త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar Liquor Ban | బీహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తారా? కొత్త సీఎం రాకతో మందుబాబుల్లో కొత్త ఆశలు

బీహార్‌లో మద్యపాన నిషేధం కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జోరుగా సాగుతోంది. దానితో పాటు నకిలీ మద్యం కూడా రాష్ట్రంలో ఏరులై పారుతోంది. దీని వల్ల చాలా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

J

National | Published On Apr 15, 2026, 4.22 pm IST

Bihar Liquor Ban | బీహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తారా? కొత్త సీఎం రాకతో మందుబాబుల్లో కొత్త ఆశలు
Advertisement

Bihar Liquor Ban | బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2016న అప్పటి బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండు దశల్లో మద్యాపానాన్ని నిషేధించింది. ఏప్రిల్ 1, 2026న దేశీ మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆ తర్వాత ఏప్రిల్ 5, 2016న అన్ని రకాల మద్యం, విదేశీ మద్యంపై కూడా సంపూర్ణ నిషేధాన్ని విధించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళా సంఘాల విజ్ఞప్తి మేరకు తాము అధికారంలోకి రాగానే మద్యపానాన్ని నిషేధిస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే బీహార్ మద్యపాన నిషేధ, ఎక్సైజ్ చట్టం 2016 ను అప్పటి నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గృహ హింసను అరికట్టడం, మహిళల భద్రతను మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని బీహార్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అప్పటికే గుజరాత్, నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది. ఆ తర్వాత నాలుగో రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఈనేపథ్యంలో తాజాగా మరోసారి మద్యపాన నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. దానికి కారణం.. బీహార్‌లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. ఏప్రిల్ 15న బుధవారం బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బీహార్ 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బీహార్ రాష్ట్ర చరిత్రలోనే సీఎం పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా సామ్రాట్ చరిత్ర సృష్టించాడు. ఆయన ప్రమాణ స్వీకారం కాగానే బీహార్‌లో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసే అవకాశం ఉందంటూ జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

మద్యపాన నిషేధం వల్ల తగ్గుతున్న రాష్ట్ర ఆదాయం

సామ్రాట్ చౌదరి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మద్యపాన నిషేధం ఎత్తివేయాలంటూ డిమాండ్లు వినిపించడానికి కారణం ఒకప్పుడు సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలే. బీహార్ రాష్ట్రానికి మద్యపాన నిషేధం వల్ల వేల కోట్ల ఆదాయం తగ్గిందని వ్యాఖ్యానించారు. అందుకే.. ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారేమో అని మందుబాబులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి మద్దతు

మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ అలియాస్ బాహుబలి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మద్యం మళ్లీ అందుబాటులోకి రావాలి.. అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. దీనిపై త్వరలో కొత్త సీఎంతో మాట్లాడుతా అంటూ బాహుబలి కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి మద్యపాన నిషేధం ఎత్తివేత అంశం తెర మీదికి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై బజ్ వచ్చింది.

అక్రమంగా మద్యం రవాణా

మరోవైపు బీహార్‌లో మద్యపాన నిషేధం కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జోరుగా సాగుతోంది. దానితో పాటు నకిలీ మద్యం కూడా రాష్ట్రంలో ఏరులై పారుతోంది. దీని వల్ల చాలా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఈ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలా? లేక ఈ చట్టాన్ని సడలించాలా? అనే దానిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement
Advertisement