త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకెదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

కర్ణాటక తలపెట్టిన మేకెదాటు ప్రాజెక్టుపై వివాదం ముదురుతోంది. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ రాశారు.

J

National | Published On May 26, 2026, 5.04 pm IST

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకెదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Advertisement

Mekedatu Dam Issue | త్రినేత్ర.న్యూస్ : దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం (Cauvery Water Dispute) మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన 'మేకెదాటు రిజర్వాయర్' (Mekedatu Dam) నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వివాదంపై చర్చించేందుకు సీఎం విజయ్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

వివాదం ఎక్కడ మొదలైందంటే?

రామనగర జిల్లా కనకపుర సమీపంలోని మేకెదాటు (అంటే మేకల దాటు అని అర్థం) వద్ద ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలని కర్ణాటక చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. అయితే, ఇది సుప్రీంకోర్టు సమర్థించిన కావేరీ వాటర్ ట్రిబ్యునల్ (Cauvery Water Tribunal) నిర్ణయానికి పూర్తి విరుద్ధమని సీఎం విజయ్ తన లేఖలో ప్రధానంగా వాదించారు. ఈ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతోంది?

2018 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. కావేరీ నది ఎగువన ఉన్న రాష్ట్రాలు, దిగువన (Downstream) ఉన్న రాష్ట్రాల అనుమతి లేకుండా ఎలాంటి డ్యామ్‌లు లేదా రిజర్వాయర్‌లను నిర్మించకూడదు. ఈ నిబంధన ప్రకారం చూస్తే, కర్ణాటక ఇక్కడ మేకెదాటు డ్యామ్ కట్టాలంటే తప్పనిసరిగా తమిళనాడు, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది.

సీఎం విజయ్ లేఖలో ఏముంది?

"ట్రిబ్యునల్ అనుమతించిన ప్రాజెక్టుల జాబితాలో మేకెదాటు లేదు. కావేరీ బేసిన్‌లో ఇప్పటికే నీటి కొరత తీవ్రంగా ఉంది. అందుబాటులో ఉన్న నీటిని ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. కాబట్టి, కర్ణాటక కొత్తగా రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకోవడం సుప్రీంకోర్టు తీర్పును స్పష్టంగా ఉల్లంఘించడమే" అని విజయ్ లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ఆమోదం లేకుండా కర్ణాటక ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రధాని మోదీ తగిన సలహా ఇవ్వాలని ఆయన కోరారు.

డీకే శివకుమార్ ఏమన్నారంటే..

ఇదిలా ఉంటే, మేకేదాటు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (DPR)ను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని, ఆమోదం రాగానే శంకుస్థాపన చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల ప్రకటించారు. "తమిళనాడుకు 177 టీఎంసీల నీటిని విడుదల చేయాలనే స్పష్టమైన ఆదేశం ఉంది. మేకెదాటు ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు తమిళనాడుకు లేదని సుప్రీంకోర్టు చెప్పింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపాయి.

డీకే శివకుమార్ అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్ష డీఎంకే (DMK) మండిపడింది. కావేరీ నదిపై తమిళనాడు హక్కులను కాలరాసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలను సీఎం విజయ్ తీవ్రంగా ఖండించాలని, ఆ ప్రాజెక్టును తొలి దశలోనే అడ్డుకోవాలని డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement