త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

రూ.2,000 దాటితే యూపీఐపై చార్జీలు విధించడానికి చట్టబద్ధత ఏమిటి? ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? కేంద్రం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐలను నిలదీసిన సుప్రీంకోర్టు.

J

National | Published On Sep 28, 2026, 1.38 pm IST

Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

సంక్షిప్త సారాంశం

రూ.2,000 పైబడిన నిర్దిష్ట యూపీఐ (P2M) పేమెంట్స్‌పై విధించే ఎండీఆర్ (MDR) చార్జీలపై సుప్రీంకోర్టు.. కేంద్రం, ఆర్బీఐ, ఎన్‌పీసీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ చార్జీల ద్వారా వచ్చే రాబడి ఎవరికి వెళ్తుంది, వాటిని ఎలా పంచుతారు, దీనికి ఉన్న చట్టబద్ధత ఏమిటో తెలపాలని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల అమలుపై తక్షణ స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పూర్తి అఫిడవిట్ వచ్చిన తర్వాత విచారిస్తామని వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం రుసుము (గరిష్టంగా రూ.300 వరకు) వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది.

Advertisement
  • ఏ చట్టం ప్రకారం వసూలు చేస్తున్నారు?
  • సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

Supreme Court on UPI MDR Fee | త్రినేత్ర.న్యూస్ : డిజిటల్ చెల్లింపుల వినియోగదారులను, చిన్న వ్యాపారులను ప్రభావితం చేసే యూపీఐ ఎండీఆర్ (Merchant Discount Rate - MDR) చార్జీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక స్పందన వ్యక్తం చేసింది. రూ.2,000 దాటిన నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. దీనికిగల చట్టబద్ధత ఏమిటని కేంద్రాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లను వివరణ కోరింది. అయితే ఈ నిబంధనల అమలుపై తక్షణ స్టే ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

ఎవరి ఖాతాల్లోకి ఈ డబ్బు వెళ్తుంది?

సోమవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను లేవనెత్తింది. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడానికి ఏ చట్టం అధికారం ఇస్తోందని ప్రశ్నించింది. అంతేకాకుండా, ఈ చార్జీల ద్వారా వచ్చే ఆదాయం ఎవరికి దక్కుతుంది? ఆ నిధులను బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, ఎన్‌పీసీఐ మధ్య ఎలా పంచుకుంటారు? అనే వివరాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. సంబంధిత విభాగాలన్నీ పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

అక్టోబర్ 15 నుంచి కొత్త రూల్స్ ఏంటి?

గత ఆరేళ్లుగా సామాన్యులకు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్న యూపీఐ సేవల్లో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ప్రకారం...

సాధారణ లావాదేవీలు: వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) పంపే డబ్బులకు, అలాగే రూ.2,000 లోపు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇవి ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం.

రూ.2,000 దాటితే: నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై (P2M) 0.4 శాతం ఫీజు వర్తిస్తుంది.

గరిష్ట పరిమితి: రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి గరిష్టంగా రూ.300 వరకు మాత్రమే చార్జీ వసూలు చేస్తారు.

నిత్యావసర రంగాలు: రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం (పెట్రోల్/డీజిల్), ఎరువుల వంటి తక్కువ మార్జిన్ ఉన్న రంగాల్లో రూ.2,000 దాటిన ప్రతి ట్రాన్సాక్షన్‌కు కేవలం రూ.5 ఫ్లాట్ చార్జ్ మాత్రమే పడుతుంది.

పిటిషనర్ అభ్యంతరం ఏమిటి?

ప్రభుత్వం సెప్టెంబర్ 14న జారీ చేసిన నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న వెల్లడించిన ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను సవాలు చేస్తూ న్యాయవాది అంజన్ దత్తా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. సరైన చట్టపరమైన నిబంధనలు లేకుండా.. ప్రజలు, వ్యాపారులతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఈ భారాన్ని మోపారని ఆయన వాదించారు. చిన్న, సూక్ష్మ వ్యాపారులపై దీని ప్రభావం ఎంతవరకు పడుతుందో పారదర్శకమైన అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

Advertisement
Advertisement