త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth: స‌మిష్టిగా ప‌నిచేస్తేనే రైజింగ్ ల‌క్ష్యాలు చేరుకుంటాం : సీఎం రేవంత్

a

News | Published On Dec 23, 2025, 10.22 pm IST

CM Revanth: స‌మిష్టిగా ప‌నిచేస్తేనే రైజింగ్ ల‌క్ష్యాలు చేరుకుంటాం : సీఎం రేవంత్
Advertisement

స‌మిష్టిగా ప‌నిచేస్తేనే రైజింగ్ ల‌క్ష్యాలు చేరుకుంటాం : సీఎం రేవంత్

త్రినేత్ర‌.న్యూస్‌: అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పని చేస్తే తెలంగాణ రైజింగ్ విజన్ 2047 భవిష్యత్తు లక్ష్యాలను అలవోకగా సాధించగలమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజన్ అంటే కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, విజన్లో ఉన్న ప్రతి అంశం అమలు చేసేందుకు వెంటనే నడుం బిగించాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు సీఎం అప్రమత్తం చేశారు. రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ప్రణాళిక, కార్యాచరణ దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధికి అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

‘ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం, కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ లాంటి వివిధ శాఖలకు సంబంధించి ఒక పాలసీ లేకపోవడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాల్లో పాలసీలు అమలు చేశాం..’ అని సీఎం అన్నారు. రాష్ట్రానికి పాలసీలతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రాన్ని క్యూర్ ( CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని.. ప్రభుత్వం ఎంత గొప్ప కార్యాచరణ తీసుకున్నా, అది నూటికి నూరు పాళ్లు విజయవంతం కావాలంటే అధికారుల సహకారం ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఇప్పటికంటే పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం అధికారులను హెచ్చరించారు. పనితీరులో మార్పు రాకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గరం..నరం.. బేషరమ్గా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై ప్రతీ నెల కార్యదర్శుల పనితీరుపై సమీక్ష ఉంటుందని, కార్యదర్శులందరూ తమ పనితీరు, శాఖల పురోగతిపై సీఎస్ కు ప్రతీ నెల రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మీ పనితీరుపై స్వయంగా తాను సమీక్ష నిర్వహిస్తానని సీఎం అన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలని, నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు.

శాఖల మధ్య, శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు రావని సీఎం అభిప్రాయపడ్డారు. అభివృద్ధి విషయంలో శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. రైజింగ్ విజన్ అమలుకు అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి వివిధ అంశాలపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో మూడు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో సీఎం రామకృష్ణారావుతో స్పెషల్ సీఎస్లు, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు.

సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా సీఎస్ కు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలని సీఎం హెచ్చరించారు. ఉద్యోగాల డేటా విషయంలో పూర్తి బాధ్యతను అధికారులదేనని సీఎం హెచ్చరించారు.

హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతటా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను ఖాళీ చేసి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని సీఎం అన్నారు. ఖాళీ స్థలాల్లో సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 113 మున్సిపల్ ఆఫీసులకు సొంత భవనాలున్నాయా.. ఎక్కడెక్కడ అద్దె భవనాలున్నాయో వెంటనే గుర్తించి నివేదిక అందించాలన్నారు. ప్రజలకు సేవలందించే ఆఫీసులు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని ఆదేశించారు. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలని, లేదంటే ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి వెంటనే నిర్మాణాలకు అంచనాలు రూపొందించాలని సీఎం చెప్పారు. మున్సిపల్ ఆఫీసులతో పాటు అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వాటాగా చెల్లిస్తే, కేంద్రం దాదాపు 60 శాతం ఈ పథకాలకు నిధులు ఇస్తుంది. ఈ పథకాలతో దాదాపు రూ.3 వేల కోట్లు తెచ్చుకునే వీలుందని, అందుకు వీలుగా అన్ని శాఖలు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సంప్రదింపులు జరపాలని సీఎం ఆదేశించారు. సీఎస్ఎస్ నుంచి వచ్చే నిధులకు అవసరమైన రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వాటి పురోగతిని ప్రతి వారం సమీక్షించుకోవాలని సీఎం ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి 31లోగా ఈ ఫైలింగ్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకుండా అన్ని ఆన్లైన్లోనే జరగాలని సీఎం ఆదేశించారు.

అన్ని విభాగాలు తమ శాఖ పరిధిలోని కార్యక్రమాల అమలుకు సంబంధించి డాష్ బోర్డు సిద్ధం చేయాలని చెప్పారు. డాష్ బోర్డును సీఎస్, సీఎంవో డాష్ బోర్డులకు అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అన్ని శాఖల పర్యవేక్షణ సులభతరం అవుతుందని, పనితీరు మెరుగుపడుతుందని సీఎం అన్నారు.

రాష్ట్రానికి వెల్లువలా వచ్చిన పెట్టుబడులు ఎంత మేరకు గ్రౌండయ్యాయి.. వాటి పురోగతిని ప్రతి నెలా సమీక్షించుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సీఎం సూచించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement