త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భార‌త్‌కు జిన్‌పింగ్‌.. నేడు మోదీతో కీలక భేటీ

Xi Jinping | భారత్‌–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం జాతీయ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ఆయన.. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్నారు. జిన్‌పింగ్‌కు కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద‌ ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

P

National | Published On Sep 12, 2026, 1.24 pm IST

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భార‌త్‌కు జిన్‌పింగ్‌.. నేడు మోదీతో కీలక భేటీ
Advertisement

Xi Jinping | భారత్‌–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం జాతీయ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ఆయన.. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్నారు. జిన్‌పింగ్‌కు కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద‌ ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక కళాకారులు సంప్రదాయ నృత్యాలతో చైనా అధ్య‌క్షుడిని స్వాగ‌తించారు. జిన్‌పింగ్‌ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. తూర్పు లద్దాఖ్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన సైనిక ప్రతిష్టంభనతో తీవ్రంగా దెబ్బతిన్న భారత్‌–చైనా సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు ఈ ప‌ర్య‌ట‌న కీల‌కంగా భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాలు విశ్వాస పునరుద్ధరణకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

మోదీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌తో శనివారం సాయంత్రం 6 గంటలకు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితిని ఇరువురు నేతలు సమీక్షించే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సాధార‌ణ స్థితికి తీసుకురావాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను మరింత విస్తరించే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్న‌ది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చే మార్గాలపై నేతలు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్‌ పర్యటనకు ముందు భారత్‌–చైనా మధ్య ఉన్నతస్థాయి చర్చలు కొన‌సాగాయి. ఇటీవల బీజింగ్‌లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరిగాయి. భారత్‌–చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం, సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతత, సరిహద్దు దాటే సహకారం వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే, అరుణాచల్‌ప్రదేశ్‌ సెక్టార్‌ వెంబడి చైనా సైనిక కార్యకలాపాలపై న్యూఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ–జిన్‌పింగ్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

గల్వాన్ ఘ‌ట‌న‌ తర్వాత మారిన సమీకరణాలు

2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం భారత్‌–చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైన్యాల మధ్య సుదీర్ఘ ప్రతిష్టంభన కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు దాదాపుగా స్తంభించాయి. గత ఏడాది కాలంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు దేశాలు ముందుకువ‌చ్చాయి. ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు, విశ్వాస నిర్మాణ చర్యల ద్వారా సంబంధాలను క్రమంగా పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, భారత్‌–చైనా సరిహద్దు వివాదంపై సమగ్ర పరిష్కారం కోసం 2003లో ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత తరఫున అజిత్‌ దోవల్‌, చైనా తరఫున వాంగ్‌ యీ ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. 3,488 కిలోమీటర్ల పొడవైన భారత్‌–చైనా సరిహద్దు వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని క‌నుగొన‌డ‌మే ప్ర‌ధాన‌ల‌క్ష్యం. గత ఏడాది ఆగస్టు 31న చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. తాజాగా జిన్‌పింగ్‌ ఏడేళ్ల తర్వాత భారత్‌ పర్యటనకు రావడం.. ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? అన్న ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement