Harish Rao | త్రినేత్ర.న్యూస్ : మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం ఒప్పుకోదు అని ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై హరీశ్‌రావు మాట్లాడారు. మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు అవుతుంది..? అని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు. లక్షా కోట్లు, లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడుతామని సీఎం వేర్వేరు సందర్భాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది. మరి పిల్లలకు స్కాలర్షిప్లు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు బెనిఫిట్స్ ఇవ్వమని డబ్బుల్లేవు.. నన్ను డబ్బుల్లేవు కోసుకు తింటారా అని సీఎం అంటున్నారు. మరి మూసీకి ఎక్కడ్నుంచి నిధులు తీసుకొస్తారు. సీఎం సూటిగా సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ పేరిట ఎన్ని నివాసాలు కూల్చేశారు. ఆ నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించారా..? లేదా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లలోకి పంపించారా..? 2013 చట్టం ప్రకారం రూ. 14.50 లక్షల డబ్బులు ఇవ్వాలి. 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి.. వీటన్నింటిపై సమాధానం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జలమండలి రెండున్నర టీఎంసీలు మూసీలోకి విడుదల చేయడానికి రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలోకి వదలాలని నిర్ణయించడం సంతోషం. మరి ఈ నీళ్లను కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా.. లేదా గాల్లో నుంచి వస్తున్నాయ సమాధానం చెప్పాలి. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల నుంచి మూసీ నది ప్రారంభం అవుతుంది. మూసీలోకి మురికిని అరికట్టేందుకు 32 ఎస్టీపీలు కట్టాం. వీటిని మెయింటెన్ చేయలేక వికారాబాద్ మురుగు నీరు గండిపేట్‌లో వచ్చిందా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీలోకి మురికి నీరు రానివ్వకుండా మరో 39 ఎస్టీపీలు కట్టేందుకు అమృత్ పథకం కింద ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరు అయ్యాయా..? లేదా..? చెప్పాలి. వరదలు వచ్చినప్పుడడు మూసీగేట్లు ఒకేసారి ఉద్దేశపూర్వకంగా తెరిచి ప్రజల ఇండ్లు, రోడ్లు మునిగిపోవాలని ముంపునకు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా...? అధికాఆరులపై చర్యలు తీసుకున్నారా..? మూసీ సుందరీకరణ పేరిట మూసీ ఇండ్లను కూలగొడితే బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని అడ్డుకుని తీరుతాం. గోదావరి నీళ్లు తేండి సంతోషం. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చితే బీఆర్ఎస్ ఎంత మాత్రం ఒప్పుకోదు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.