త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rayadurg | రాయదుర్గం భూమికి భారీ ధర.. రికార్డు స్థాయిలో ఎకరా రూ.264 కోట్లు

Rayadurg | హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో భూమి ధర మరోసారి ఆకాశాన్నంటింది. రాయదుర్గంలోని భూమి ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో 5.25 ఎకరాల స్థలం మొత్తం రూ.1,386 కోట్లకు అమ్ముడైంది.

P

Hyderabad | Published On Aug 21, 2026, 9.10 pm IST

Rayadurg | రాయదుర్గం భూమికి భారీ ధర.. రికార్డు స్థాయిలో ఎకరా రూ.264 కోట్లు
Advertisement

Rayadurg | హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో భూమి ధర మరోసారి ఆకాశాన్నంటింది. రాయదుర్గంలోని భూమి ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో 5.25 ఎకరాల స్థలం మొత్తం రూ.1,386 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు హైదరాబాద్‌లో నమోదైన అత్యధిక ధర ప‌లికిన భూమిగా ఇది నిలిచింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నంబర్‌ 83/1లో ఉన్న ప్లాట్‌ నంబర్‌ P1కు శుక్రవారం వేలం నిర్వహించారు. ఎకరాకు రూ.175 కోట్ల ప్రాథమిక ధరను టీజీఐఐసీ నిర్ణయించింది. అయితే బిడ్డర్ల మధ్య నెలకొన్న పోటీతో ధర ఏకంగా 50.9 శాతం పెరిగి రూ.264 కోట్లకు చేరింది. ఇదే ప్రాంతంలో గత మేలో జరిగిన వేలంలో ఎకరా రూ.237 కోట్లకు విక్రయమైంది. తాజా వేలంతో ఆ రికార్డు కూడా చెరిగిపోయింది.

ఐటీ, నాలెడ్జ్‌ సిటీ గ్రోత్‌ కారిడార్‌లో కీలక ప్రాంతంలో ఈ స్థలం ఉండటమే భారీ ధరకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఐటీసీ కోహినూర్‌ హోటల్‌కు ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌.. దుర్గం చెరువు, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చేరువలో ఉంది. మల్టీ-యూజ్‌ జోన్‌గా గుర్తించిన ఈ స్థలం కోసం ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో పాల్గొనేందుకు ఒక్కో బిడ్డర్‌ రూ.10 కోట్ల డిపాజిట్‌ చెల్లించాల్సి వచ్చింది. కాగా, ఈ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. స్థల పరిసరాల్లో చారిత్రక రాతి నిర్మాణాలు ఉన్నాయని, దుర్గం చెరువుకు సమీపంలో భూములు ఉన్నందున పరిరక్షణ అంశాలు ఉన్నాయని, యాజమాన్య హక్కులపై వివాదాలు ఉన్నాయని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వేలాన్ని నిలిపివేయాలన్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఈ ప్లాట్లు ప్రొటెక్టెడ్ హెరిటేజ్ ప్రాంతం, బఫర్‌ జోన్‌ పరిధిలోకి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాయదుర్గం పరిసరాల్లో గత కొన్నేళ్లుగా భూముల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. 2025లో ఇక్కడ ఎకరా ధర రూ.177 కోట్ల వరకు ఉండగా.. తాజాగా అది మరింత పెరిగి రూ.264 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో అదే సర్వే నంబర్‌లోని మరో 5.38 ఎకరాల స్థలానికి కూడా టీజీఐఐసీ వేలం సిద్ధం చేసింది. ఈ ప్లాట్‌కు ఆగస్టు 28న ఈ-వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement