి గురుత్వాకర్షణ, సౌర కార్యకలాపాల ప్రభావంతో దాదాపు 4,000 నుంచి 4,500 కిలోల బరువున్న రాకెట్‌ (రాకెట్‌ అప్పర్‌ స్టేజ్‌) క్రమంగా చంద్రుడి వైపు వెళ్లడం ప్రారంభించింది. రాకెట్‌ అసాధారణంగా ఉండడాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తొలుత గుర్తించారు. అనంతరం నాసాకు చెందిన సెంటర్‌ ఫర్‌ నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌ స్టడీస్‌ సైతం దీన్ని ధ్రువీకరించింది. సుమారు 12 మీటర్ల పొడవున్న రాకెట్‌ శకలం చివరకు గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. ఈ ఢీకొనడం దాదాపు మూడు టన్నుల టీఎన్‌టీ పేలుడుకు సమానమైన శక్తిని విడుదల చేసి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఢీకొనడానికి ముందు.. తర్వాత

దనూరి సేకరించిన చిత్రాలు శాస్త్రవేత్తలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించాయి. రాకెట్‌ చంద్రుడిని ఢీకొట్టడానికి కొద్దిసేపటి ముందే ఆ ప్రాంతాన్ని దనూరి చిత్రీకరించింది. దీంతో ఢీకొనడానికి ముందు చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో, ఆ తర్వాత ఎలా మారిందో శాస్త్రవేత్తలు నేరుగా పోల్చలగిగారు. నాసాకు చెందిన ‘లూనార్‌ రీకానైసెన్స్‌ ఆర్బిటర్‌’ ఆ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది. దీంతో కొత్తగా ఏర్పడిన బిలంతో పాటు చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడిన శిథిలాలపై మరింత సమాచారం లభించనుంది. స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ ఢీకొనడాన్ని పరోక్షంగా రికార్డు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చంద్రుడి అంచు వెనుక ఢీకొనడం జరగడంతో అసలు వెలుగును వారు చూడలేకపోయారు. అయితే, ఢీకొనడంతో అంతరిక్షంలోకి ఎగిసిన దుమ్ము, శిథిలాల మేఘాన్ని తమ పరికరాల్లో గుర్తించి ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలకు ఎందుకంత ఆసక్తి?

చంద్రుడిపై జరిగిన ఈ అనుకోని ఢీకొనడం కేవలం ఆసక్తికరమైన అంతరిక్ష ఘటన మాత్రమే కాదు. భారీ వస్తువులు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొన్నప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అధ్యయనం చేసేందుకు ఇది అరుదైన అవకాశమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై సహజసిద్ధంగా ఉల్కలు తరచూ పడుతుంటాయి. అయితే, వాటి పరిమాణం, బరువు, వేగం వంటి వివరాలు ముందుగా ఖచ్చితంగా తెలియవు. ఈ ఘటనలో మాత్రం ఢీకొన్న వస్తువు బరువు, నిర్మాణం, ప్రయాణించిన మార్గం గురించి శాస్త్రవేత్తలకు దాదాపు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో ఢీకొనడం వల్ల ఎంత పరిమాణంలో బిలం ఏర్పడింది? ఎంత దూరం వరకు దుమ్ము, శిథిలాలు ఎగిరాయి పడ్డాయి? వంటి అంశాలను మరింత కచ్చితంగా అధ్యయనం చేయవచ్చు. చంద్రుడిపై ఇలాంటి ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 2006లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ESA) తన ‘స్మార్ట్‌-1’ వ్యోమనౌకను ఉద్దేశపూర్వకంగా చంద్రుడిపై ఢీకొట్టించింది. ఆ ఢీకొనడం ద్వారా ఏర్పడిన ప్రభావాలను అధ్యయనం చేయడమే అప్పటి ప్రయోగం లక్ష్యం.

Advertisement
Advertisement