త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | మెటాకు మరో చిక్కు.. ‘మ్యూస్‌ ఇమేజ్‌’పై కేంద్రం నజర్‌..!

Meta | సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు భారత్‌లో వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేయగా.. తాజాగా సంస్థ రూపొందించిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇమేజ్‌ జనరేటర్‌ ‘మ్యూస్‌ ఇమేజ్‌’ను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత చట్టాల పరిధిలో ఈ ఫీచర్‌ను సమగ్రంగా పరిశీలిస్తామని కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు.

P

News | Published On Jul 10, 2026, 9.22 am IST

Meta | మెటాకు మరో చిక్కు.. ‘మ్యూస్‌ ఇమేజ్‌’పై కేంద్రం నజర్‌..!
Advertisement

Meta | సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు భారత్‌లో వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనల వ్యవహారంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేయగా.. తాజాగా సంస్థ రూపొందించిన కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇమేజ్‌ జనరేటర్‌ ‘మ్యూస్‌ ఇమేజ్‌’ను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత చట్టాల పరిధిలో ఈ ఫీచర్‌ను సమగ్రంగా పరిశీలిస్తామని కేంద్ర సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ కార్యదర్శి ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. సీఐఐ జీసీసీ బిజినెస్‌ సమ్మిట్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మ్యూస్‌ ఇమేజ్‌పై మంత్రిత్వ శాఖకు అందిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించి ఈ ఫీచర్‌ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అంశంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌ల రికమెండేషన్‌ అల్గారిథమ్స్‌ పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఉందని, అందులో వచ్చే కొన్ని ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ ఉండడంపై వివరణ కోరుతూ కేంద్రం జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశంపై మెటా ఇచ్చిన స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

నిపుణుల ఆందోళన

మ్యూస్‌ ఇమేజ్‌ ఫీచర్‌పై సాంకేతిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫీచర్‌ ద్వారా వ్యక్తుల అనుమతి లేకుండానే వారి ఫొటోలను ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇది పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ సాయంతో నకిలీ చిత్రాల సృష్టించడం, తప్పుడు ప్రచారం, ఐడెంటిటీ థెఫ్ట్‌, ఆన్‌లైన్‌ వేధింపుల ఘటనలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే డీప్‌ఫేక్‌ ఇమేజ్‌ విస్తరిస్తూ వెళ్తే.. ఒరిజినల్‌ ఫొటో, ఫేక్‌ ఫొటోలను గుర్తించడం మరింత కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కేంద్రం నోటీసులపై స్పందించిన మెటా..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో బాలలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌, ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు మెటా స్పందించింది. అలాంటి కంటెంట్‌ను అరికట్టేందుకు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. అధునాతన ఏఐ టూల్స్‌తో అనుమానాస్పద ఖాతాలను గుర్తించి తొలగిస్తున్నామని, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తప్పుడు లింకులను బ్లాక్‌ చేయడంతో పాటు, 98 శాతం మంది వినియోగదారులు మాట్లాడే భాషలను కవర్‌ చేసేలా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసినట్లు పేర్కొంది. భారత్‌లోనే గత ఆరు నెలల్లో లక్షా 60 వేలకుపైగా అనుమానాస్పద ఖాతాలను తమ ఏఐ టూల్స్‌ తొలగించినట్లు మెటా వివరించింది.

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై స్పందన..

వాట్సాప్‌ ప్రతిపాదించిన ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌పై సైతం ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మెటా స్పందించింది. ప్రస్తుతం మెటా సమాధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫోన్‌ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో కమ్యూనికేషన్‌కు వీలు కల్పించే ఈ ఫీచర్‌పై కేంద్రం భద్రతా ఆందోళనలు వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌ మోసాలు, ఫిషింగ్‌, నకిలీ గుర్తింపుల దుర్వినియోగం పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. చర్చలు పూర్తయ్యే వరకు భారత్‌లో ఈ ఫీచర్‌ను ప్రారంభించబోమని వాట్సాప్‌ హామీ ఇచ్చింది. యూజర్ల భద్రత కోసం రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రముఖులు, సంస్థల పేర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఇదే తరహా ఫీచర్లను అందిస్తున్న టెలిగ్రామ్‌, సిగ్నల్‌ సంస్థల నుంచి కూడా కేంద్రం భద్రతా చర్యలపై వివరణ కోరిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement