త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinas monster dam | నేపాల్ త‌ర‌హాలో.. భార‌త్‌కు పొంచి ఉన్న చైనా “వాట‌ర్ బాంబ్‌”

Chinas monster dam | నేపాల్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌లు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టానికి కార‌ణ‌మ‌య్యాయి. అయితే, ఈ విప‌త్తు గురించి చైనాకు ముందే తెలిసినా మౌనం వ‌హించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా నేపాల్‌ పెను విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అదే ముప్పు వాట‌ర్ బాంబ్ రూపంలో భార‌త్‌కూ పొంచి ఉంద‌న్న ఆందోళ‌న‌ల‌ను ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

D

National | Published On Aug 27, 2026, 12.28 pm IST

Chinas monster dam | నేపాల్ త‌ర‌హాలో.. భార‌త్‌కు పొంచి ఉన్న చైనా “వాట‌ర్ బాంబ్‌”
Advertisement

Chinas monster dam | త్రినేత్ర‌.న్యూస్ : నేపాల్‌-టిబెట్ స‌రిహ‌ద్దులో మంచు కొండ విరిగిప‌డటంతో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఈ జ‌ల ప్ర‌ళ‌యంలో 160 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆచూకీ గ‌ల్లంతైంది. అయితే, ఈ విప‌త్తు గురించి చైనాకు ముందే తెలిసినా నేపాల్‌ను అప్ర‌మ‌త్తం చేయ‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. విప‌త్తు గురించి ముందు మౌనం వ‌హించిన డ్రాగ‌న్‌.. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత ఈ వ‌ర‌ద‌ల గురించి నేపాల్‌ను చైనా అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చైనా తీరువ‌ల్లే నేపాల్‌లో భారీ ప్రాణ‌న‌ష్టానికి కార‌ణ‌మైంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో భారత్ సరిహద్దుకు ఆనుకుని చైనా నిర్మిస్తున్న ఒక భారీ డ్యామ్‌పై (Chinas monster dam) నిపుణులను ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. నేపాల్ విష‌యంలో చైనా వైఖ‌రి ఇప్పుడు భార‌త్‌కూ అలాంటి ముప్పే పొంది ఉంద‌ని చెబుతున్నారు.

వాటర్ బాంబ్

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సమీపంలో బ్ర‌హ్మ‌పుత్ర న‌ది (Brahmaputra)ని టిబెట్‌లో యార్లోంగో త్సాంగ్పో అంటారు. ఈ న‌దిపై చైనా జ‌ల‌విద్యుత్‌ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇందుకోసం భారీ డ్యామ్ నిర్మాణం చేప‌ట్టింది. చైనా ఆక్రమిత టిబెట్ అటానమస్ రీజియన్ (TAR) పరిధిలోని మెడోగ్ ప్రాంతంలో ఏకంగా 167 బిలియ‌న్ డాల‌ర్ల అంచ‌నా వ్య‌యంతో 60,000 మెగావాట్ల (MW) సామర్థ్యంతో ఈ డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను 2033 నాటికి ప్రారంభించాలని బీజింగ్ యోచిస్తోంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌కన్నా ఇది మూడురెట్లు భారీది. చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ ప్రాంతంమే ఇప్పుడు భార‌త్‌కు పెను ముప్పుగా మారింది. ఈ డ్యామ్ పరిమాణం చాలా భారీగా ఉండటమే కాకుండా, భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో నిర్మిస్తుండ‌టంతో ఈ డ్యామ్‌ను నిపుణులు "వాటర్ బాంబ్"గా పేర్కొంటున్నారు.

మెడోగ్ డ్యామ్ నిర్మాణ భద్రతపై ఆందోళ‌న‌లు

చైనా నిర్మిస్తున్న మెడోగ్ ఆనకట్ట యార్లంగ్ త్సాంగ్పో నది టిబెట్‌లోని నామ్చా బర్వా పర్వతం చుట్టూ ఒక పెద్ద మలుపు తీసుకునే అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఈ నది ఒక లోతైన లోయ గుండా నిటారుగా కిందికి ప్రవహిస్తుంది. ఇక్క‌డ జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తిని ఎక్కువ‌గా చేసే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో వరుసగా ఐదు జలవిద్యుత్ కేంద్రాలను అభివృద్ధి చేయాలని చైనా యోచిస్తోంది. ప్ర‌స్తుతం చేప‌డుతున్న‌ ప్రాజెక్టుపై చైనా ప్రభుత్వ ఆధీనంలోని జియలాజికల్‌ సర్వే పర్యవేక్షణలో శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ఓ అధ్య‌యంలో మెడోగ్ డ్యామ్ నిర్మాణ భద్రతపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

భూంక‌పాలు సంభ‌విస్తే విధ్వంస‌మే..

హిమాలయ ప్రాంతం ఇప్పటికే భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతం. భారత, యురేషియా భూఫలకాలు ఢీకొంటున్న ప్రాంతంలోనే ఈ భారీ నిర్మాణం జరుగుతోంది. డ్యామ్‌ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కింది భాగంలో ఓ చురుకైన‌ ‘పైజెన్‌ ఫాల్ట్‌’ ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇది మంచుయుగం కాలం నుంచి చురుగ్గా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఇంత‌టి ప్రమాద ప్రాంతంలో చైనా డ్యామ్ నిర్మాణం చేప‌డుతోంది. ఇక్క‌డ భూకంపాలు సంభ‌విస్తే.. ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డం దాదాపు క‌ష్ట‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యామ్‌లు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఈ డ్యామ్ భద్రత అంశంలో ఇప్పుడు ఆందోళనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చైనా ఆధీనంలోకి బ్రహ్మపుత్ర జలాలు

అంతేకాదు, డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని నియంత్రించగల చైనా సామర్థ్యం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్న మరో ముఖ్యమైన అంశం. బ్ర‌హ్మ‌పుత్ర న‌ది టిబెట్ నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశిస్తుంది. అక్క‌డి నుంచి అస్సాం గుండా.. బంగ్లాదేశ్‌లోకి ప్ర‌వేశిస్తుంది. ఈ న‌ది వ్య‌వ‌సాయానికి, ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌కు కీల‌క‌మైన‌ది. స‌మ్మ‌ర్‌లో ఈ డ్యామ్ ద్వారా దిగువ‌కు నీటి విడుద‌ల‌ను చైనా నియంత్రిస్తే వ్య‌వ‌సాయం, మ‌త్స్య ప‌రిశ్ర‌మ‌, స్థానిక ప్ర‌జ‌ల‌కు నీటి ల‌భ్య‌త క‌ష్ట‌త‌మ‌వుతుంది. హిమాల‌య ప్రాంతం భూకంపాల‌ను గుర‌య్యే జోన్‌. ఇక్క‌డ భారీ ప్రాజెక్టులు నిర్మించ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త తెబ్బ‌తిన‌డ‌మే కాకుండా.. జీవ‌నోపాధి దెబ్బ‌తింటుంది. న‌దిపై ఆధార‌ప‌డే ల‌క్ష‌లాది మంది రైలులు, మ‌త్స్య‌కారుల ఉపాధి ప్ర‌మాదంలో ప‌డుతుంది. అంతేకాదు, భారీ వ‌ర్షాల స‌మ‌యంలో డ్యామ్ నుంచి నీటిని ఒక్క‌సారిగా కింద‌కు విడుద‌ల చేస్తే దిగువ ప్రాంతాల్లో వ‌ర‌ద ముప్పు పెరిగే ప్ర‌మాదం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు సంభ‌వించే అవ‌కాశం ఎక్కువ‌.

ఈశాన్య రాష్ట్రాలకు వ‌ర‌ద ముప్పు..

నదీ జలాల పంపిణీకి సంబంధించి భారత్-చైనా మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. ఒక‌వేళ ఏదైనా ముప్పుకు సంబంధించిన స‌మాచారాన్ని చైనా దాచ‌డం లేదా ఆల‌స్యంగా ఇవ్వ‌డం వ‌ల్ల దిగువ ప్రాంతాల్లో ప‌రిస్థితి ఊహ‌కంద‌ని విషాదంగా మారే అవ‌కాశం ఉంది. నేడు నేపాల్‌లో జ‌రిగిన విధ్వంస‌మే.. చైనా మెడోగ్ డ్యామ్ వ‌ల్ల భార‌త‌దేశ ఈశాన్య ప్రాంతాలకు పొంచి ఉంద‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఎగువన చైనా నిర్మిస్తున్న డ్యామ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ కూడా అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని యోచిస్తోంది. సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల భారీ సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను వేగ‌వంతం చేసింది.

Also Read..

నేపాల్ జ‌ల ప్ర‌ళ‌యం.. 300 మంది భార‌తీయులు గ‌ల్లంతు.. పొంచి ఉన్న మ‌రో ముప్పు

నేపాల్‌లో వ‌ర‌ద బీభ‌త్సం... వీడియోలు

భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..

Advertisement
Advertisement