త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్‌

Union Cabinet | రవాణా, లాజిస్టిక్స్‌ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, పర్యవేక్షణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) దీర్ఘకాలిక ఈక్విటీ మూలధనం అందించేందుకు భారీ నిధిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

P

National | Published On Oct 6, 2026, 5.08 pm IST

Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్‌
Advertisement
  • ఎస్‌ఎంఈల కోసం రూ.10 వేల కోట్ల గ్రోత్‌ ఫండ్‌
  • కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Union Cabinet | రవాణా, లాజిస్టిక్స్‌ రంగాల్లో సమగ్ర ప్రణాళిక, పర్యవేక్షణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) దీర్ఘకాలిక ఈక్విటీ మూలధనం అందించేందుకు భారీ నిధిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో రవాణా, లాజిస్టిక్స్‌ రంగాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అథారిటీ (ఐటీఎల్‌ఏ)ను ఏర్పాటు చేయనున్నారు. పరిశోధన, ప్రణాళిక, ప్రాజెక్టుల మూల్యాంకనం, పర్యవేక్షణ, ప్రభావ అంచనాలను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానయానం, అంతర్గత జలరవాణా, తీరప్రాంత షిప్పింగ్‌, పట్టణ రవాణా, లాజిస్టిక్స్‌ వంటి రంగాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాలిక రవాణా ప్రణాళికను ఐటీఎల్‌ఏ రూపొందిస్తుంది. రూ.500 కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే కేంద్ర ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులకు సాంకేతిక పరిశీలన నిర్వహిస్తుంది.

డేటా ఆధారంగా ప్రణాళికలు

రవాణా, మౌలిక వసతుల ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి సమన్వయం చేస్తుంది. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటి ప్రభావాన్ని కూడా అంచనా వేస్తుంది. జీఎస్‌టీఎన్‌ ఈ-వే బిల్లులు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, వాహనాల వివరాలు, జీపీఎస్‌, పట్టణ ట్రాఫిక్‌ డేటాను అనుసంధానించి జాతీయ రవాణా డేటా రిపాజిటరీని రూపొందించనుంది. సరుకు రవాణా ప్రవాహం, రవాణా ప్రారంభ–గమ్యస్థానాల (ఒరిజిన్‌–డెస్టినేషన్‌) విశ్లేషణ ఆధారంగా ప్రాజెక్టుల రూపకల్పనకు సహకరిస్తుంది. అలాగే లాజిస్టిక్స్‌ రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపునకు మద్దతు ఇస్తుంది. జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ–2022ను సమీక్షించి, అవసరాలకు అనుగుణంగా నవీకరించేందుకు సలహాలు అందిస్తుంది.

ఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్ల గ్రోత్‌ ఫండ్‌

చిన్న, మధ్యతరహా సంస్థలకు వృద్ధి మూలధన లోటును అధిగమించేందుకు రూ.10 వేల కోట్ల స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ గ్రోత్‌ ఫండ్‌ (ఎస్‌జీఎఫ్‌)ను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ నిధి ద్వారా అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న ఎస్‌ఎంఈల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టనున్నారు. వాణిజ్యపరంగా నిలదొక్కుకున్న, మరింత విస్తరించే సామర్థ్యం ఉన్న సంస్థలకు దీర్ఘకాలిక ఈక్విటీ మూలధనం అందించడం ఈ ఫండ్‌ లక్ష్యం. నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగంలోని ఎస్‌ఎంఈలకు కేటాయించనున్నారు. సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణల ఆధారిత రంగాలు, వ్యూహాత్మక విలువ గొలుసుల్లోని సంస్థలకు కూడా మద్దతు లభించనుంది. ప్రపంచ స్థాయిలో పోటీపడగల సంస్థలను తీర్చిదిద్దడంతో పాటు వికసిత భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా ఎస్‌ఎంఈల విస్తరణకు ఈ నిధి దోహదపడనుంది.

Advertisement
Advertisement