త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

Minister Komatireddy | రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్‌ పథకం కింద చేపట్టిన వంతెనలు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ROB) పనులను వేగవంతం చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని మరింత మెరుగుపరచాలని సూచించారు.

P

Telangana | Published On Aug 22, 2026, 7.30 pm IST

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
Advertisement

Minister Komatireddy | రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్‌ పథకం కింద చేపట్టిన వంతెనలు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ROB) పనులను వేగవంతం చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని మరింత మెరుగుపరచాలని సూచించారు. సచివాలయంలో శనివారం ఆర్‌అండ్‌బీ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు రూ.5,159 కోట్లతో 316 పనులకు సంబంధించి 3,918 కి.మీ. రోడ్లకు మంజూరు ఇచ్చామని, పలు పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా.. అధిక శాతం పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. 2025-26లో రూ.868 కోట్లతో చేపట్టిన 422.36 కిమీ రోడ్ల పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు.

హై లెవెల్‌ బ్రిడ్జిలు, ఆర్‌వోబీల నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సేతుబంధన్‌ పథకం కింద రూ.76 కోట్లతో చేపడుతున్న నార్కట్‌పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పనులు మరింత వేగంగా సాగాలని సూచించారు. మిర్యాలగూడ, నందిపహాడ్‌ బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని, అవసరమైన సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌, మెదక్‌, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుగ్గా పనిచేసి నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్క‌ర్‌ రాష్ట్ర సచివాలయంలో నిర్మిస్తున్న షెడ్‌డ్‌ పార్కింగ్‌ (సోలార్‌ కార్‌ పార్కింగ్‌) పనులపైనా మంత్రి సమీక్షించారు. సచివాలయ భవనం ఉత్తరం, పడమర, దక్షిణ వైపుల్లో భవన నిర్మాణానికి, ఎలివేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఉత్తర భాగంలో రెండు వరుసలు, దక్షిణంలో మూడు, పడమర వైపు ఒక వరుసలో సోలార్‌ ప్యానెళ్లతో కూడిన పార్కింగ్‌ ఏర్పాటు చేసే డిజైన్లను అధికారులు మంత్రికి వివరించారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను డిసెంబర్‌ 2026 నాటికి పూర్తి చేయాలని కోమటిరెడ్డి ఆదేశించారు. సోలార్‌ పార్కింగ్‌ అందుబాటులోకి వస్తే సచివాలయ అవసరాలకు సుమారు 90 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, నెలవారీ విద్యుత్‌ బిల్లులో దాదాపు 16 శాతం ఆదా అవుతుందని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement