త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్‌ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!

Bullet Train Technology | భారత్‌లో తొలిసారిగా ముంబై–అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. గంటకు దాదాపు 320 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు వస్తే? ప్రయాణికుల భద్రత ఏంటి? అనే సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో సరికొత్త సాంకేతికతను వినియోగించనున్నారు.

P

National | Published On Sep 22, 2026, 6.48 pm IST

Bullet Train Technology | భూకంపం వస్తే బుల్లెట్‌ రైలు ఆటోమేటిక్ ఆగిపోతుంది!
Advertisement
  • 320 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లినా ప్రకంపనలతోనే అప్రమత్తం
  • ముంబయి–అహ్మదాబాద్ కారిడార్‌లో 28 సీస్మోమీటర్ల ఏర్పాటు
  • ప్ర‌కంప‌న‌లు గుర్తించి వెంట‌నే విద్యుత్‌ సరఫరా బంద్‌, ఎమర్జెన్సీ బ్రేకులు

Bullet Train Technology | భారత్‌లో తొలిసారిగా ముంబై–అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. గంటకు దాదాపు 320 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భూప్రకంపనలు వస్తే? ప్రయాణికుల భద్రత ఏంటి? అనే సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో సరికొత్త సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రత్యేకంగా భూకంపాల హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. భూమిలో పుట్టే తొలి ప్రకంపనలను గుర్తించేలా 28 సీస్మోమీటర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. భూకంప సంకేతం అందిన వెంటనే ప్రభావిత మార్గానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి.. రైలును అత్యవసరంగా నిలిపే ప్రక్రియ ప్రారంభిస్తారు.

తొలి ప్రకంపనలతోనే అలర్ట్‌

భూకంపం సమయంలో ముందుగా వచ్చే పీ-వేవ్స్‌ (P-waves)ను సీస్మోమీటర్లు గుర్తిస్తాయి. వీటి తర్వాత సాధారణంగా మరింత బలమైన ప్రకంపనలు వస్తాయి. ఈ మధ్యలో లభించే సమయాన్ని రైలును సురక్షితంగా నిలిపేందుకు ఉపయోగించనున్నారు. జపాన్‌ షింకాన్సెన్‌ హైస్పీడ్ రైళ్లలో వినియోగించే సాంకేతిక విధానాన్ని దీనికి ఆధారంగా తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావిత ప్రాంతంలో ట్రాక్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే ప్రక్రియను వ్యవస్థ ప్రారంభిస్తుంది. రైలు వ్యవస్థలో విద్యుత్‌ సరఫరాలో మార్పు గుర్తించిన వెంటనే ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. బలమైన ప్రకంపనలు వచ్చే ప్రాంతానికి రైలు చేరుకునేలోపే దాన్ని నిలిపేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, భూకంపం వల్ల జరిగే ప్రతి నష్టాన్ని ఈ వ్యవస్థ పూర్తిగా నివారించలేదు. భూకంపం తొలి సంకేతాలను వీలైనంత త్వరగా గుర్తించి.. రైలును సురక్షితంగా నిలిపేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించడమే దీని ప్రధాన ఉద్దేశం.

28 సీస్మోమీటర్లు ఎక్కడ?

కారిడార్‌ వెంట మొత్తం 28 సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 22 సెన్సర్లను ట్రాక్షన్‌ సబ్‌స్టేషన్లు, స్విచింగ్‌ పోస్టుల వద్ద ఏర్పాటు చేస్తారు. మరో ఆరు సెన్సర్లను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్రలో ముంబ‌యి, థానే, విరార్, బోయిసర్‌ ప్రాంతాల్లో 8 సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌లో వాణి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో 14 సెన్సార్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. మిగిలిన ఆరు సెన్సార్లను మహారాష్ట్రలోని ఖేడ్, రత్నగిరి, లాతూర్, పాంగ్రీతో పాటు గుజరాత్‌లోని అదేసర్, ఓల్డ్‌ భుజ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో గతంలో నమోదైన భూకంపాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అత్యంత వేగంతో నడిచే రైళ్లలో భూకంపాల ముప్పును ఎదుర్కొనేందుకు జపాన్‌ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఈ వ్యవస్థలో ఉపయోగించనున్నారు. భూకంపం సంభవించిన తర్వాత స్పందించడం కాకుండా.. తొలి ప్రకంపనలతోనే గుర్తించి రైలును నిలిపేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం దీని ప్రత్యేకత.

Advertisement
Advertisement