త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dr. Errolla Srinivas | బెస్ట్ అవైల‌బుల్ స్కూళ్ల నిర్వీర్యానికి కాంగ్రెస్‌ కుట్ర‌: ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌

Dr. Errolla Srinivas | సీఆర్ పై ఉన్న‌ కోపంతో సీఎం రేవంత్ రెడ్డి విద్య‌ను నిర్వీర్యం చేస్తున్నాడని.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (Best Available Schools) లో చదివే 34 వేల మంది విద్యార్థుల జీవితాల‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రోడ్డున పడేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని బీఆర్ఎస్ నేత‌(BRS Leader), ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్(Errolla Srinivas) ఆరోపించారు.

S

News | Published On Apr 11, 2026, 1.48 pm IST

Dr. Errolla Srinivas | బెస్ట్ అవైల‌బుల్ స్కూళ్ల నిర్వీర్యానికి కాంగ్రెస్‌ కుట్ర‌: ఎర్రోళ్ల శ్రీ‌నివాస్‌
Advertisement

నేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ పై ఉన్న‌ కోపంతో సీఎం రేవంత్ రెడ్డి విద్య‌ను నిర్వీర్యం చేస్తున్నాడని.. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (Best Available Schools) లో చదివే 34 వేల మంది విద్యార్థుల జీవితాల‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం రోడ్డున పడేసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని బీఆర్ఎస్ నేత‌ (BRS Leader), ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ (Errolla Srinivas) ఆరోపించారు. అసమర్థ పాలన వల్ల గురుకుల పాఠశాలలు మూత ప‌డే ప‌రిస్థితి వచ్చింద‌న్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ భూముల చుట్టూ, పేదల చుట్టే తిరుగుతున్నాడని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడమే సరిపోతుందని ధ్వ‌జ‌మెత్తారు.

పెండింగ్‌లో రూ.218 కోట్ల బిల్లులు..

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తానే స్వయంగా 700 మంది పిల్లలకు గురుకుల పాఠశాలలో చదివేందుకు లెటర్లు ఇచ్చాన‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 240 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండ‌గా రూ.218 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండానే సోషల్ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుద‌ల చేసినట్లు పాలాభిషేకం చేశార‌ని ఎద్దేవా చేశారు. ఆకునూరి మురళి సూచించిన‌ అంశాలను ఈ ప్ర‌భుత్వం అమ‌లు చేసేలా ఉంద‌న్నారు. ఆదిలాబాద్, తొర్రూరు, నల్గొండలో పెండింగ్ బిల్లులతో తీవ్ర ఇబ్బందులున్నాయ‌ని తెలిపారు. దీంతో ఓ ప్రధానోపాధ్యాయుడుకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందన్నారు. బిల్లులు విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పేదల భవిష్యత్ అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌ని చెప్పి విద్యా శాఖను సీఎం దగ్గరే పెట్టుకొన్నాడ‌ని.. ఏ ఒక్కరోజు విద్యా శాఖపై సమీక్ష చెయ్యలేద‌ని మండిప‌డ్డారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం స్పందించ‌లేద‌ని ఫైర‌య్యారు. పేదల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆదుకుంటుంద‌ని విమ‌ర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని వెల్ల‌డించారు.

తెలంగాణ‌లో క‌లెక్ష‌న్స్‌, ప‌క్క రాష్ట్రాల్లో ఎల‌క్ష‌న్స్‌..

కన్న తల్లికి అన్నం పెట్టనోడు, చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తా అన్నట్లు రేవంత్ తీరు ఉంద‌ని ఎద్దేవా చేశారు. సీఎం ఢిల్లీ చుట్టూ తిర‌గ‌డ‌మే స‌రిపోతుంద‌న్నారు. తెలంగాణ‌లో కలెక్షన్స్, పక్క రాష్ట్రాల్లో ఎల‌క్షన్స్ అన్న‌ట్లు రేవంత్ పాలన ఉంద‌ని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విధానాలు మారకపోతే రాబోయే రోజుల్లో సచివాలయం ముట్టడిస్తామ‌ని ఎర్రోళ్ల హెచ్చ‌రించారు.

ప్రెస్‌మీట్‌లో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్, వాల్యానాయక్, పార్టీ నేతలు గోసుల శ్రీనివాస్ యాదవ్, కొమ్ముల నరేందర్, కీర్తిలత గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement