త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Rules | ఏప్రిల్ ఒక‌టి నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు..!

New Rules | నేటి 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం ముగియ‌నున్న‌ది. ఏప్రిల్ ఒక‌టి నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌లుకానున్నంది. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త‌గా రూపొందించిన ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 2025 అమ‌లులోకి రానుంది.

P

Business | Published On Mar 31, 2026, 4.29 pm IST

New Rules | ఏప్రిల్ ఒక‌టి నుంచి కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు..!
Advertisement

New Rules | నేటితో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. ఇదే సమయంలో జీఎస్టీ 2.0 కింద ప్రకటించిన కీలక నిర్ణయాలు కూడా అమల్లోకి రానున్నాయి. దీంతో దేశ ఆర్థిక నిర్మాణంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ పరిణామాలు సామాన్య ప్రజల ఆదాయం, పొదుపులు, వంటగ్యాస్ ధరలు, రోజువారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రకటించినప్పటికీ, మరోవైపు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ పరిస్థితులు, అలాగే కొత్త నియంత్రణ నిబంధనలు ఎల్పీజీ, ఔషధాలు, వాహనాల ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి.

మార్చి 31లోగా ఈ పనులు చేయాల్సిందే..

కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వెళ్లే ముందు మార్చి 31 అర్ధరాత్రి వరకు పలు కీలక ఆర్థిక పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు చేయకపోతే పన్ను ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు జరిమానాలు, ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మినహాయింపులు పొందాలంటే సెక్షన్ 80సీ, 80డీ కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, జీవ బీమా పాలసీలలో పెట్టుబడులు పెట్టాలి. ఈ గడువు దాటితే ఆ ప్రయోజనం వర్తించదు. అలాగే పీపీఎఫ్, ఎన్పీఎస్, సుకన్య సమృద్ధి యోజన వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాలలో కనీస డిపాజిట్ చేయకపోతే ఖాతాలు నిలిచిపోవడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఖాతాలను యాక్టివ్‌గా ఉంచేందుకు తప్పనిసరిగా చెల్లింపులు చేయాలి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) సంబంధించిన అప్‌డేటెడ్ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కూడా మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు దాటితే ఆ అవకాశం కోల్పోతారు. విదేశీ ఆదాయం ఉన్నవారికి కూడా ఇదే గడువు కీలకం. ఎన్ఆర్ఐలు ‘ఫారమ్ 67’ సమర్పించాలి. లేకపోతే విదేశీ పన్ను క్రెడిట్ పొందలేక డబుల్ టాక్సేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

రేపటి నుంచి అమల్లోకి కొత్త ఆదాయపు పన్ను చట్టం

  • కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రావడంతో పన్ను వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ‘అసెస్‌మెంట్ ఇయర్’, ‘ప్రీవియస్ ఇయర్’ వంటి పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ఉపయోగించనున్నారు. ఇది 2026-27 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త పన్ను విధానం ప్రకారం రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులకు పన్ను భారం లేకుండా జీరో పన్ను విధానం అమలు కానుంది. వేతన జీవులకు ప్రస్తుతం ఉన్న రూ.75వేల‌ స్టాండర్డ్ డిడక్షన్ కొనసాగుతుంది.
  • పాత పన్ను విధానంలో కూడా కొన్ని కీలక సడలింపులు ప్రకటించారు. పిల్లల ఎడ్యుకేష‌న్ అల‌వెన్స్ నెలకు రూ.100 నుంచి రూ.3వేల‌కు పెంచగా, హాస్టల్ అల‌వెన్స్‌ని రూ.300 నుంచి రూ.9వేల‌కు పెంచారు. అలాగే పుణే, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలను టైర్‌-1 నగరాల జాబితాలో చేర్చడంతో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) లెక్కల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
  • పెట్టుబడులపై పన్ను విధానంలో కూడా మార్పులు వచ్చాయి. సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లపై మెచ్యూరిటీ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించనున్నారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) పెరిగింది. కంపెనీలు షేర్ బైబ్యాక్ చేసినప్పుడు వాటాదారులపై పన్ను భారం పడే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
  • విదేశీ పర్యటనల విషయంలో కూడా ఉపశమనం కల్పించారు. ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును 5 శాతం, 20 శాతం నుంచి ఏకీకృతంగా 2 శాతానికి తగ్గించారు.

జీఎస్టీ 2.0లో మార్పులు

  • కొత్త జీఎస్టీ విధానంలో పన్ను శ్లాబ్‌లను 5 శాతం, 18 శాతం, 40 శాతం గా కుదించారు. కొన్ని కీలక వస్తువులపై పన్ను తగ్గింపులు, మరికొన్నింటిపై పెంపులు చేశారు.
  • ఆరోగ్య బీమా, జీవ బీమా, 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై, ప్యాక్ చేయని పాల ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. చిన్న కార్లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.
  • ఇక లగ్జరీ వాహనాలు, పెద్ద ఎస్యూవీలు, ఆన్‌లైన్ గేమింగ్ సేవలపై అత్యధికంగా 40 శాతం పన్ను విధించనున్నారు.

ద్రవ్యోల్బణం ప్రభావం.. పెరుగుతున్న భారం..

  • పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడుతోంది. ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగి రూ.1,883కు చేరుకుంది. దీంతో హోటళ్లలో భోజనం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
  • ఔషధాల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. కంపెనీల ఖర్చులు పెరగడంతో 900కు పైగా అవసరమైన మందుల ధరలను 1.74 శాతం వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో పారాసిటమాల్ సహా పలు యాంటీబయాటిక్స్ ఉన్నాయి.
  • వాహన రంగంలో కూడా ధరలు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్, హోండా, మెర్సిడెస్ వంటి కంపెనీలు కార్ల ధరలను రూ.25,000 నుంచి రూ.65,000 వరకు పెంచాయి. బీఎస్-7 ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధమవడం, ముడి పదార్థాల ఖర్చుల పెరుగుదల ఇందుకు కారణంగా చెబుతున్నారు.

బ్యాంకింగ్, పెన్షన్, బీమా రంగాల్లో కొత్త నిబంధనలు

  • బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ ఆధారిత కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణలను ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో భాగంగా పరిగణించనుంది. ఐదు ఉచిత లావాదేవీలు దాటితే ప్రతి లావాదేవీకి రూ.23 ఛార్జ్ వసూలు చేయనుంది.
  • ఇకపై బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్‌పై జరిమానాలను ఇష్టానుసారంగా విధించలేవు. ఖాతాలో ఉన్న లోటు మేరకు మాత్రమే జరిమానా విధించాలి.
  • పాన్ కార్డు కోసం ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధృవీకరణకు 10వ తరగతి సర్టిఫికేట్ లేదా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి చేశారు.
  • డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పెంచుతూ ఓటీపీతో పాటు బయోమెట్రిక్ ఆధారిత డైనమిక్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ)ను తప్పనిసరి చేశారు.
  • నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో ఉపసంహరణ నిబంధనలను సడలించారు. పదవీ విరమణ సమయంలో 80 శాతం వరకు మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు. మొత్తం కార్పస్ రూ.8 లక్షలలోపు ఉంటే 100 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది.
  • ఆరోగ్య బీమా రంగంలో మొరటోరియం కాలాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించారు. ఐదు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధుల పేరుతో క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉండదు.

రవాణా రంగంలో మార్పులు

  • జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కు పెరిగింది.
  • రైల్వే ప్రయాణాల్లో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రైలు బయలుదేరే సమయానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. ఇది ఇంతకు ముందు 4 గంటలుగా ఉండేది.

ఈ మార్పులతో ఒకవైపు మధ్యతరగతికి పన్ను ఉపశమనం లభిస్తున్నా, మరోవైపు గ్యాస్, ఔషధాలు, వాహనాల ధరల పెరుగుదల కుటుంబ ఖర్చులను పెంచే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక మరింత కీలకంగా మారనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement