త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nepal Flash Floods | నేపాల్ జ‌ల ప్ర‌ళ‌యం.. 300 మంది భార‌తీయులు గ‌ల్లంతు.. పొంచి ఉన్న మ‌రో ముప్పు

Nepal Flash Floods | నేపాల్‌లో సంభ‌వించిన మెరుపు వ‌ర‌ద‌ల‌కు (Nepal Flash Floods) భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గ‌ల్లంత‌య్యారు. ఆచూకీ గ‌ల్లంతైన వారిలో 300 మంది భార‌తీయులు ఉన్న‌ట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖ‌నాల్ తెలిపారు. అధిక‌శాతం కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్రికులే అని వెల్ల‌డించారు.

D

National | Published On Aug 27, 2026, 10.53 am IST

Nepal Flash Floods | నేపాల్ జ‌ల ప్ర‌ళ‌యం.. 300 మంది భార‌తీయులు గ‌ల్లంతు.. పొంచి ఉన్న మ‌రో ముప్పు
Advertisement

Nepal Flash Floods | త్రినేత్ర‌.న్యూస్ : హిమాలయ దేశం నేపాల్‌లో జల ప్రళయం విలయతాండవం చేసింది. టిబెట్ ప్రాంతం నుంచి ఉద్భ‌వించే భోటే కోషి న‌దిలో బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా నీటి మ‌ట్టం పెరగ‌డంతో మెరుపు వ‌ర‌ద‌లు (Nepal Flash Floods) సంభ‌వించాయి. ఈ వ‌ర‌ద‌ల్లో భారీగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. జ‌ల‌ప్ర‌ళ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గ‌ల్లంత‌య్యారు. మిస్సైన‌వారిలో భార‌తీయులు కూడా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఈ విష‌యాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి శిశిర్ ఖ‌నాల్ తెలిపారు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌ట్ట‌ణాలు తుడిచిపెట్టుకుపోయిన‌ట్లు వెల్ల‌డించారు. "ర‌సువా ప్రాంతంలో జ‌రిగిన ఈ విషాదంలో 160 మంది మ‌ర‌ణించారు. వేలాది కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయి. వేలాది మంది ఆచూకీ గ‌ల్లంతైంది. క‌నీసం 500 మంది విదేశీయుల ఆచూకీ తెలియ‌కుండా పోయింది. వారిలో సుమారు 300 మంది భార‌తీయులు ఉన్నారు. అధిక‌శాతం కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్రికులే" అని శిశిర్ ఖ‌నాల్ వెల్ల‌డించారు. గ‌ల్లంతైన విదేశీ యాత్రికుల భ‌ద్ర‌త విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. గ‌ల్లంతైన వారి స‌మాచారం కోసం ఇత‌ర దేశాల రాయ‌బార కార్యాల‌యాల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. నేపాల్ చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఇది ఒకటిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

జ‌ల‌ప్ర‌ళ‌యానికి అదే కార‌ణం.. తేల్చిన అమెరికా

ఈ జ‌ల‌ప్ర‌ళ‌యానికి మంచుకొండ‌ల్లో సంభ‌వించిన‌ భూకంపమే కార‌ణ‌మ‌ని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఎగువన ఉన్న హిమనీ స‌ర‌స్సు బ‌ద్ద‌ల‌వ్వ‌డ‌మే కార‌ణ‌మ‌ని అమెరికా తేల్చింది. నేపాల్‌ కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు నేపాల్‌-చైనా సరిహద్దు సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తొలుత యూఎస్‌జీఎస్‌ ప్రకటించింది. తర్వాత ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి అసలు విషయం వెల్లడించింది. అక్కడ ఎలాంటి భూకంపం సంభవించలేదని స్పష్టం చేసింది. ఉపగ్రహ చిత్రాల ప్రాథమిక పరిశీలనలో హిమ‌నీ స‌ర‌స్సు బ‌ద్ధ‌లై భారీ మంచు చ‌రియ‌లు, రాళ్లు ప‌డిన‌ట్లు గుర్తించిన‌ట్లు తెలిపింది. మంచు, రాళ్లు, మట్టితో కూడిన ప్రవాహం ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చిన‌ట్లు వివ‌రించింది.

30 నిమిషాల్లో 9 మీటర్లు ఉప్పొంగి..

ఆక‌స్మిక వ‌ర‌ద‌ల కార‌ణంగా నేపాల్‌, టిబెట్ ప్రాంతంలోని న‌దుల్లో నీటిమ‌ట్టం ఒక్క‌సారిగా భారీగా పెరిగింది. గల్చి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. భోటే కోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండ చరియలు దూసుకువచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి. ఆ తర్వాత భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి నీటి ప్ర‌వాహం చేరింది. దీని ఫ‌లితంగా భారీ విధ్వంసం సంభ‌వించింది.

ఇంకా పొంచి ఉన్న ముప్పు..

ఇప్ప‌టికే సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌కు గ్రామాల‌కు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిలు, వాహ‌నాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. అనేక మంది ఆచూకీ గ‌ల్లంతైంది. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, వ‌ర‌ద ముప్పు ఇంకా తొలిగిపోలేద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. నేపాల్‌-చైనా సరిహద్దులోని నదిలో ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న బ్లాకేజీ ఇంకా ఉందని, దాని కారణంగా మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని హెచ్చ‌రించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

భారత్ చేయూత

ఇంత‌టి క‌ష్ట‌కాలంలో నేపాల్‌ను ఆదుకునేందుకు భార‌త్ ముందుకొచ్చింది. విప‌త్తు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా త‌న మాన‌వ‌తా దృక్ప‌థాన్ని చాటుకుంది. నేపాల్‌కు అవసరమైన అత్యవసర సహాయం, వైద్య బృందాలను ఖాఠ్మాండుకు పంపింది. భారత వాయుసేనకు చెందిన 'సీ-130జే' రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామగ్రిని అత్యవసరంగా నేపాల్‌కు తరలించింది. ఇందులో టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ లాంతర్లు, మెడిసిన్స్‌ ఉన్నాయి.

32 మంది బెంగాలీలు..

నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన‌వారిలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన 32 మంది ఉన్న‌ట్లు తెలిసింది. కోల్‌క‌తాకు చెందిన వారంతా కైలాష్-మానసరోవర్ యాత్రకు వెళ్లిన‌ట్లు అధికారులు తెలిపారు. 30 మంది పర్యాటకులు, ఇద్దరు టూర్ మేనేజర్ల‌తో కూడిన బృందం ఆగ‌స్టు 21న కోల్‌క‌తా నుంచి బ‌య‌ల్దేరిన‌ట్లు చెప్పారు. మ‌రుస‌టి రోజే వారు నేపాల్ చేరుకున్న‌ట్లు వివ‌రించారు. మెరుపు వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో వీరంతా ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఉన్నార‌ని స‌ద‌రు అధికారి వెల్ల‌డించారు. ఈ బృందం సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఆచూకీ లేకుండా పోయారని పేర్కొన్నారు.

80 మంది ఈశా ఫౌండేష‌న్ స‌భ్యులు..

ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్‌ (Isha Foundation)కు చెందిన 80మంది యాత్రికులు కూడా గల్లంతయ్యారు. నేపాల్ స‌రిహ‌ద్దు స‌మీపంలోని టిబెట్‌లోని గ్యిరాంగ్ (Gyirong) పట్టణంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో త‌మ బృందానికి చెందిన స‌భ్యులు గ‌ల్లంతైన‌ట్లు ఫౌండేష‌న్ తెలిపింది. వారిని వెతికేందుకు త‌మ‌కు అనుమ‌తివ్వాలంటూ ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ చైనా అధికారుల‌ను అభ్య‌ర్థించారు. మానసరోవర్‌ యాత్రకు వెళ్లి తిరుగుపయనమైన త‌మ బృందం ఇమిగ్రేషన్‌ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకున్న‌ట్లు తెలిపారు. వ‌ర‌ద‌ల త‌ర్వాత వారి గురించి ఎలాంటి స‌మాచారం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌ల్లంతైన యాత్రికుల కుటుంబాల‌తో క‌లిసి గ్యిరాంగ్‌కు వెళ్లేందుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు.

Also Read..

కొన్ని ర‌కాల ఉద్యోగాల‌ను ఏఐకి ఇవ్వొద్దు.. బిల్‌ గేట్స్ హెచ్చరిక..

రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌.. ఆంధ్ర న్యూస్ చానళ్ల‌కు ప్రధాన రక్షణ కవచాలు!: ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

మీరాలం చెరువు అభివృద్ధి ప‌నుల‌ను అకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్

Advertisement
Advertisement