త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress | అసమ్మతి జ్వాల

Telangana Congress | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అసమ్మతి కుంపట్లు అంటుకుంటున్నాయి. పాత తరం..కొత్త తరం నేతల మధ్య అంతరం బాగా పెరిగి విభేదాలు రచ్చకెక్కాయి. గత కొన్ని రోజులుగా గాంధీభవన్ ఆందోళనలకు వేదికగా మారింది.

A

Telangana | Published On Aug 21, 2026, 6.43 pm IST

Telangana Congress | అసమ్మతి జ్వాల
Advertisement

కాంగ్రెస్ పార్టీలో భగభగలు
రచ్చకెక్కిన విభేదాలు
పాత నేతలు వర్సెస్ కొత్త నేతలు
ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు
కుంపటి రగిలించిన అసంతృప్తి
ముఖ్యమంత్రికి మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేల ప్రెస్ మీట్
కొండా సురేఖ బర్తరఫ్ కు డిమాండ్
రాజగోపాల్, చిన్నారెడ్డిలను బహిష్కరించాలంటూ వినతి
చిన్నారెడ్డిపై ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
గాంధీ భవన్ వద్ద చిన్నారెడ్డి వర్గీయుల ఆందోళన
కొండా వివాదంలో మంత్రుల మౌనం
నోటీసులపైన నోటీసులిస్తున్న అధిష్టానం

త్రినేత్ర.న్యూస్ :

నాకే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే..మంత్రినై ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు చూడండి.. ఎంత వెనకబాటులో ఉన్నామో..
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ముఖ్యమైన పదవులు దక్కుతున్నాయి. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

పరకాలలో నేనే పోటీ చేస్తా. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా సరే ఇండిపెండెంట్ గా నేనే గెలుస్తా. ఆయన తన సొంత తమ్ముడికి వేల కోట్ల భూమి రాసిచ్చిండు
మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అసమ్మతి కుంపట్లు అంటుకుంటున్నాయి. పాత తరం..కొత్త తరం నేతల మధ్య అంతరం బాగా పెరిగి విభేదాలు రచ్చకెక్కాయి. గత కొన్ని రోజులుగా గాంధీభవన్ ఆందోళనలకు వేదికగా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలతో పార్టీలో తీవ్ర కలకలం రేగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నోటీసుల పర్వానికి తెరలేపింది. ఆ నోటీసులు అందుకున్న వారు కూడా వాటికి దీటుగా సమాధానం ఇస్తుండడంతో ఏం చేయాలో తెలియక.. అధిష్టానం తల పట్టుకున్నది.

18 మంది ఎమ్మెల్యేలు..ఇద్దరు ఎమ్మెల్సీలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ లా తయారైందని.. పరకాలలో ప్రకాశ్ రెడ్డి కచ్చితంగా ఓడిపోతాడంటూ .. మంత్రి సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మద్దతుగా 18 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం విలేకరుల సమావేశం పెట్టి ..ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఐలయ్య, మధుసూదన్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, మాధవ రెడ్డి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, వీరేశం, మనోహర్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలు నాయక్, శంకర్, కుంభం అనిల్, వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, సారయ్యలు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

నీడనిచ్చే చెట్టును నరుక్కుంటామా

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... "సొంత పార్టీలో ఉండి.. నీడ‌నిచ్చే చెట్టును న‌రుకున్న దుర్మార్గ‌మైన సంస్కృతిది మంచిది కాదు. ఎవ‌రికి స‌మ‌స్య‌లుంటే అధిష్టానికి చెప్పాలి. పార్టీకి న‌ష్ట‌ప‌రిచే ప‌ని చేయొద్దు. మా అంద‌రి, ప్ర‌జ‌లు, కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోనే బ‌ల‌ప‌డుతుంది. కొండ సురేఖ నా కూతురు మాట్లాడింది అంటున్న‌రు.. మ‌రి ఎందుకు ఖండించ‌లేదు. కేబినెట్‌లో ఉంట‌రు. ప‌క్క‌కు లేరే. కేబినెట్‌లో జ‌రిగే ప్ర‌తి నిర్ణ‌యాల్లో మీరు కూడా బాధ్యులు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మాట్లాడిన‌ప్పుడు ఎందుకు స్పందించ‌లేదు. ఇందులో ఎవ‌రు అర్హ‌త లేనోళ్లు. అంద‌రూ అర్హ‌త క‌లిగిన వారు ఉన్నారు. కొంద‌రినే ప్ర‌భుత్వంలోకి తీసుకున్నారు. తీసుకున్న‌టివాళ్లు ప్ర‌భుత్వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మీది. రేవంత్‌రెడ్డి ఒక్క‌డు బ‌ల‌హీన‌ప‌డితే మ‌నం అంద‌రం బ‌ల‌ప‌డం. పార్టీ మొత్తం బ‌ల‌హీన‌ప‌డుతుంది" అంటూ వ్యాఖ్యానించారు.

చేతి గుర్తును నరకాలనుకుంటున్నారా?

"సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడిన మాట‌లు పిల్ల కాకి కొండా సుష్మిత‌వి కావ‌ని.. అవి మంత్రి కొండా సురేఖ‌వేన‌ని అనుకుంటున్నాం. త‌న‌ బిడ్డ మాట‌లపై సురేఖ దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కానీ ఎందుకు ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌లేక‌పోతున్నారు. అధిష్టానం స్పందించి కొండా సురేఖ‌, రాజ‌గోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాలి. మేమంతా చేతి గుర్తు మీద గెలిచాం. చేతి గుర్తును న‌ర‌కాల‌నుకుంటున్న వారు పార్టీలో ఉండ‌డానికి వీల్లేదు. కొండా సురేఖ కూతురు..ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకొని మాట్లాడారు. క‌నీసం వ‌య‌సుకు గౌర‌వం ఇవ్వ‌కుండా మా రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి గారిని ఇష్టారీతిన మాట్లాడింది. ద‌మ్ముంటే రావాలి.. ఎవ‌రు ప్ర‌చారం చేస్త‌రో చేయాలి అనే స‌వాల్ విసిరే సంస్కృతి. దీనిపై కొండా సురేఖ దాటేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు. మ‌రి మీ అమ్మాయి వ్యాఖ్య‌ల‌ను ఎందుకు ఖండించ‌లేక‌పోతున్న‌రు? స‌స్పెండ్ చేస్త‌రో ఏం చేస్త‌రో చేయండి. ఎందుకంటే పార్టీ కంటే పెద్ద మేం ఎవ్వ‌రం కాదు" అని డిమాండ్ చేశారు.

చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి

తాను ఇన్నాళ్లుగా కష్టపడినా.. గుర్తింపు లేకుండా పోయిందని తాను మరో జీవన్ రెడ్డి (జగిత్యాల)ను కావాల్సి వస్తుందేమోనంటూ ..వనపర్తికి చెందిన మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మేఘారెడ్డి హుటాహుటిన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. కాగా ఇదే సమయంలో చిన్నారెడ్డి అనచరులు గాంధీ భవన్ ను ముట్టడించారు. పార్టీలో చిన్నారెడ్డికి ఉన్నంత సీనియారిటీ, నిబద్ధత ఇంకెవ్వరికీ లేదని.. చెప్పారు. తెలంగాణ కావాలంటూ..రాష్ట్ర ఏర్పాటు కోసం.. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఎమ్మెల్యే ల ఫోరం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్ తో సోనియాగాంధీకి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

అంతుపట్టని మంత్రుల మౌనం

ముఖ్యమంత్రి ప్రతిష్ఠ దిగజారిపోయేలా కొండా సుష్మిత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినా ఏ ఒక్క మంత్రీ ఈ వ్యవహారంపై నోరు విప్పలేదు. ముఖ్యమంత్రిపై ఏ సందర్భంలో ఎవరు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా ఇప్పటిదాకా ఏ మంత్రి కూడా స్పందించలేదు.ముఖ్యమంత్రి లేనప్పుడు పెద్దరికం చేయాల్సిన డిప్యూటీ సీఎం కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే మంత్రి సురేఖ నోటీసులకు సమాధానం ఇచ్చారు. తనకు తన కూతురు చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Advertisement
Advertisement