త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన

తెలంగాణలోని 31 వేల మంది మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. పీడన అని విమర్శించారు.

J

Telangana | Published On Sep 12, 2026, 1.26 pm IST

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన
Advertisement
  • కొత్త జీవో 1181 ద్వారా మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిన ప్రభుత్వం
  • ఈ నిర్ణయంతో 31 వేల మంది ఉద్యోగుల కుటుంబాలపై పడనున్న తీవ్ర ఆర్థిక భారం
  • కాంగ్రెస్ తీరుపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఫైర్
  • తక్షణమే జీవోను రద్దు చేసి వేతన రక్షణ కల్పించాలని, రెగ్యులర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్

Harish Rao vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ (Outsourcing) ఉద్యోగులకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త నిబంధనల పేరుతో వారి వేతనాల్లో కోతలు విధించడంపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు.

"మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. సీఎం రేవంత్ రెడ్డి గారు.. మీరు చెప్పే ప్రజా పాలన ఇదేనా?" అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. గడచిన 20 నుంచి 25 ఏళ్లుగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న మున్సిపల్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

శాపంగా మారిన జీవో 1181

మున్సిపల్ కార్మికుల వేతనాల్లో కోత విధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 12, 2026న తీసుకొచ్చిన జీవో నెంబర్ 1181 (G.O.Rt.No.1181) ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు విమర్శించారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ సిస్టమ్ (System) లో కీలకంగా పనిచేస్తున్న వారి అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి, జీతాలు తగ్గించడం దారుణమన్నారు. ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 వేల మంది కుటుంబాలపై పెను ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ డిమాండ్స్ ఇవే..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు వేతనాల పెంపు (Salary hike) ఉంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనలో వేతనాల కోతలు కనిపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. జీతాలు తగ్గించడం ప్రజా పాలన కాదని, అది "ప్రజా పీడన" అవుతుందని ఘాటుగా విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే జీవో 1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పాత స్టేటస్ (Status) ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే వేతన రక్షణ కల్పించడంతో పాటు.. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సీనియారిటీ ఉన్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement