Moon Study | చంద్రుడిపై సూక్ష్మజీవుల మనుగడపై కొత్త అధ్యయనం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు
Moon Study | చంద్రుడి దక్షిణ ధ్రువం.. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకంగా మారింది ఈ ప్రాంతం. ఇక్కడ నీరు మంచు రూపంలో ఉండే అవకాశాలున్నాయి. అలాగే, శాశ్వత నీడలో ఉండే గుంతలు, ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
Moon Study | చంద్రుడి దక్షిణ ధ్రువం.. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకంగా మారింది ఈ ప్రాంతం. ఇక్కడ నీరు మంచు రూపంలో ఉండే అవకాశాలున్నాయి. అలాగే, శాశ్వత నీడలో ఉండే గుంతలు, ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ అధ్యయనం మరో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మనుషులతో పాటు చంద్రుడిపైకి చేరే భూమికి చెందిన కొన్ని సూక్ష్మజీవులు.. అక్కడి అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ కొంతకాలం బతికే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ ధ్రువంలోని నీడ ప్రాంతాల్లో కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్‌లు కనీసం వారం రోజుల పాటు మనుగడ సాగించవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. నాసా, యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తల పరిశోధన సైన్స్ అడ్వాన్స్‌లో ఇటీవల ప్రచురితమైంది. చంద్రుడి ఉపరితలంపై సూక్ష్మజీవులు జీవించగల అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు చంద్రుడి ఉష్ణోగ్రత, సూర్యకాంతి, యూవీ కిరణాలు, భౌగోళిక ఆకృతికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు.
ఇంతకాలం ఏం అనుకున్నారు?
చంద్రుడిపై జీవం మనుగడ సాగించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. వాతావరణం లేకపోవడం, తీవ్ర ఉష్ణోగ్రతలు, నీరు అందుబాటులో లేకపోవడం, సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అధిక శక్తి కణాలు.. ఇవన్నీ అక్కడి పరిస్థితులను అత్యంత కఠినంగా మారుస్తాయని భావించారు. ముఖ్యంగా చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతాల్లో సూర్యకాంతి నేరుగా పడడంతో సూక్ష్మజీవులకు పరిస్థితులు మరింత ప్రతికూలంగా ఉంటాయి. అయితే, ధ్రువ ప్రాంతాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. అక్కడ సూర్యుడు హోరిజన్‌కు కొద్ది డిగ్రీల ఎత్తులోనే కనిపిస్తాడు. ఫలితంగా కొండలు, గుంతలు, రాళ్ల నీడల్లో సూర్యకాంతి, యూవీ కిరణాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఈ అంశాన్ని తాజా అధ్యయనం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది.
చంద్రుడి దక్షిణ ధ్రువమే ఎందుకు ప్రత్యేకం?
చంద్రుడి దక్షిణ ధ్రువంలో కొన్ని ప్రాంతాలకు సూర్యకాంతి దాదాపు చేరదు. వీటినే శాశ్వత నీడ ప్రాంతాలు (Permanently Shadowed Regions)గా పిలుస్తారు. ఇలాంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో నీటి మంచు నిల్వ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ప్రధాన కేంద్రంగా మారింది. భవిష్యత్తులో మానవ మిషన్లకు ఈ ప్రాంతాన్ని వినియోగించాలన్న ప్రణాళికలు ఉన్న నేపథ్యంలో.. అక్కడ భూమి నుంచి వెళ్లే జీవ పదార్థాలు ఎలా ప్రవర్తిస్తాయన్న ప్రశ్న కూడా కీలకంగా మారింది.
ఐదు సూక్ష్మజీవులపై అధ్యయనం
పరిశోధకులు మూడు రకాల బ్యాక్టీరియా, రెండు రకాల ఫంగస్‌లకు సంబంధించిన గత పరిశోధనల్లో లభించిన మనుగడ సమాచారాన్ని పరిశీలించారు. వీటిలో అంతరిక్ష యాత్రలకు సంబంధించి సాధారణంగా కనిపించే, తీవ్రమైన పరిస్థితులను కొంతవరకు తట్టుకోగల సూక్ష్మజీవులు ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఉష్ణోగ్రతలు, యూవీ కిరణాల తీవ్రతకు సంబంధించిన మ్యాప్‌లతో ఈ సమాచారాన్ని పోల్చారు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో ఈ సూక్ష్మజీవులు కొంతకాలం మనుగడ సాగించేందుకు అనుకూల పరిస్థితులు ఉండొచ్చని తేలింది. అయితే, ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనుగడ అంటే అక్కడ అవి పెరుగుతాయని.. పునరుత్పత్తి చేస్తాయని కాదు. ప్రస్తుతం చంద్రుడిపై సూక్ష్మజీవులు పెరిగేందుకు అవసరమైన ద్రవరూప నీరు, అనుకూలమైన వాతావరణం వంటి పరిస్థితులకు ఆధారాలు లేవు. అంటే అవి కేవలం నిద్రాణ స్థితిలో కొంతకాలం బతికి ఉండే అవకాశం మాత్రమే ఉంది.
‘క్రిప్టోబయోసిస్’లోకి వెళ్లే అవకాశం
చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని జీవులు తమ జీవక్రియలను దాదాపు నిలిపివేసి నిద్రాణ స్థితిలోకి వెళ్లగలవు. దీనినే క్రిప్టోబయోసిస్ అంటారు. అనుకూల పరిస్థితులు తిరిగి వచ్చినప్పుడు జీవక్రియలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడిపై సూక్ష్మజీవుల మనుగడకు సంబంధించి పరిశోధకులు ప్రస్తావిస్తున్నది ఇదే పరిస్థితి. అక్కడ అవి చురుకుగా తిరగడం, పెరగడం కాదని.. అనుకూల పరిస్థితులు లభించే వరకు నిద్రాణ స్థితిలో ఉండే అవకాశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపారు.
చంద్రయాన్ డేటాతో..
ఈ పరిశోధనలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన చంద్రయాన్-1 మిషన్ డేటా కూడా ఉపయోగపడింది. చంద్రయాన్-1లోని రేడియేషన్ డోస్ మానిటర్ (RADOM) డివైజ్ చంద్రుడి చుట్టూ ఉన్న రేడియేషన్ వాతావరణాన్ని కొలిచింది. చంద్రుడి వద్ద అధిక శక్తి కణాల ప్రభావాన్ని అంచనా వేయడానికి రాడామ్ నుంచి దొరికిన సమాచారాన్ని నాసాకు చెందిన లూనార్ RADOM నుంచి లభించిన సమాచారాన్ని NASAకు చెందిన లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (Lunar Reconnaissance Orbiter)లోని క్రేటర్ డివైజ్ డేటాతో కలిపి పరిశోధకులు పరిశీలించారు. 2008 అక్టోబర్ 22న ప్రయోగించిన చంద్రయాన్-1.. భారత తొలి చంద్ర మిషన్. 100 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ పలు కీలక పరిశోధనలు చేపట్టింది. ఇందులో రాడామ్ కూడా ఒకటి. ప్రయోగం అనంతరం తొలినాళ్లలోనే ఈ పరికరాన్ని ఆన్ చేసి చంద్రుడి అంతరిక్ష రేడియేషన్ వాతావరణంపై సమాచారాన్ని సేకరించారు.
భవిష్యత్తు మిషన్లకు కొత్త సవాల్
చంద్రుడిపై మానవ కార్యకలాపాలు పెరిగే కొద్దీ ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. వ్యోమగాములతో పాటు భూమికి చెందిన సూక్ష్మజీవులు కూడా చంద్రుడిపైకి వెళ్లడం పూర్తిగా నివారించడం చాలా కష్టం. స్పేస్‌సూట్లు, పరికరాలు, నివాస మాడ్యూళ్ల ద్వారా సూక్ష్మజీవులు అక్కడికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో చంద్రుడిపై ఏదైనా జీవ సంబంధ ఆనవాళ్లు కనిపిస్తే.. అవి నిజంగా చంద్రుడికి చెందినవా? లేక భూమి నుంచి మనుషులతో పాటు వెళ్లినవా? అన్నది తేల్చడం కష్టమయ్యే ప్రమాదం ఉంది. అందుకే అంతరిక్ష పరిశోధనలో ‘ఫార్వర్డ్ కాంటామినేషన్’ అంటే భూమి నుంచి ఇతర గ్రహాలు, ఉపగ్రహాలకు సూక్ష్మజీవులు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం కీలకంగా మారుతోంది.
చంద్రుడు.. భూమి గతానికి ‘సహజ ప్రయోగశాల’?
చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూక్ష్మజీవుల మనుగడను అర్థం చేసుకోవడం ద్వారా కేవలం భవిష్యత్తు మిషన్లకే కాకుండా భూమి గురించి అధ్యయనం చేసేందుకు కూడా ఉపయోగం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో భారీ గ్రహశకలాలు, అంతరిక్ష వస్తువులు భూమిని ఢీకొన్నప్పుడు భూమికి చెందిన పదార్థాలు అంతరిక్షంలోకి ఎగిరి చంద్రుడిపై పడిపోయి ఉండే అవకాశం ఉంది. అలాంటి పదార్థాలు చంద్రుడి చల్లని, నీడ ప్రాంతాల్లో చాలా కాలం పాటు భద్రపడి ఉండొచ్చన్న ఆలోచనపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువం భవిష్యత్తులో కేవలం నీటి కోసం అన్వేషించే ప్రదేశంగా కాకుండా.. జీవం, భూమి చరిత్ర, అంతరిక్షంలో జీవుల మనుగడకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు వెతికే సహజ ప్రయోగశాలగా మారే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !
- ●Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!
- ●KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్
- ●Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య
- ●CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్

S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !

Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!

KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్

Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య






