త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డీసీ రెడ్డి కన్నుమూత

OU | ఉస్మానియా యూనివ‌ర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెస‌ర్ డీసీ రెడ్డి (86) వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు

A

News | Published On Dec 6, 2025, 7.02 am IST

OU | ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డీసీ రెడ్డి కన్నుమూత
Advertisement

OU | ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) మాజీ వైస్ చాన్స్లర్ (Vice Chancellor) ప్రొఫెసర్ డీసీ రెడ్డి (86) షేక్ పేట్‌లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని వైకుంఠ మహాప్రస్థానంలో మ‌ధ్యాహ్నం జ‌రుగ‌నున్నాయి. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల (OU Engineering College) లోని ఈసీఈ (ECE) విభాగంలో ప్రొఫెసర్ అయిన ఆయన 1999-2002 కాలంలో వర్సిటీకి వైస్ చాన్స్లర్గా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయన గొప్ప అధ్యాపకుడిగా, గౌరవనీయమైన విద్యావేత్తగా పేరుపొందారు.

బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్ విభాగం ప్రారంభించింది ఆయ‌నే...

ఈసీఈ ప్రొఫెసర్ గా ఆయన 1982లో దేశంలోనే తొలిసారిగా ఓయూలో బయోమెడికల్ ఇంజినీరింగ్ (Biomedical Engineering) విభాగాన్ని నెలకొల్పి, బీఈ కోర్సును ప్రారంభించారు. ప్ర‌స్తుత కాలంలో ఈ విభాగానికి ఎన‌లేని ప్రాముఖ్య‌త ఉంది. దానితో పాటు ఆయన ఆధ్వర్యంలోనే కేంద్రప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ శాఖ ఆధ్వర్యంలో దేశ పౌరవిమానయానం, ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చేందుకు నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ పై పరిశోధనలు చేసేందుకు ఓయూలో రీసర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్ ఫర్ నావిగేషనల్ ఎలక్ట్రానిక్స్ (NERTU) ను 1982లో నెలకొల్పారు. ఈ సంస్థ ఇప్ప‌టికీ ప‌నిచేస్తుండ‌డ‌మే కాకుండా దేశ నావిగేష‌న్ అవ‌స‌రాలను తీర్చేందుకు జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తోంది.

సంస్క‌ర‌ణ‌ల రూప‌శిల్పి...

వర్సిటీ వీసీగా పనిచేసిన కాలంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఓయూ అభివృద్ధికి బాటలు వేశారు. బోధన, పరిశోధన, మౌళిక వసతుల నాణ్యతను మెరుగుపరిచేందుకు విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే పీజీ కోర్సుల్లో సెమిస్టర్ (Semester) విధానాన్ని ప్రవేశపెట్టారు. వర్సిటీ పరిపాలనను సులభతరం చేసేందుకు, అన్ని పీజీ కోర్సుల‌తో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాల‌ను నిర్వ‌హించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ (Directorate of Admissions)ను ప్రారంభించారు. విదేశీ విద్యార్థుల ప్ర‌వేశాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ (UFRO) ను ప్రారంభించారు. ఆయన మృతి పట్ల పలువురు ఓయూ అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు నివాళి అర్పించారు

Advertisement

తాజావార్తలు

Advertisement