త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

“ఎవరొచ్చినా ఆపేదే లేదు!” – వరంగల్‌లో కొండా ఫ్యామిలీ ‘డబుల్ గేమ్’ వెనుక అసలు స్కెచ్ ఇదే!

పరకాల పోరు కేవలం ఒక్క సీటు గొడవ కాదు; కొండా వర్గానికి, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య నడుస్తున్న పొలిటికల్ మైండ్ గేమ్! సుస్మిత హెచ్చరిక వెనుక రాజకీయ సందేశం, సురేఖ లేఖ వెనుక పదవిని కాపాడుకునే తెలివైన వ్యూహం ఉన్నాయి. అయితే కొండా ఫ్యామిలీ వ్యూహాలకు ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ద్వారా షోకాజ్ నోటీసు ఇప్పించి కొండా వర్గానికి పక్కాగా చెక్ పెట్టే ప్రయత్నం. ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయం.

S

News | Published On Aug 21, 2026, 10.19 pm IST

“ఎవరొచ్చినా ఆపేదే లేదు!” – వరంగల్‌లో కొండా ఫ్యామిలీ ‘డబుల్ గేమ్’ వెనుక అసలు స్కెచ్ ఇదే!

సంక్షిప్త సారాంశం

వరంగల్‌లో ఆధిపత్యం కోసం కొండా వర్గం సుస్మిత ద్వారా పరకాల సీటుపై సవాల్ విసిరింది. రేవంత్ రెడ్డి నాయకత్వం పీసీసీ షోకాజ్ నోటీసు ద్వారా చెక్ పెడుతూ క్రమశిక్షణే ముఖ్యం అని స్పష్టం చేసింది. సురేఖ వివరణతో వివాదం తాత్కాలికంగా తగ్గిందా లేక క్రమశిక్షణ కమిటీ తీసుకోబోయే నిర్ణయంతో మరింత రాజుకుంటుందా అనేది చూడాలి!

Advertisement

అధికారం వర్సెస్ ఆధిపత్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కొండా’ కుటుంబ రాజకీయ వ్యూహం!

 

తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై పాత కాంగ్రెస్ మార్క్ ఆధిపత్య పోరు మళ్లీ తీవ్రస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిస్పందనగా పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసు, అటుపై సురేఖ లేఖ ద్వారా నడిపిన దౌత్యం... ఇవన్నీ కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఆవేశపూరిత నిర్ణయాలు కావు. ముఖ్యంగా వరంగల్ జిల్లా రాజకీయంలో కొండా కుటుంబానికి, సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్‌కి మధ్య ఉన్న పాత ఆధిపత్య పోరు నేపథ్యం ఈ తాజా పరిణామాలతో మరోసారి బహిర్గతమైంది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలబెట్టుకోవడానికి కొండా కుటుంబం అత్యంత పక్కాగా అమలు చేస్తున్న సుదీర్ఘ రాజకీయ వ్యూహంలో భాగమే ఈ పరిణామాలు.

 కుటుంబ వారసత్వం + బీసీ కార్డు వ్యూహం

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయంలో కొండా దంపతులకు ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా మద్దతు ప్రకటించడం కొండా క్యాంపునకు మింగుడు పడలేదు.

దీంతో కొండా సుస్మితా పటేల్ నేరుగా రంగంలోకి దిగి “ఎవరొచ్చినా పరకాల ఎమ్మెల్యేని నేనే” అని, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలు అత్యంత వ్యూహాత్మకమైనవి. కొండా దంపతుల రాజకీయ వారసురాలిగా సుస్మితను బలంగా ప్రొజెక్ట్ చేయడంతో పాటు, పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత దక్కడం లేదనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇది తమ సాంప్రదాయ సామాజిక బేస్‌ను కాపాడుకోవడానికి మరియు జిల్లా స్థాయిలో పవర్ బ్యాలెన్స్‌ను తమవైపు తిప్పుకోవడానికి వేసిన పాచిక.

 క్లాసిక్ ‘డబుల్ గేమ్’ & డ్యామేజ్ కంట్రోల్

సుస్మిత ద్వారా తీవ్రమైన రాజకీయ సందేశాన్ని క్యాడర్‌లోకి పంపించి, పీసీసీ నోటీసు రాగానే మంత్రి కొండా సురేఖ “ఆమె మేజర్, వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం.. మరొకరి అభిప్రాయాలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం” అని స్పష్టం చేయడం అత్యంత పరిణతి చెందిన రాజకీయ మూవ్. ఇక్కడ ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టేలా వ్యూహం ఉంది. సుస్మిత ద్వారా “పరకాలపై హక్కు కొండా కుటుంబానిదే” అనే సందేశం లోతుగా ప్రజల్లోకి, క్యాడర్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వంలో ఉన్న వేళ నేరుగా నాయకత్వంతో ఘర్షణ పడితే మంత్రి పదవికి ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో దౌత్యపరంగా డిఫెన్స్‌లోకి వెళ్లి తన 'మంత్రి పీఠాన్ని' కాపాడుకునే ప్రయత్నం చేశారు కొండా సురేఖ.

సీఎం సైలెంట్ టాక్టిక్స్ vs వ్యతిరేక వర్గం స్పందన

ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఏ విమర్శ చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటించారు. పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, క్రమశిక్షణా కమిటీల ద్వారానే చెక్ పెట్టారు. కొండా వర్గం మాస్ ఫాలోయింగ్‌ను పూర్తిగా దూరం చేసుకోకుండానే, "పార్టీ క్రమశిక్షణ దాటితే ఊరుకునేది లేదు" అనే సంకేతాన్ని పంపారు. మరోవైపు, పరకాలలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు రేవురి ప్రకాష్ రెడ్డి వర్గం సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యురాలు కాదని, సీటు కేటాయింపు అధిష్ఠానం చేతిలోనే ఉంటుందని స్పష్టం చేస్తూ కొండా వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే సీఎం ఇంతటితోనే ఆగుతారా.. లేకా కొండా ఫ్యామిలీకి చెక్ పెట్టే మరిన్ని అస్త్రాలు బయటకు తీస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే..

 భవిష్యత్ మలుపులు – కాంగ్రెస్‌కు రిస్క్ ఎంత?

ప్రస్తుతానికి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో ఈ వివాదం తాత్కాలికంగా సర్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సమయానికి ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. ఒకవేళ సుస్మిత నిజంగానే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలిపోవడం ఖాయం. అదే సమయంలో పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరించి వెళ్తే కొండా కుటుంబానికి కూడా పెద్ద రాజకీయ రిస్క్ ఉంటుంది. గతంలోనూ రేవంత్ రెడ్డి నాయకత్వంతో కొండా దంపతులకు ఉన్న విభేదాలు, స్థానిక కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు చూస్తుంటే వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది!

 

Advertisement
Advertisement