దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం అవడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సంక్షోభం నుంచి బయటపడలేదు. వందల ఇండిగో విమానాలు రద్దు అవడంపై వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై మాట్లాడారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటన మిగిలిన విమానయాన సంస్థలకు ఒక గుణపాఠం కావాలని స్పష్టం చేశారు. ఇండిగో వైఫల్యమే కారణం విమానాల రద్దు, ఆలస్యానికి ఇండిగో సంస్థ అంతర్గత నిర్వహణ లోపమేనని కేంద్రం మంత్రి అన్నారు. ప్యాసెంజర్ సేఫ్టీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో, సిబ్బంది నిర్వహణలో ఇండిగో విఫలమైందని మంత్రి తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యం తమకు ప్రయాణికుల భద్రత ముఖ్యమని, పైలట్లు, సిబ్బంది భద్రత కూడా పరిగణనలోకి తీసుకొని భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడమన్నారు. ఈ విషయాన్ని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు స్పష్టంగా చెప్పామన్నారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం తేలికగా తీసుకోవడం లేదని, నిబంధనలు పాటించకపోతే ఇండిగోపై కఠిన చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఇండిగో సంక్షోభం ఉదాహరణగా నిలిచేలా చర్యలు ఉంటాయన్నారు. కొత్త ఎయిర్‌లైన్స్‌కు ఆహ్వానం దేశంలో విమానయాన రంగాన్ని విస్తరించేందుకు మరిన్ని కొత్త ఎయిర్‌లైన్స్ రావాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. భారత్‌లో మరో ఐదు పెద్ద ఎయిర్‌లైన్స్‌కు సరిపడ సామర్థ్యం ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.